చాట్‌లో తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఎగవేతలు, ఎంపికలే ఎజెండాగా, కోతలే కొలమానంగా, దబాయింపే రాజకీయంగా, అబద్ధాల ప్రచారాలే అసలు సిసలు అస్ర్తాలుగా ఏడాది నుంచి కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పాలనలో మళ్లీ దరఖాస్తుల దందానే నడుస్తున్నది. ఒక్క దరఖాస్తు లేకుండా, ఒక్క దఫ్తర్ లేకుండా, దండాలు పెట్టకున్నా ప్రభుత్వ పథకాలు నడి ఇంట్లోకి నడిచొచ్చిన కేసీఆర్ స్వర్ణయుగపు పాలనకు, ఏడాది రేవంత్ పాలనకు ఇప్పుడు గ్రామాల్లో పోలిక మొదలైంది. ఇటీవలి గ్రామసభల సాక్షిగా కేసీఆర్ మానవీయ పాలనపై రచ్చ బండల్లో చర్చకు దారీతీసింది. ‘నాడు చూడు.. నేడు చూడు’ అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనయని గ్రామసభల సాక్షిగా పథకాల కోతకు, ఎగవేతకు గురైన బాధితులే ఏకరువు పెట్టిన దృశ్యాలూ చూస్తున్నాం.
ఇక ఏడాది నుంచి ప్రజలు సర్కారు పథకాల కోసం సర్కస్ ఫీట్లు వేశారు. రాష్ట్రంలో 12,560 గ్రామ పంచాయతీలుంటే అందులో ఒకే ఒక్క రోజు 563 పంచాయతీలను ఎంపిక చేసి 4 పథకాలను అమలుచేస్తున్నట్టు ప్రకటించారు.అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు గాలికివదిలిన నేతలు గ్రామసభలు పూర్తవ్వగానే అందరికి అన్నిపథకాలు ఇవ్వాల్సింది పోయి కోతలు పెట్టి, ఎగ్గొట్టి కొసిరి కొసిరి ఇస్తున్నారు.
75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో దేశాన్ని పేదరికంలోకి నెట్టి, పేదరికాన్ని పెంచిపోషించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ ఆ పాత రోజులనే తెస్తున్నది. పథకాల పేరిట పేద ప్రజల మధ్య చిచ్చుపెట్టి మరీ పబ్బం గడుపుకొంటున్నది. ఇందిరమ్మ రాజ్యం పేరిట మరోసారి దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లకు ఆ పార్టీ మళ్లీ తెరలేపింది. అంటే ‘జీ హుజూర్’ అని దండం పెట్టిన వాళ్లకే సర్కారీ పథకాలు అందుతాయని చెప్పకనే చెప్తున్నది. ఇటీవల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన గ్రామసభల నిర్వహణ, వాటి తీరు తెన్నులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతల వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే తమ కార్యకర్తలకు మాత్రమే ఆ పథకాలు వర్తిస్తాయని తేటతెల్లమవుతున్నది. ఓట్ల కోసం 4 కోట్ల మందిని నయవంచనకు గురిచేసి ప్రజలను ఏమార్చారని స్పష్టంగా తేలిపోయింది. కేసీఆర్ తన పదేండ్ల పాలనా కాలంలో ప్రతీ సంక్షేమ పథకాన్ని మానవీయ కోణంలోనే ప్రవేశపెట్టి అమలుచేశారు.
దేశంలో నంబర్ వన్ పథకం రైతుబంధు. ఈ పథకాన్ని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కాపీ కొట్టిన వైనం అందరికీ తెలిసిందే. ఇక్కడ అమలు జరుగుతున్న ‘కంటి వెలుగు’ పథకం ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాల్లో అమలవుతున్నది. 13.9 లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్‌తో ఎలాంటి దరఖాస్తు లేకుండా భరోసా ఇచ్చి అమలుచేశారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లుగా పరిగణించి 60 ఏండ్ల సమైక్య పాలకులను మరిపిస్తూ తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అంటే ఓట్ల రాజకీయం కాదని, ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన స్థితిగతులు మెరుగుపరచాలన్న ఏకైక లక్ష్యంతో అన్నివర్గాలకు ఎలాంటి ప్రతిపాదనలు, దరఖాస్తు లేకుండా అమలు చేశారు. వికలాంగులకు పింఛన్ ఇచ్చినా, పింఛన్ పెంచినా అది కేసీఆర్ ఔదార్యానికే చెల్లింది. విదేశాల్లో చదువుకుంటే రూ.20 లక్షలు ఇవ్వడం అంటే కేసీఆర్ మార్క్ పాలనకు నేటికి ఎవ్వరూ సాటిలేరు. ఇలా చెప్పుకొంటే పుట్టబోయే పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకూ ఏదో ఒక రూపంలో కేసీఆర్ మార్క్ పథకం కనిపించేది. కానీ, నేడు ఆ పథకాలకు పాతరేసి హామీల జాతరతో ఊరేగుతూ పబ్బం గడుపుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి.
ఒక్కసారి రైతుబంధు విషయానికి వస్తే వరుసగా 12 సీజన్లకు దరఖాస్తులు పెట్టే అవసరమే లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్ల నిధులను జమచేశారు. కేసీఆర్ కిట్, దళితబంధు, బీసీ బంధులతో సహా కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ పథకానికీ దరఖాస్తు స్వీకరించలేదు. దండాలు పెట్టించుకోలేదు.
కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి, ఆ నిధులు కూడా అరకొరగా ఇస్తున్నారు. వానకాలం రైతుబంధు, యాసంగి రైతుబంధు కలిపి ఎకరానికి రూ.15 వేలు బకాయిపడ్డారు. అధికారంలోకి వస్తే ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకూ కలిపి ఇస్తామని, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.500 బోనస్ ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీతో ఊకదంపుడు ఉపన్యాసాలిప్పించి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో 6 గ్యారెంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిన రేవంత్ ప్రభుత్వంపై ఇవాళ ప్రజలు గ్రామసభల సాక్షిగా తిరగబడుతున్నారు. సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లేకుండా జరిగిన గ్రామసభల్లో ఎమ్మెల్యేలు చెప్పిందే వేదం. వారు చేసిందే చట్టం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది. ఇంటింటి సర్వేలూ నిర్వహించింది. ప్రజాపాలన దరఖాస్తుల్లో అన్ని పథకాలకూ ఒకే దరఖాస్తు అని అభయహస్తం హామీలకు 1.05 కోట్ల దరఖాస్తులు స్వీకరించారు. ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని స్వయంగా సీఎం రేవంత్ ఓ సమీక్షలో స్పష్టం చేశారు. అంతేకాదు, 6 గ్యారెంటీల అమలుకు క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. కానీ, ఇవ్వాళ 14 నెలలు కావస్తున్నా ఆరు గ్యారెంటీల ఊసే లేకపోగా, పథకాలకు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తుండటం హాస్యాస్పదం.
అంతేకాదు, ఇటీవల కులగణన సమగ్ర సర్వే కోసం రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇండ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను సేకరించారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించారు. ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి.
ఒకరకంగా చెప్పాలంటే ప్రతి సమాచారం ప్రభుత్వం సేకరించింది. బ్యాంకు ఖాతా, పాసుబుక్ ఉందా, లేదా? ఇలాంటి సమాచారం కూడా ప్రభుత్వం సేకరించి పెట్టింది. ప్రభుత్వ పథకాల అమలుకోసం సమాచారం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇక ఇవి చాలవన్నట్టుగా తాజాగా నిర్వహించిన గ్రామసభల్లోనూ రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అంటే ఒక్క పథకం కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు చేయాలి? ఎన్నిసార్లు దండాలు పెట్టాలన్నది ఇక్కడ చర్చ.
పథకం అమలు చేయదలుచుకుంటే ఏ పథకం కింద ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నది. నిధుల వెసులుబాటును చూసుకొని పథకాలను వర్తింపజేయవచ్చు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా ప్రజాగ్రహం పెల్లుబుకడంతో మాటమార్చి, తూతూ మంత్రంగా గ్రామసభలు జరిపి చేతులు దులుపుకొంటున్నది.
ఇక ఏడాది నుంచి ప్రజలు సర్కారు పథకాల కోసం సర్కస్ ఫీట్లు వేశారు. రాష్ట్రంలో 12,560 గ్రామ పంచాయతీలుంటే అందులో ఒకే ఒక్క రోజు 563 పంచాయతీలను ఎంపిక చేసి 4 పథకాలను అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు గాలికి వదిలిన నేతలు గ్రామసభలు పూర్తవ్వగానే అందరికి అన్ని పథకాలు ఇవ్వాల్సింది పోయి కోతలు పెట్టి, ఎగ్గొట్టి కొసిరి కొసిరి ఇస్తున్నారు.
ఈ 4 పథకాల అమలుకు కూడా మార్చి 31 వరకు గడువు కావాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే డెడ్ లైన్ విధించుకున్నారు. అంటే సర్కారు పథకాలు అమలు కావాలంటే ఏడాదిన్నర సమయం కావాలన్నమాట. రాష్ట్రంలో ఏక కాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ అని ఊదరగొట్టి కేవలం 40 శాతం మంది రైతులకే ఆ పథకాన్ని వర్తింపచేసి చేతులు దులుపుకొన్నట్టే నాలుగు పథకాలను కూడా ఎంపిక చేసిన గ్రామాల్లో అరకొరగా అమలుచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది.
కానీ కాంగ్రెస్ పార్టీకి పథకాలిచ్చే ఉద్దేశం లేదనడానికి వానకాలంలో ఎగ్గొట్టిన రైతుబంధు పథకమే ప్రత్యక్ష తార్కాణం. 6 గ్యారెంటీల హామీల్లో ఒకటైన కల్యాణలక్ష్మికి నిధులు బంద్ చేయడమే కాక తులం బంగారం ఊసే ఎత్తడం లేదు. కేసీఆర్ కిట్ నామ రూపాల్లేకుండా పోయింది. గొర్రెలు, బర్రెలు, చేప పిల్లల ఉత్పత్తికి బ్రేకులు వేశారు. విదేశీ విద్యా నిధిని పూర్తిగా నిలుపుదల చేశారు. నిజంగా ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేయాలనుకుంటే ఇన్ని దరఖాస్తులెందుకు, ఇన్నిసార్లు తిప్పించుకోవడం ఎందుకన్న ప్రశ్న రాకమానదు. అయితే, అందరిని కొన్నిసార్లు మోసగించవచ్చు. కొందరిని అన్నిసార్లూ మోసగించవచ్చు.. కానీ అందరినీ, అన్నిసార్లూ మోసగించలేం అన్నది మాత్రం నిజం.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి