అన్నం పెట్టే రైతన్నల కష్టాలు తెలిసినవాడు.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవాడు.. చట్టాలపై అవగాహన కలిగినవాడు.. ‘నేను కూడా కాపోన్నే.. నాకు కూడా పొలం ఉన్నది, వ్యవసాయం చేస్త, రైతు కష్టాలు నాకూ తెలుసు’ అని కేసీఆర్ తరచూ చెప్తారు. రైతుల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్ భూ సమస్యలకు శాశ్వత ముగింపు పలికేందుకు పలు సంస్కరణలను తీసుకువచ్చారు. అందులో భాగంగానే భూ వివాదాలకు, బ్రోకర్లు, దళారుల దందాకు చెక్ పెట్టేందుకు, వ్యవసాయ భూములకు భద్రత కల్పించే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2020, అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్లు, ఆర్డీఓలు, తహశీల్దార్లు, భూ చట్టాలపై అవగాహన ఉన్న వారందరితో వందల సార్లు చర్చించిన తర్వాత 2020 నూతన ఆర్వోఆర్ చట్టం, ధరణి అనే పోర్టల్‌కు రూపకల్పన చేశారు.
Congress | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ధరణి పోర్టల్ ద్వారా వేగంగా పట్టాలు చేతికందిస్తూ, భూ రికార్డులు సైతం భద్రంగా ఉంచుతూ వారిలో భరోసా నింపారు. అంతేకాదు అవినీతికి తావు లేకుండా, పైరవీలు, అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల సేవలందించారు. భూ వివాదాలు లేకుండా ధరణి తీసుకొచ్చి లక్షల మంది రైతుల సమస్యలను పరిష్కారం చేశారు.
భూ రికార్డుల చరిత్ర: కాకతీయ రాజులు (1163-1323) మొదట అనేక చెరువులు, కాలువలను తవ్వించి వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యం కలిగించిన తర్వాత, రైతులు భూమిలో పంటను మూడేండ్లు ఉచితంగా పండిచుకునేవారు తర్వాత 4వ సంవత్సరం నుంచి రెవెన్యూ సుంకం 1/4 నుంచి 1/2 వరకు వసూలు చేసేవారు.
షేర్ షా సూరి (1486-1545) మొట్టమొదటిసారి క్రమపద్ధతిలో భూ సర్వే చేయించారు. రెవెన్యూ సుంకం ఎకరాకు పండిన పంటలో 1/3 లేక 1/4 వంతు వసూలు చేసేవారు. వసూలు కోసం అమ్మిన్, మొగ్డుం, షిక్దర్, పట్వారీ అనే అధికారులను నియమించారు. (1556-1605) షేర్ షా సూరి రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను అక్బర్ సవరించి గత పదేండ్ల సగటు పంట దిగుబడిపై రెవెన్యూ సుంకాన్ని వసూలు చేసేవారు.
1880 దశకంలో అప్పటి నిజాం రాష్ట్ర ప్రధానమంత్రి సాలార్ జంగ్ రెవెన్యూ సంస్కరణలను తెచ్చి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండటం కోసం ‘వతన్‌దారి’ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడే ప్రతి రెవిన్యూ గ్రామంలో కరణం పటేల్ (పట్వారీ), మాలిపటేల్ (నీటి తీరువా, ఇతర పన్నులు), పోలీస్ పటేల్ (శాంతిభద్రతలు) వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ మూడు వ్యవస్థల వల్ల గ్రామా ల్లో ప్రజలు నానా అవస్థలు పడటం, ఆ వ్యవస్థలపై అనేకమా ర్లు ఉద్యమించటం వంటి అంశాలను మనం చరిత్రలో చదివాం. ‘మా భూమి’, ‘భక్త రామదాసు’ చిత్రాల్లో కనులకు కట్టినట్టుగా ఈ వ్యవస్థల దురాక్రమణలను అందరు చూసినవారే.
