అందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడమే సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా కేజీబీవీ పాఠశాలల్లో 20 వేల మంది.. జిల్లా, మండల (ఎంఆర్సీ) కార్యాలయాల్లో 18 వేల మంది ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, సమగ్ర శిక్షా అభియాన్ సిబ్బందికి మాత్రం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వర్తించడం లేదు. ఇదిలా ఉంటే, గతేడాది సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెలో పాల్గొన్న రేవంత్రెడ్డి చాలీచాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్నవారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందరినీ పర్మినెంట్ చేస్తామని వాగ్దానం చేశారు. కానీ, నేటికీ ఆ హామీ నెరవేరలేదు.
తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 8 రోజులుగా సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు టెంట్లు వదిలే ప్రసక్తే లేదని వారు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సర్కార్ స్పందించాలి. ఒప్పంద, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, వేతనాలు పెంచాలి. మరణించిన సిబ్బంది కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మహిళా ఉద్యోగులకు అన్నిరకాల సెలవులు ఇవ్వాలి. అంతేకాదు, ఆరోగ్య, జీవిత బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అన్ని వసతులు కల్పించాలి.
– లకావత్ చిరంజీవి