తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వ్యంగ్యాస్ర్తాలు పేలుతున్నాయి. ఒక అంశంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి మిత్రులతో మాటామంతిలో విన్న కొన్ని పదాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంతటి చులకనభావంతో కూడిన పదాలు వాడుతున్నరా అని ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ వ్యంగ్యంలో రాజకీయ కోణం లేదు. ఆ పదాలు ఎందుకు పుట్టాయన్నదే అసలు చర్చ. ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత ఉన్నదా? ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు మధ్య పొంతన ఉన్నదా? ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సంగతేంది? అనే ప్రశ్నలే ఇప్పుడు చర్చకు కేంద్రంగా మారుతున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విస్తృతమైన హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. స్థూలంగా వాటిని ఆరు గ్యారెంటీలుగా ప్రకటించుకున్నది. ఒక్కొక్క గ్యారంటీ అనేక అంశాలతో కలిపి 420 హామీలుగా ఇచ్చింది. ఇవి మాత్రమే కాదు. యువత, రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్లు కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికింది. కల్యాణలక్ష్మి పథకంలో లక్ష రూపాయలతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని తెలిపింది. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని తెలిపింది. తమ పార్టీకి పాలనలో అపారమైన అనుభవం ఉన్నదని, అన్ని విషయాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ హామీలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు మాట మార్చారు. హామీలు అటకెక్కాయి. ప్రజలకు ఇచ్చిన మాటకు, పాలనా వాస్తవాలకు మధ్య పొంతనలేదు.
రాజకీయ నాయకుడికి మాటలే పెద్ద ఆయుధం. కానీ ఆ మాటలు అమలులో డొల్లబారి కల్లలైనప్పుడు ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలను ఎదుర్కోవలసి వస్తుంది. రేవంత్‌రెడ్డి గతంలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. అబద్ధాలు చెప్తేనే ప్రజలు ఓట్లు వేస్తారని, మోసం చేయడంలో తప్పు లేదని, అలవి కాని హామీలు ఇవ్వడం రాజకీయాల్లో సాధారణమని సీఎం బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఆలోచనా విధానానికి, ప్రజల పట్ల ఆయనకు గల చులకన భావానికి నిదర్శనం. ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఆలోచనా విధానానికి ప్రతిబింబంగా ప్రజలు ఇప్పుడు గుర్తించారు. ప్రజల మీద ఆయనకు గల చులకన భావాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక అప్పుడే సిద్ధంగా ఉన్నదా? లేక అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆర్థిక వాస్తవాలు, సాధ్యాసాధ్యాలు గుర్తొచ్చాయా? ప్రజలకు ఇచ్చిన మాటకు, పాలనా వాస్తవాలకు మధ్య ఏర్పడిన ఈ అంతరమే రాజకీయ విమర్శలకు ప్రధాన కారణంగా మారుతున్నది.
ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ వ్యూహంలో భాగమా? నిజంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన హామీలా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న నాయకత్వానిదే. ప్రజలు ప్రశ్నించడం రాజకీయ వ్యతిరేకత కాదు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం ప్రజాస్వామ్య బాధ్యత.
తెలంగాణలో ఉద్యోగాల అంశం ఎప్పటినుంచో అత్యంత కీలక రాజకీయ అంశం. ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం తన పాలనలో కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టినట్టు ప్రకటించింది. సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో రాజకీయ ప్రశ్న తలెత్తుతున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే కొన్ని నోటిఫికేషన్లు విడుదలయ్యాయి, కొన్ని పరీక్షలు పూర్తయ్యాయి, మరికొన్నింటికి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. అలాంటి ప్రక్రియల ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించడం ప్రస్తుత ప్రభుత్వం తన పాలనా ఘనతగా చెప్పుకుంటే, ఆ ఉద్యోగాల అసలు ప్రక్రియలో ఎవరి పాత్ర ఎంత అన్నది కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇ ది కేవలం కాగితాలపై ప్రకటించిన పథకం కాదు. వైద్య విద్యను జిల్లాల స్థాయికి తీసుకెళ్లడం, స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తేవ డం, ప్రతి జిల్లాలో వైద్య సేవల మౌలిక వసతులను అభివృద్ధి చేయడం అనే దీర్ఘకాలిక లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం. వరంగల్‌లో పాత జైలును మరో ప్రాంతానికి తరలించి, ఆ స్థలంలో భారీ స్థాయి దవాఖాన 2,000 పడకలతో, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో నిర్మాణానికి కేసీఆర్ ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్లో 1,000 పడకల దవాఖానలు, గచ్చిబౌలిలో 1,261 పడకల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టారు.
బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు, కాంగ్రెస్ పాలనలో వైఫల్యాల వాస్తవాలు కండ్ల ముందు కనిపిస్తుంటే ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్నట్టుగా హస్తం పార్టీ నేతలు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలను, ఉద్యోగ కల్పనను తమ విజయాలుగా చెప్పుకోవడం కాంగ్రెస్ నేతల దివాలాకోరుతనానికి నిదర్శనం. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి తన గురువు చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాలను ఆంధ్రప్రదేశ్‌లోని రిజర్వాయర్లకు తరలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘చికెన్ సీఎం’ అనే వ్యంగ్య పదం ఎందుకు పుట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అసలు చెప్తున్నది ఏంది? చికెన్ సీఎం అనే పదం రాజకీయ వ్యంగ్యమే. అయితే వ్యంగ్య పదాలు రాజకీయాల్లో ఊరికే పుట్టవు. అవి ఒక నిర్దిష్ట రాజకీయ అసంతృప్తి నుంచే ఏర్పడుతాయి. ఇక్కడ ఆ అసంతృప్తి ఏందంటే, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం లేదు. నిర్ణయాల్లో స్పష్టత లేదు. ఎన్నికల హామీల అమలు జరుగడంలేదు. కాంగ్రెస్ పాలకులు మాటలపై నిలబడుతున్నారా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోతే వ్యంగ్యపదాలు వైరల్ అయ్యి స్థిరమవుతాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎంతవరకు అమలు జరిగాయి? ఎన్ని హామీలు పూర్తయ్యాయి? ఎన్ని అమలులో ఉన్నాయి? ఎన్ని మారాయి? ఎందుకు మారాయి? ఎన్ని హామీలు ఇంకా అమలు కాలేదు? వాటి కోసం ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక, పరిపాలనా ప్రణాళిక ఏమిటి? ఇవీ ప్రజలు అడుగాల్సిన ప్రశ్నలు. రైతుకు సాగునీరు అందుతున్నదా? పెట్టుబడి సాయం సమయానికి ఇస్తున్నరా? యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయా? మహిళలకు ప్రకటించిన ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయా? పేదలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయా? ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత ఉన్నదా? ఇవే ప్రభుత్వ పనితీరుకు అసలు కొలమానాలు.
అందువల్ల చికెన్ సీఎం అనే రాజకీయ వ్యంగ్యం చుట్టూ చర్చను పరిమితం చేయడం కంటే, ఆ వ్యంగ్యానికి దారితీసిన రాజకీయ పరిస్థితులను ఆలోచించడం అవసరం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత విలువ ఇచ్చారు? ప్రజల ఆశలకు పాలన ఎంతవరకు న్యాయం చేసింది? విధాన మార్పులకు ప్రభుత్వం ఎంతవరకు బాధ్యతాయుతమైన వివరణ ఇచ్చింది? ఇదే అసలు రాజకీయ చర్చ. ఇదే ప్రజాస్వామ్యంలో ప్రజల అసలు ప్రశ్న. పూటపూటకు మాటమార్చే రేవంత్‌రెడ్డి చికెన్ సీఎంగా పాపులరై తెలంగాణ ముఖ్యమంత్రి పదవి, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. దీంతో ఢిల్లీ వీధుల్లో కూడా నిక్ నేమ్‌లతో సెటైర్లను వేయించుకుంటున్నారు.
బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు, కాంగ్రెస్ పాలనలో వైఫల్యాల వాస్తవాలు కండ్ల ముందు కనిపిస్తుంటే నవ్విపోదురు గాక నాకేటి
అన్నట్టుగా హస్తం పార్టీ నేతలు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైన అభివద్ధి కార్యక్రమాలను, ఉద్యోగ కల్పనను తమ విజయాలుగా చెప్పుకోవడం కాంగ్రెస్ నేతల దివాలాకోరుతనానికి నిదర్శనం.
– (వ్యాసకర్త: న్యాయవాది)
తన్నీరు శ్రీరంగారావు 98489 33606