భూ రికార్డుల ప్రక్షాళన (ఎల్‌ఆర్‌యూపీ): రెవెన్యూ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని 2017లో చేపట్టింది. దాదాపు 86 ఏండ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం 2017 సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు వంద రోజుల్లో భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన (ఎల్‌ఆర్‌యూపీ), రెవెన్యూ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించింది. రాష్ట్రంలోని 584 మండలాల్లోని 10,823 రెవెన్యూ గ్రామాల్లో 1,507 బృందాలతో సర్వే నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల వేతనాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం 1,12,077 చదరపు కిలోమీటర్లు కాగా, మొత్తం భూవిస్తీర్ణం 2.80 కోట్ల ఎకరాలు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1.78 కోట్ల సర్వే నెంబర్లలో ఉన్న 72,09,694 ఖాతాలకు చెందిన 2,38,28,180 ఎకరాల భూ రికార్డులను పరిశీలించారు. ఇందులో కోటి 42 లక్షల ఎకరాలు వివాదాలు లేని వ్యవసాయ భూమిగా గుర్తించి పార్ట్-ఏలో చేర్చారు. 16.5 లక్షల ఎకరాల భూమి చుట్టూ పలు వివాదాలున్నట్టు నిర్ధారించి పార్ట్-బీలో చేర్చారు. 80.6 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యం కాదని నిర్ధారించారు. వాటిలో గ్రామ కంఠాలు, లే ఔట్లు, అటవీ భూమి, గుట్టలు, బంజర్లు, పాఠశాలలు, సబ్స్టేషన్లు, రోడ్లు, నదులు మొదలైనవి ఉన్నాయి. ఈ భూ రికార్డుల ప్రక్షాళనలో పార్ట్-ఏలో దాదాపు 90 శాతానికి పైగా భూములకు చెందిన అసలు యజమాని ఎవరో తెలిసింది. ఈ వివరాల ఆధారంగానే కొత్త ధరణి పాస్ పుస్తకాలు జారీ చేశారు.
ధరణి పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం సంఘటనను రెవెన్యూ మంత్రి ప్రస్తావించారు. ఈ గ్రామ పరిధిలో మొత్తం 1,827 ఎకరాల పట్టా భూమి ఉన్నది. ఎల్‌ఆర్‌యూపీ సమయంలో పహానిలు, ఇతర రికార్డులు దొరకకపోవడం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల 221 ఎకరాలను పట్టాభూమిగా గుర్తించారు. మిగతా భూమిని రిజర్వ్డ్ ఫారెస్ట్‌గా రికార్డు చేశారు. ఆ గ్రామస్థులు భూమి పాత జీవోలు సంపాదించి నాటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వారు ఆదేశించిన తర్వాత 2021, జూన్‌లో అటవీశాఖ క్లియరెన్స్‌తో రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేశారు.
ఈ సర్వేలో 1,600 ఎకరాల పట్టా భూమిని గుర్తించారు. 700 ఎకరాల భూమికి పట్టాలు జారీచేశారు. మిగతా 700 ఎకరాలకు సాంకేతిక సమస్య రావడం వల్ల పట్టా ఇవ్వలేకపోయారు. రికార్డులు సరిగ్గా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల, చిన్న సాంకేతిక కారణం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. అలాగే మరికొన్ని చిన్న సమస్యలను రెవెన్యూ మంత్రి ఉదహరించారు. చిన్న చిన్న సమస్యలుంటే దాన్ని తీర్చుకోవడానికి చట్టంలో కాని, పోర్టల్‌లో కాని కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. కానీ, వారిని చూస్తుంటే ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టుకున్న చందంగా ఉన్నది.
ధరణి: ఒకప్పుడు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప జరగని భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కోర్ బ్యాకింగ్ తరహాలో కేసీఆర్ సర్కారు తెచ్చిన ‘ధరణి’ రైతన్నకు కొండంత ధీమానిచ్చింది. 2020, సెప్టెంబర్ 9 నాడు చారిత్రాత్మక రెవెన్యూ చట్టాన్ని (ధరణి) శాసనసభలో ప్రవేశపెట్టారు. దీంతో భూ క్రయవిక్రయాల్లో అవినీతి మోసాలకు చెక్ పెట్టింది. ఈ పోర్టల్ అవకతవకలకు పాల్పడినవారి ఆట కట్టించింది. ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా, ఆలస్యానికి ఛాన్స్ లేకుండా చేసింది.
భూ భారతిలో మళ్లా జమాబందీ చేయడమంటే, ఈ రికార్డు ద్వారా అనవసరమైన వివాదాలను సృష్టించడమే. అంతేకాదు మళ్లా పహనీలో కాలమ్స్‌ను పెంచి, అనుభవదారు కాలం కూడా పెట్టి, మాన్యువల్‌గా రికార్డు చేయడమంటే వివాదాలకు తావివ్వడం తప్ప మరొకటి కాదు.
