సుమారు పదేండ్ల పాటు సుభిక్షంగా వర్ధిల్లిన తెలంగాణ 2024లో అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నది. దీంతో కొత్త ఏడాది ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. అనేక త్యాగాలు, వీరోచిత పోరాటాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణ ఏడాదిలోనే తెర్లు కావడానికి దారులు పడటం విషాదం. 2014 నుంచి 2023 వరకు సాగిన కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టింది. అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన వంటి అనేక అంశాలు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించాయి. ఉద్యమ కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను ప్రభుత్వ ఎజెండాగా చేసుకున్న కేసీఆర్ గుణాత్మక మార్పును అందించారు.
కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలన అందిస్తామని, సంక్షేమాన్ని రెట్టింపు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసింది. ఈ విషయం ఏడాది కాలంలోనే ప్రజలకు అర్థమైంది. తెలంగాణలో వ్యవసాయాన్ని ప్రోత్సహించి సాగుబడి పెంచడానికి, దశాబ్దాల పాటు సంక్షోభంలో కూ రుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి రైతుబంధును ప్రవేశపెట్టింది. 2018 నుంచి 2023 వరకు రూ.72 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. నిరుడు అక్టోబర్‌లో ఇవ్వాల్సిన రైతుబంధును ఇవ్వకుండా ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ రైతుల నోట్లో మట్టి కొట్టింది. అధికారంలోకి వచ్చాక రైతులకు ఎకరానికి ఏటా రూ.15,000 ఇస్తామని చెప్పి ఏడాది దాటినా అతీగతీ లేకుండాపోయింది. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు నానా కుట్రలు పన్నుతున్నది.
కుటుంబంలో ఒకరికే ఇస్తామని, ఉద్యోగులకు, పన్ను చెల్లింపుదారులకు ఇవ్వబోమని, ఏడెకరాల వరకు భూ పరిమితి విధిస్తామంటూ లీకులు మాత్రం ఇస్తున్నది. సంక్రాంతి పండుగకు ఇస్తామని చెప్తున్నా, దానిపైనా స్పష్టత లేక రైతాంగం ఆందోళన చెందుతున్నది.
రుణమాఫీ కూడా రూ.40 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు తగ్గించింది. రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న రూ.12 వేలకు దిక్కులేదు. వానకాలంలో 66.78 లక్షల ఎకరాల్లో 156 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 30 శాతం (47 లక్షల టన్నులు) మాత్రమే కొనుగోలు చేసింది. రూ.2,500 కోట్ల బోనస్ ఇవ్వాల్సిన ప్రభుత్వం రూ.900 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకొన్నది. 2014-15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు 2022-23 నాటికి 2.29 కోట్లకు పెరగడానికి కేసీఆర్ అనుసరించిన విధానాలే కార ణం. ఆర్బీఐ నివేదికతో ఇది తేటతెల్లమైంది. అలాగే, 2014-15లో 62.49 లక్షల ఎకరాలున్న ఆయకట్టు 2022-23లో 159.97 లక్షల ఎకరాలకు చేరడం కూడా కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల వంద రోజుల హామీ ఏడాది గడిచినా అతీగతీ లేదు. ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు ఇంటిస్థలం, మహిళలకు రూ.2,500 భృతి, నెలవారీ ఫించన్ రూ.4 వేలకు పెంపు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. 2025లోనైనా కోతలు లేకుండా గ్యారెంటీలు అమలు చేస్తారో, లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం హామీ ఏడాదిగా నవ్వుల పాలవుతున్నది. కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య భక్షణగా మారింది. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నందుకు చిక్కడపల్లి లైబ్రరీలో విద్యార్థులపై ప్రభుత్వం లాఠీచార్జి చేయించింది. అశోక్‌నగర్‌ను శోకనగర్గా మార్చింది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 10 వేలు మాత్రమే భర్తీచేసింది. గత ప్రభుత్వం పూర్తిచేసిన 40 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తమ ఖాతాలో వేసుకున్నది. జాబ్ క్యాలెండర్ జాదు క్యాలెండర్ అయింది. నిరుద్యోగ భృతి ఆలోచన లేకుండానే ఏడాది గడిచిపోయింది.
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా లగచర్ల రైతులు తెలిపిన ధర్మాగ్రహంపై ప్రభుత్వ నిర్బంధం ప్రజలను కలచివేసింది. రామన్నపేటలో సిమెంట్ కంపెనీ ఏర్పాటును నిరసించిన ప్రజలపై జరిగిన దాడిని ప్రజలు మర్చిపోలేదు. జాతీయస్థాయిలో అదానీ, అంబానీలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం వారికి అండగా నిలవడం దుర్మార్గం. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప్రజలపైనా నిర్బంధాన్ని ప్రదర్శించారు. ఆశా కార్యకర్తలపై లాఠీచార్జి చేయించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 4 ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. హామీలు అమలు చేయాలని గొంతెత్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులు కాంగ్రెస్ ఏడాది పాలనకు నిదర్శనం. లగచర్ల ఘటనలో మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్‌రెడ్డిని నెలలపాటు జైలులో నిర్బంధించారు. గుండెపోటుతో వచ్చిన రైతుకు బేడీలు వేశారు.
ఇది ఇలా ఉంటే.. హెల్త్ స్కీం జాడలేదు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 20 రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు టోకెన్ సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతర ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి దానికీ సబ్‌కమిటీ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటున్నది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు. తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు, విగ్రహం చేతి నుంచి బతుకమ్మ మాయం వంటివాటిని ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ లోగో నుంచి చార్మినార్, కాకతీయ తోరణం తీసేసే కుట్ర జరుగుతున్నది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతున్నది. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడల్లా ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తున్నారు. 2025లోనైనా కాంగ్రెస్ పాలనా విధానంలో మార్పు రావాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేదంటే సబ్బండ వర్ణాల తరపున పోరాడేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధంగా ఉన్నది.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
జి.దేవీప్రసాద్ రావు