నేడు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న అంశం నీట్. పేపర్ లీకేజీ కారణంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో చిక్కుకున్నది. ఇది ఆ విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం.
మన దేశంలో వైద్య విద్య కళాశాలలు, సీట్లు తక్కువగా ఉండటంతో డాక్టర్ చదువుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకోలేక సతమతమవుతున్న విద్యార్థులను పేపర్ లీకేజీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. పరీక్ష పేపర్ల లీకులు, పరీక్షా నిర్వహణలో అవకతవకలు మన దేశంలో సర్వసాధారణంగా మారిపోయాయి. నీట్ ఘటన మరువకముందే నెట్-యూజీ ఉదంతం కలకలం రేపింది. నీట్ పేపర్ లీక్ అయిందని తెలిసినా, అటు ప్రభుత్వం గానీ, ఇటు ఎన్టీయే గానీ సరైన రీతిలో స్పందించకపోవడంతోనే నెట్లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి.
నీట్ ముగిసిన కొన్ని రోజులకే పేపర్ లీక్ జరిగిందనే అభియోగాలపై 13 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి వారు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, గుజరాత్‌లోనూ అరెస్టులు జరిగాయి. దీని వెనుక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని, ఓ ఉపాధ్యాయుడు, ఒక స్థానిక బీజేపీ నేత ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
మన దేశంలో గత ఐదేండ్లలో 41 పరీక్షల పేపర్లు లీక్ అయ్యినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం వెలువరించింది. లీకుల కారణంగా లక్షల మంది ఉద్యోగార్థుల జీవితాలు ప్రభావితమైనట్టు ఆ కథనం వెల్లడించింది.
2013లో నీట్‌ను మొదట ప్రతిపాదించినప్పుడు ఉమ్మడి ఏపీ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా అనేక రాష్ర్టాలు వ్యతిరేకించాయి. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ నీట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ప్రధాని అయ్యాక అందుకు భిన్నంగా వ్యవహరించారు. అంతేకాదు, ఆ పరీక్ష నిర్వహణ బాధ్యతలను స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్టీయేకు అప్పగించారు. దాంతో పరీక్ష నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుందని అందరూ భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా నేడు దేశంలో పరిణామాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది నీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచే అవకతవకలు మొదలయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 9న మొదలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 9తో ముగిసింది. ఆ తర్వాత వారం పాటు గడువు పొడిగించింది. అయితే గడువు ముగిసిన నెల రోజుల తర్వాత ఏప్రిల్ 9న రిజిస్ట్రేషన్లను మళ్లీ తెరవడమూ అనుమానాలకు తావిస్తున్నది. ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తూ ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది టాపర్లుగా నిలిచారు. పైగా ఎక్కువ మంది 720 మార్కులు ఎందుకు సాధించారనే ప్రశ్నకు ఎన్టీయే చెప్తున్న సమాధానం హాస్యాస్పదంగా ఉన్నది. అవకతవకలను గుర్తించిన ఎన్టీయే నీట్ ఫలితాలను 10 రోజుల ముందుగానే విడుదల చేసిందనే అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల హడావుడిలో ఈ స్కామ్‌ను కప్పిపుచ్చాలనే వ్యూహంతోనే ఎన్టీయే ఆ రోజు నీట్ ఫలితాలను విడుదల చేసింది.
జాతీయ అర్హత పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది చిన్న విషయం కాదు. ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. విద్యార్థులు, దేశ భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. కనీసం కోర్టులైనా కలగజేసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి. వారిలో భరోసా కల్పించాలి.
జి. రాజేశ్ నాయక్
96035 79115