ఇందులో భాగంగానే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తాలూకా వివరాలు రియల్ టైమ్‌లో అప్డేట్ అవడం, గతంలో 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటే వాటికి అదనంగా 592 ఎమ్మార్వో ఆఫీసులను కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్పు చేయడం ద్వారా 773 కార్యాలయాలకు పెంచడం, మానవ ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా స్టాంప్ డ్యూటీని కంప్యూటర్ సిస్టం ద్వారానే నిర్ధారించడం, అధికారుల ప్రమేయం తగ్గించి పూర్తిగా సిస్టం ఆధారిత ప్రక్రియ ద్వారా ప్రజలకు సౌకర్యాన్ని అందించడం జరిగింది. ధరణిలో రిజిస్ట్రేషన్ పూర్తికాగానే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌తో పాటు వారం రోజుల్లో 18 సేఫ్టీ ఫీచర్లు కలిగిన పాస్‌బుక్ భూ యాజమాని ఇంటికి చేరుతుంది.
రిజిస్ట్రేషన్ పక్రియ స్లాట్ బుకింగ్ నుంచి మొదలుకొని ఇంటికి చేరే వరకు అన్ని దశల్లో నేరుగా పౌరుల మొబైల్ ఫోన్లకు సమాచారం వెళ్లేది. నూతన ఆర్వోఆర్-2020 చట్టం ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకాలను పౌరుడి ఇంటికే పంపించింది. దీంతో భూముల డిజిటలీకరణ, ఆధార్ లింకేజీ వల్ల మోసాలకు అడ్డుకట్ట వేసింది. పట్టాదార్ పాస్ బుక్ చట్టం-2020 ద్వారా దేశంలోనే తొలిసారి భూముల రికార్డులను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో నిర్వహించి చట్టబద్ధం చేసింది. ప్రభుత్వ భూములను రక్షించేందుకు ఆటో లాక్ సిస్టంను కూడా ఏర్పాటుచేసింది.
ధరణి వచ్చిన తర్వాతనే రైతుల జీవితాలు కుదుటపడ్డాయి. తమ భూములకొచ్చిన ఢోకా లేదని గుండెపై చేయి వేసి హాయిగా నిద్రపోగలుగు తున్నారు. కానీ, కుట్రపూరితంగా ఆర్థిక నేరాలకు పాల్పడిన సంస్థలకు ధరణిని కట్టబెట్టి రాష్ట్ర భూముల సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటించారని అపోహలు కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రసగించారు. ధరణి వచ్చిన నాటినుంచి నేటిదాకా సాఫ్ట్వేర్ ద్వారా 70 లక్షల రైతుల కోటి 52 లక్షల ఎకరాల భూమిలో ఒక్క ఎకరం కాని, గుంట భూమి కాని ఎలాంటి చిన్న మార్పు కూడా జరగలేదు. రైతులు వేలిముద్ర వేస్తేనే ధరణిలో మార్పులు జరిగాయి తప్ప ఇతరుల ప్రమేయంతో కానీ లేక ధరణి పోర్టల్ కానీ తనకు తానుగా ఎటువంటి మార్పులు చేయలేదనేది వాస్త వం. 70 లక్షల మంది భూ యజమానులైన రైతుల సాక్షిగా ఇది సత్యం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు, ధరణిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దుష్ప్రచారం, అసత్యాలు మాత్రమే. నేడు భూ భారతిలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ కేసీఆర్ తెచ్చిన ధరణి సాఫ్ట్వేర్ కావడం గమనార్హం.
1.రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలందాయి.
2.ఇప్పటివరకు దాదాపు 11 కోట్ల 80 లక్షల మంది ధరణి పోర్టల్‌ను విజిట్ చేశారు.
3.ఇందులో సుమారు 27 లక్షల ధరణి లావాదేవీలను విజయవంతంగా పూర్తి చేసింది. రిజస్ట్రేషన్ల ద్వారా రూ.5,660 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చింది.
4.పౌరులకు మరింత సౌకర్యంగా ఉండేలా మొబైల్ అప్లికేషన్లు ప్రారంభించి మీసేవ, డెత్ సర్టిఫికెట్, ఆధార్ వంటి తదితర ప్రభుత్వ సేవలను ధరణితో ఇంటిగ్రేట్ చేసింది.
5.భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలున్న 16.5 లక్షల ఎకరాలను ‘పార్టీ-బీ’లో చేరిస్తే అందులో 10 లక్షల ఎకరాలకు సంబంధించి సమస్యలు పరిష్కారమై వారికి కూడా ధరణి పాస్‌బుక్‌లు అందాయి.
