రోజువారీ అలవాటులో భాగంగా సోమవారం దినపత్రిక చేతిలోకి తీసుకోగానే పతాకవార్తగా తుపాకుల మోత కంటపడింది. ఏటూరునాగారం అడవుల్లో ఏడుగురికాల్చివేత దుర్వార్తను చదవాల్సి రావడం బాధాకరం. పదేండ్ల కిందట ప్రతి ఉదయం మోసుకొచ్చే నెత్తుటి సమాచారమే మళ్లీ పునరావృతమైపోయింది. వినకూడని,కనకూడని, కలలో కూడా రాకూడదనుకునే రాజ్యం రాసే రక్త చరిత్రను, మళ్లీ తెలంగాణ చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పాత దుర్దినాలు మరిచి, పదేండ్ల పాటు ప్రగతి వార్తలకు అలవాటు పడిన సమాజం, ఏడాదిగా ప్రభుత్వం నోటి నుంచి జాలువారుతున్న అబద్ధాన్ని, విసురుతున్న చేతి వాటాన్ని, మోపుతున్న నిర్బంధాన్నిచవిచూస్తున్నది. ఏడాదిలోనే అంతటా అలజడి, అన్ని వర్గాల్లోనూ ఆందోళన అలుముకున్నది.
Telangana | రాష్ర్టాన్ని వెనక్కి నడిపిస్తూ, ప్రజలను నిర్బంధంలోకి నెడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ సాగిస్తున్న అమానవీయ పరిపాలనపై అందరిలో ఆవేదన నిండుకున్నది. రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు ఎలాంటి భయానక భౌతిక పరిస్థితి తెలంగాణలో ఉండేదో, ఏడాదిగా అదే విధమైన గడ్డుకాలం అన్ని గడపల్లోకి వచ్చిపడింది. అలజడి, ఆందోళన, అణచివేత అంతటా మళ్లీ వర్ధిల్లుతున్నది. పల్లెల్లో ఇనుప బూట్ల కవాతు, లాఠీల కోలాటం, సంకెళ్ల సవ్వడి, తుపాకుల గర్జన మళ్లీ మామూలైపోయింది. అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్ల వార్తలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకొని దుఃఖిస్తున్నది. తెలంగాణకు మళ్లీ ఏ దుస్థితి రాకూడదనుకున్నామో, అదే విషమ పరిస్థితి రాష్ట్రమంతటా విస్తారమైపోయింది.
శనివారం నాడు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీలపై ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సర్కార్ సాగిస్తున్న దారుణ దమనకాండకు వ్యతిరేకంగా, దేశ రాజధానిలో నిర్వహిస్తున్న సభకు విపక్ష పార్టీల మద్దతు కోరుతూ, తెలంగాణ భవన్‌కు వారొచ్చారు. ఆ సందర్భంగా కేంద్ర సర్కారే కాదు, రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా హక్కుల హననంలో ఏడాదిలోనే ఎలా కర్కోటకంగా వ్యవహరిస్తున్నదో వారితో చర్చకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఏడో గ్యారెంటీ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన స్వేచ్ఛను, నేడు ఎలా చెరసాలల్లో ఖైదు చేస్తున్నారనే అంశంపై లోతైన చర్చే నడిచింది. ఇప్పుడు రాష్ట్రమే ఆంక్షల వలయంలో, నిర్బంధం నీడలో విలవిలలాడుతున్నది. ఈ వికారమైన మార్పును నిలువరించకపోతే, తెలంగాణ స్వాభావిక ఔన్నత్యం మసకబారిపోతుందని అందరం చర్చించుకున్నాం. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ ప్రగతి పోరులో, పరుగులో భాగంగా, ప్రభుత్వంలోని వ్యవస్థగత సంస్థల ఏమరుపాటుతో ఒకటో రెండో పొరపాట్లు దొర్లి ఉండవచ్చు. కానీ, వికాసానికి విరుద్ధంగా నేడు రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రయోగిస్తున్న దమనకాండ రాష్ర్టానికి ప్రమాదకరంగా మారిపోయింది.
దేశంలో ప్రభుత్వాల పగ్గాలు వివిధ కారణాలతోనో, ప్రేరకాల ప్రభావ రీత్యానో రాజకీయ పార్టీల చేతులు మారడం సాధారణంగా జరిగేదే. కానీ, మారిన ప్రభుత్వం ఏ నమూనా నెత్తిన పెట్టుకొని నడుస్తున్నదనేది తొలి ఏడాది పాలనలో తేటతెల్లమైపోతుంది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బలహీన వర్గాల సంక్షేమం లాంటి అనేక అభ్యుదయ పథకాలు అమలుపరిచిన ఎన్టీఆర్ సర్కార్ కూడా 1989 ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ, తదనంతర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను ఎలా తగులబెట్టిందో, తర్వాతి ఎన్నికల్లో ఏం జరిగిందో చరిత్రలో ఉండనే ఉన్నది. కాంగ్రెస్ చరిత్ర, రేవంత్‌రెడ్డి లాంటి వారి నేపథ్యం, స్వభావం తెలిసి తెలిసి, మధ్య తరగతి, బుద్ధి జీవులు మళ్లీ హస్తం పార్టీ విష ప్రచారం వలకు ఎరకావడమే తెలంగాణకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. తెలంగాణ పునాది సమూహమైన సామాజిక వర్గాలకు ఉన్న రాజకీయ స్పష్టత, నాలుగు అడుగులు ముందుకు జరిగిన వర్గాలకు కరువవ్వడం వల్ల, ఇప్పుడు మళ్లీ తెలంగాణ తల్లడిల్లుతున్నది.
కడుక్కున్న చేతులు ప్రదర్శించినంత మాత్రాన, నేర చరిత్ర, స్వభావం ఏ సంస్థ నుంచైనా, అందునా కాంగ్రెస్ నుంచి మాయమైపోతుందా..?. దానివల్లనే కాంగ్రెస్ మార్క్ అమానవీయ పరిపాలనను ఏడాదిగా ఎదుర్కోక తప్పటం లేదు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పెంచిన జైళ్లు, పండించిన వంచన, పారించిన నెత్తురు అవగాహనపరులకు తెలియదా..? వృద్ధిని ఉరికొయ్యకు వేలాడదీసే హస్తం పార్టీ ప్రభుత్వాల సహజత్వం, దశాబ్దాలుగా మన దేశం, రాష్ట్రం మోసిన సత్యం మరిస్తే ఎలా..?. ప్రభావితవర్గాల తొందరపాటు, సమాజానికి ఎంత నష్టం చేస్తుందో, తెలంగాణకు అనుభవంలోకి వచ్చింది. సొంత ఊరిలో మాజీ సర్పంచ్ మరణానికి కారణమవ్వడమేకాక, స్వప్రయోజనాల కోసం, సొంత నియోజకవర్గ పేద, గిరిజన రైతులను హింసించి, జైళ్లపాలు చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్, రాష్ర్టాన్ని మాత్రం వదిలేస్తుందా..?. అందుకే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, న్యాయం అడిగినోళ్లందరికీ బేడీలు తొడిగేస్తున్నది.
నిర్బంధాన్ని విస్తరించి, జనాన్ని భయంతో నిలువరించడం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుంది? ప్రజలపై రాజ్యహింస విజయం సాధించిన చరిత్ర ఏ దేశంలో, రాష్ట్రంలోనైనా ఉన్న దా..?. అయినా సరే అవకాశం దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ అదే నియంతృత్వ నమూనాను అనుసరించడం సర్వ సాధారణం. ఏడాదిలో ఎన్ని సర్కార్ నేరాలు తెలంగాణలో జరిగా యో లెక్కే లేదు. సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే షాద్‌నగర్‌లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ సంఘటన, నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతులపై థర్డ్ డిగ్రీ, బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి దారుణ హత్య, లగచర్లలో గిరిజనులపై అమానుషం ఇలా ఎన్నో దారుణాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, అక్రమ కేసులు షరామామూలైపోయాయి. ప్రధాన విపక్షమైన బీఆర్ఎస్ నేతలపైనే రెండు వేలకు పైగా అక్రమ కేసు లు నమోదు చేసి, కాంగ్రెస్ సర్కార్ తన వికృత నైజాన్ని చూపెట్టింది. ప్రజాసంఘాలు, పౌరహ క్కుల సంస్థలపై సహితం ఉక్కుపాదం మోపు తూ, ప్రజాస్వామ్య నిరసనలపై సర్కారే హింస ను ప్రయోగిస్తున్నది.
తెలంగాణ ఉద్యమ సమయంలో థర్టీ యాక్ట్ అమలులో లేదు. కానీ, రేవంత్ సర్కార్ తెలంగాణ జిల్లాల్లో నెలల పాటు థర్టీ యాక్ట్ అమలుపరుస్తూ, సభలూ, సమావేశాలు, నిరసనలపై ఉక్కుపాదం మోపింది. ఏడాదిలోనే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఇలా తెలంగాణ అడవి బూటకపు ఎన్కౌంటర్లకు కేంద్రంగా మార్చివేయబడింది. చివరికి ఎదురుకాల్పులపై నిజ నిర్ధారణ కోసం వెళ్లిన పౌరహక్కుల సంఘం నేతలు, మేధావులను అక్రమంగా అరెస్టు చేసేశారు. ఈ విధమైన రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్బంధ విధానం చివరికి సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో నెలకొన్న దుస్థితిని పరిశీలించే హక్కునూ ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు నిరాకరిస్తున్నది. సర్కార్ నిర్లక్ష్యానికి దాదాపు 50 మంది గురుకుల, సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు బలైపోయారు. చావు తో యుద్ధం చేసి శైలజ అనే గురుకుల విద్యార్థిని చివరికి నిమ్స్‌లో తనువు చాలించింది. వివిధ రంగాల్లో పేదవర్గాల విద్యార్థులు ఎదిగి, తెలంగాణకు వేల కోట్ల సంపదగా మారాలనే మానవీయ సంకల్పంతో, స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గురుకులాలను తీర్చిదిద్దింది. అలాంటి ఆధునిక వికాసాలయాలను రేవంత్‌రెడ్డి సర్కార్ విధ్వంసం చేయడానికి వేగంగా పావులు కదుపుతున్నది.
ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందంలో ఒకడినైన నేనూ, వారితోపాటు క్షేత్రస్థాయి పరిస్థితిని అధ్యయనం చేయడానికి షేరిగూడ గురుకులానికి వెళ్లాను. ఆ సందర్భంగా ‘అన్నం సరిగ్గా పెట్టకున్నా సరే చదువు కూడా సరిగ్గా చెప్పకపోతే మా బతుకులు ఏం కావాలి సార్’ అని ఒక విద్యార్థి మాతో ఆవేదనగా మాట్లాడుతుంటే, మాకు ఎనలేని బాధ కలిగింది. ఎన్ని కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొని, ఎదగాలని ఆశ పడుతున్న వర్గాల విద్యార్థులకు, అవకాశాలనూ సర్కారే నిరాకరిస్తే, దూరం చేస్తే, వారికి నిజంగానే మరో మార్గమేది?
నెహ్రూ అన్నట్టు బహుళార్థక సాధక సాగు నీ టి ప్రాజెక్టుల్లాగానే, సంక్షేమ వసతిగృహాలు సైతం ఆధునిక దేవాలయాలే. పేదరికం, వివక్ష తదితర సామాజిక అంతరాల అంతానికి, ఈ రెండూ అత్యంత కీలకమైనవి. అయినా విధ్వంసాన్ని నమ్ముకున్న రేవంత్ సర్కార్, కాళేశ్వరం కూలిపోవాలని కలగంటున్నట్టే, గురుకులాలు కూడా మూతపడాలని ఉబలాటపడకుండా ఉం టుందా..? పాలకుడి నిర్లక్ష్యం, అహంకారం సమాజానికి ఎంత నష్టం చేస్తుందో రేవంత్ సర్కార్ పాలనాతీరుతో తెలిసిపోయింది.
‘ఏడాదిలో ఏమవుతుంది/ ఇంకా కొన్నాళ్లాగమంది/ చెల్లాచెదురైన తెలుగు వారంతా/ తెల్లబోయి చూశారు’ అని శరచ్చంద్రిక (ఖడ్గ సృష్టి) లో శ్రీశ్రీ గారు రాసినట్టు, నేడు రేవంత్ రెడ్డి సర్కార్ తీరుకు, తెలంగాణ జనమంతా విస్తుపోయి చూస్తున్నారు. గ్యారెంటీల అమలు దేవుడెరుగు, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో, అసహజ వాతావారణాన్ని సర్కారే సృష్టిస్తుండటం దారుణం.
ప్రజల పట్ల సానుకూల దృక్పథం లేని వికార స్వభావాన్ని ప్రభుత్వం పదే పదే ప్రదర్శిస్తున్నది. కూల్చివేతలు, కాల్చివేతల విధానాన్ని అవాహ నం చేసుకున్న రేవంత్ సర్కార్, రాష్ర్టాన్ని మళ్లీ ప్రపంచ బ్యాంకు విధానాలకు ప్రయోగశాలగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నది. ‘పాలన ఏం పాలన.. ఇది ఫాసిస్ట్ పాలన.. కాంగ్రెస్ పాలన. కర్కశ మూకల పాలన.. పాలన, ఇది ఏమి పాల న’ అని ఎనభై దశకంలో జనం పాడుకున్న పాట మళ్లీ యథాతథంగా పాడుకునే పరిస్థితులు పునరావృతమయ్యాయి. వ్వవసాయ, పారిశ్రామిక, ఐటీ, ఉపాధి, సేవల రంగాల్లో సంక్షోభం సృష్టిం చి, వరల్డ్ బ్యాంక్ దయాదాక్షిణ్యాల ఆధారిత రాష్ట్రంగా మలిచే కుట్రలు అమలవుతున్నాయి. పదేండ్ల ప్రగతి కష్టపడి కూడబెట్టుకొని దొంగల పాలు చేసినట్టయింది. అయినా నేడు తిరగబడుతున్న తెలంగాణ మళ్లీ తన ఆత్మగౌరవాన్ని, అస్తి త్వాన్ని కచ్చితంగా నిలబెట్టుకొని తీరుతుంది.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్