6.సుమారు 70 లక్షల మంది రైతులు భూ యజమానులుగా ధరణిలో ఉన్నారు.
7.కేసీఆర్ తీసుకున్న భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన ద్వారానే నేటికి 70 లక్షల మంది రైతులకు ఒక కోటి 52 లక్షల ఎకరాల భూమిని ధరణి పాస్‌బుక్ ద్వారా హక్కు కల్పించబడింది.
8.ప్రతిష్ఠాత్మకమైన ‘రైతుబంధు’ పెట్టుబడి సహాయం 70 లక్షల మంది రైతులకు 12 విడతల్లో రూ.80 వేల కోట్లు… ఈ ‘ధరణి ద్వారానే’ అందింది. ‘రైతు బీమా’ పథకం, రైతు రుణమాఫీ, ధాన్య సేకరణకు సంబంధించిన చెల్లింపులు ఒక్క రూపాయి అవినీతి లేకుండా రైతన్నలకు చేరడమంటే అది ‘ధరణి’ విజయమే.
మ్యుటేషన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ కోసం తహశీల్ ఆఫీస్‌కు వెళ్లగానే.. మీ సేవలో ఇచ్చిన పత్రాలను తహశీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. అమ్మకందారు, కొనుగోలుదారు, ఇద్దరు సాక్షుల సంతకాలు, ఫొటోలు తీసుకొని అరగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ ప్రక్రియ గురించిన సందేశంతో ముగిస్తారు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్లు అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల 45 వేల మ్యుటేషన్ల పక్రియ పూర్తయ్యింది.
ధరణి చట్టం రాకముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెలల తరబడి మ్యుటేషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలిస్తేనే మ్యుటేషన్ అయ్యేది. ఇప్పుడు ధరణి ద్వారా ఒక్క నిమిషంలోనే ఏ ఆఫీసుకు పోకుండా, ఖర్చు లేకుండా మ్యుటేషన్ అవుతుంది. ఇప్పుడు భూభారతి చట్టంలో ఎమ్మార్వో సంతృప్తి చెందితేనే మ్యుటేషన్ అవుతుంది. లేనట్టయితే మళ్లీ ఆర్డీవో దగ్గరికి వెళ్లాలి. అంటే వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించడం, లంచాలకు తెరతీయడం, సమయం, డబ్బులు, అనవసరమైన ఆందోళనకు రైతులను గురిచేయడమే.
అనుభవదారు కాలమ్: భూ భారతి కొత్త చట్టంలో మళ్లీ అనుభవదారు కాలమ్ పెట్టి కాంగ్రెస్ సర్కారు రైతులపై పిడుగు వేసింది. మళ్లీ కౌలుదారులకు ‘భూ హక్కులు’ కల్పిస్తుంది. అన్నదాతల భూములు కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ‘అనుభవదారు కాలమ్’ పెట్టడమంటే భూ యజమానిని భయం, అభద్రతకు గురిచేయడమే. గతంలో అనుభవదారు కాలమ్ వల్ల ఎంతోమంది రైతుల తలరాతలు తలకిందులైనయి.
భూ రికార్డుల్లోని అనుభవదారు కాలమ్ ఉన్నవారు, ఆ తర్వాత రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయి ఏకంగా పట్టాలనే తమ పేరిట మార్పించుకునేవారు. నిరక్షరాస్యులైన రైతులకు భూములు అమ్మేందుకు ప్రయత్నించినప్పుడే అసలు విషయం బయటపడేది. దీంతో పంచాయతీలయ్యేవి. అనుభవదారు కాలమ్ పెట్టి వారి పేర్లను రికార్డు చేయడమంటే రైతు తాను సంపాదించుకొని ధరణి ద్వారా హక్కులు పొందిన తన స్వార్జితమైన భూమిపై అభద్రత కల్పించడమే. రైతులకు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు.
ఫౌతి: ధరణి కంటే ముందున్న పాత చట్టం ప్రకారం ఫౌతి విధానంలో వారసులు ముందుగా అడంగల్ పహాని, పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ తదితర పత్రాలతో పాటు కుటుంబసభ్యులందరూ తహశీల్దార్‌కు దరఖాస్తు చేయాలి. తహశీల్దార్ కుటుంబసభ్యుల అభ్యంతరాలు కోరుతూ 30 రోజుల నోటీసు సమయాన్నిస్తారు. 45 రోజుల తర్వాత గ్రామస్థులు వీఆర్వో సమక్షంలో విచారణ జరిపి కుటుంబసభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేసి అభ్యంతరాలు లేనిచో పంపకాలు పూర్తిచేస్తారు. అభ్యంతరాలున్నచో సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తారు. ఈ ప్రక్రియలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, అటు రెవెన్యూ అధికారులు కుటుంబసభ్యుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలను అవకాశంగా తీసుకొని అవినీతికి పాల్పడేవారు.
ధరణి చట్టంలో ఫౌతి అధికారం కుటుంబానికే ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం కుటుంబసభ్యులు కూర్చొని మాట్లాడుకొని పంపకాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి రిజిస్ట్రేషన్ కోసం రెవెన్యూ కార్యాలయానికి అందరు కలసి రావలసిందిగా సూచిస్తున్నది. లేకుంటే కోర్టులో వారి వివాదాలను పరిష్కరించుకోవలసిందిగా సూచిస్తున్నది.
మరల ‘ఫౌతి’ కోసం పాత విధానాన్నే కొత్త చట్టంలో పొందుపర్చడం అంటే వివాదాలు తీర్చే బదులు మళ్లీ వివాదాలకు ఆస్కారం ఇవ్వడమే.
జమాబందీ: భూమి స్వరూపం తెలుసుకోవడానికి, భూమి యాజమాన్య మార్పులు తెలుసుకోవడానికి, రెవెన్యూ శిస్తు వసూలు కోసం, ఏటా ఒకసారి రెవెన్యూ శాఖ వారు జమాబందీ చేసేవారు, క్రమంగా ఈ ప్రక్రియ 3 లేక 4 ఏండ్లకు చేరింది. చివరికి 2010-11 తర్వాత దాదాపుగా నిలిపివేశారు.
ధరణిలో: 2010-11లో ఆపివేయబడిన జమాబందీ కార్యక్రమాన్ని శిస్తు వసూలు చేసేది లేదు కాబట్టి, ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంది కాబట్టి జమాబందీని కొనసాగించలేదు. ఇక భూ స్వరూపం తెలుసుకోవడానికి ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున మొత్తం 2,603 మంది ఏఈఓలను నియమించి వారి ద్వారా వివరాలు ఆన్లైన్లో రికార్డు చేస్తారు.
భూ భారతిలో: మళ్లా జమాబందీ చేయడమంటే, ఈ రికార్డు ద్వారా అనవసరమైన వివాదాలను సృష్టించడమే.
మాన్యువల్ పహాని: 32 కాలమ్స్ కలిగి ఉన్న పహానిలు ఏటా రెవెన్యూ శాఖ వారు భూ యాజమాన్య మార్పులు తెలుసుకోవడం కోసం మాన్యువల్‌గా రాసి రికార్డు చేసేవారు. దీన్ని రెవెన్యూ వారు అంతకుముందు మాలీ పటేల్ ఏటా చేతిరాతతో రాసి భద్రపరిచేవారు, కానీ, అనేక వివాదాలకు ఈ పహానిలే కారణమయ్యాయి.
ధరణిలో: ఈ పహాని కాలమ్‌లను తగ్గించి, అవసరమైన వాటికి పరిమితం చేశారు. ధరణిలో రియల్ టైమ్ అప్డేషన్ అవుతుంది కాబట్టి మళ్లా రికార్డులను రాయనవసరం లేదు కాబట్టి ఏటా ఒకసారి ఒక కాపీ ప్రింట్ తీసి రికార్డు చేసుకునేవారు.
భూ భారతిలో మళ్లా పహానిలో కాలమ్స్‌ను పెంచి, అనుభవదారు కాలం కూడా పెట్టి, మాన్యువల్‌గా రికార్డు చేయడమంటే వివాదాలకు తావివ్వడం తప్ప మరొకటి కాదు.
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిచ్చింది. భూ హక్కుల రికార్డుల్లో విప్లవం సృష్టించింది. భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభంగా, వేగంగా పూర్తి చేస్తూ రైతులకు ధీమా ఇచ్చింది. స్లాట్ బుక్ చేసుకున్న నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి భూ పత్రాలు సంబంధిత రైతు చేతికి అందాయి.
కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెట్టినవారికే మళ్లీ పెత్తనం ఇచ్చింది. కౌలుదారుల కాలమ్‌తో మళ్లీ రైతుల మధ్య కొట్లాటలు పెడుతున్నది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అలజడి సృష్టిస్తున్నది. రైతులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నది. రైతన్నలు సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తెచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి పట్టింది.
– (వ్యాసకర్త: జనగామ శాసనసభ్యులు)
డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి