కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి, కాంగ్రెస్ విజయం ఆ ఒక్క రాష్ర్టానికే పరిమితం కాదు. కర్ణాటక ప్రజల తీర్పు దేశానికి మేలుకొలుపు. అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలో పడేసిన బీజేపీకి కర్ణాటక ప్రజలు తమ ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పారు. దీనిని ఒక పార్టీ గెలుపు, మరో పార్టీ ఓటమిగానే చూడవద్దు. ద్వేషం ద్వారా విజయం సాధించవచ్చునని గట్టిగా నమ్ముతున్న ఒక విధానానికి ఓటమిగా కర్ణాటక ఫలితాలను చూడాలి.
శాసనసభ్యులను కొనేయడం, సీబీఐ, ఈడీ దాడులతో ప్రభుత్వాలను దారిలోకి తెచ్చుకోవడం, దీన్ని ప్రశ్నించే
ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా అదుపుచేయాలని ప్రయత్నించడం. ఇలా తమకు ఎదురులేదని, ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికమని, రాష్ర్టాలు అంటే సామంతులు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఢిల్లీ బాద్షాలకు కర్ణాటక ఓటరు సరైన బుద్ధి చెప్పారు. కర్ణాటక ఫలితాలకు రెండు రోజుల ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కొన్ని బీజేపీకి చెంపపెట్టులా ఉన్నాయి.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి 40 శాతం కమిషన్ ప్రభుత్వం అని బలంగా ముద్రపడింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలో ఉన్న కాలంలోనైనా ఈ అవినీతి ముద్ర మాములే. డీకే శివకుమార్, సిద్ధరామయ్య కర్ణాటకలో ఇద్దరూ బలమైన నాయకులే. కాంగ్రెస్ విజయం కోసం ఇద్దరూ ఒకటయ్యారు. ఇది ఫలితాలపై బాగానే ప్రభావం చూపింది. బీజేపీ మత రాజకీయాలకు తెర లేపితే, కుల రాజకీయాలు కాంగ్రెస్ విజయానికి దోహదం చేశాయి. బీజేపీ తరపున నరేంద్ర మోదీనే పోటీ చేస్తున్నారా? అన్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేశారు . 40 నియోజక వర్గాల్లో ప్రధాని ప్రచారం చేశారు . గతం లో ఏ ప్రధాని అయినా రాష్ట్రం లో ఎన్నికలు అయితే ఒకటి రెండు సభల్లో ప్రసంగించేవారు. నరేంద్ర మోదీ మాత్రం 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. మోదీ తన ప్రచారంలో తొమ్మిదేండ్లలో కేంద్రంలో సాధించిన విజయాలు కానీ, రాష్ట్రంలో సాధించిన విజయాలు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారని చెప్పడానికి బదులు మతం ఆధారంగా విజయం సాధించాలని ప్రయత్నించారు.
ఒక ప్రధాని ఎన్నికల ప్రచారంలో పదే పదే ‘కేరళ ఫైల్స్’ అని ఒక సినిమా కథ చెప్పి ఆ సినిమా చూడమనటం, తమ పార్టీకి ఓటు వేయమని కోరడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దేశానికి ఐటీ కేంద్రంగా ఉన్న బెంగళూరులో హిజాబ్ పేరుతో మంటలు రేపి రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న గొడవను కూడా మతాల మధ్య చిచ్చుగా మార్చి ప్రయోజనం పొందాలనే రాజకీయాలను కర్ణాటక ప్రజలు ఈ ఎన్నిక ద్వారా తిప్పికొట్టారు.
కర్ణాటక ఫలితాలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేస్తూ ద్వేషపూరిత రాజకీయాలు నడిపేవారిని ఓడించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు. ఐటీలో ఇక కర్ణాటక, హైదరాబాద్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాల మధ్య, పార్టీల మధ్య ఇలా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అది రాష్ర్టాలకు మంచిది, దేశానికి మంచిది.
మతం పేరుతో చీలిక తెస్తే ఏదో ఒక పార్టీకి అప్పటికప్పుడు రాజకీయ ప్రయోజనం ఉండవచ్చు కానీ, అది దేశానికి తీరని నష్టం తెస్తుంది. దేశంలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని మతం పేరుతో దేశంలో చీలిక తెచ్చే ప్రయత్నాలు భయపెడుతున్నాయని ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే కర్ణాటకలో వచ్చిన ప్రజల తీర్పు మండు వేసవిలో చిరుజల్లుల హాయిగా ఉన్నది. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నది. కేంద్రం, రాష్ర్టాల మధ్య అభివృద్ధి కోసం పోటీ ఉండాలి, ఉపాధి కల్పనలో పోటీ ఉండాలి. కానీ మతం పేరుతో చీలికల కోసం పోటీ ఉండరాదు.
ఓటమికి ఆ ఒక్కటే కారణం అని చెప్పలేం. విజయానికైనా, ఓటమికైనా అనేక కారణాలుంటాయి. ఆ రాష్ర్టానికి సంబంధించి గెలుపు ఓటములకు స్థానిక కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ, అత్యవసర పరిస్థితిని మించి నియంతృత్వంతో పాలన సాగిస్తున్న బీజేపీకి సరైన సమయంలో కర్ణాటక ప్రజలు సరైన తీర్పునిచ్చారు. దేశం అంటే గుజరాత్, ప్రధాని ప్రధాన బాధ్యత అదానీ ప్రయోజనాల కోసం పనిచేయడం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అన్నీ గుజరాత్‌కే ఇచ్చి దక్షిణాదిని పట్టించుకునేది లేదనే భావన దేశాన్ని పాలిస్తున్న వారిలో బలంగా కనిపిస్తున్నది. శాసనసభ్యులను కొనేయ డం, సీబీఐ, ఈడీ దాడులతో ప్రభుత్వాలను దారిలోకి తెచ్చుకోవడం, దీన్ని ప్రశ్నించే ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా అదుపుచేయాలని ప్రయత్నించడం. ఇలా తమకు ఎదురులేదని, ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికమని, రాష్ర్టాలు అంటే సామంతులు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఢిల్లీ బాద్షాలకు కర్ణాటక ఓటరు సరైన బుద్ధి చెప్పారు. కర్ణాటక ఫలితాలకు రెండు రోజుల ముందు సుప్రీంకోర్టు తీర్పులు కొన్ని బీజేపీకి చెంపపెట్టులా ఉన్నాయి.
మహారాష్ట్రలో షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తీరును సుప్రీం తప్పుబట్టింది. గవర్నర్, స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఇక ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ ప్రభుత్వానికి మధ్య వివాదంపై సుప్రీం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని గవర్నర్లు కాదని చెప్పింది. సామంతుల్లా ఉంటే ఉండండి, లేదంటే ఎలా పాలిస్తారో చూస్తామన్నట్టు అన్ని వ్యవస్థల ద్వారా రాష్ర్టాలను కేంద్రం అడ్డుకుంటున్నది. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తెలంగాణ, కేరళ ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలున్న అన్నిచోట్లా గవర్నర్ల వ్యవస్థ ద్వారా కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నది. తెలంగాణలో గవర్నర్ బిల్లులు నొక్కిపెడితే చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. ఇక ప్రతి బిల్లుకు రాష్ర్టాలు సుప్రీంకోర్టుకు వెళ్లాలా?
మితిమీరిన నియంతృత్వ వైఖరిని భారతీయులు సహించరని కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. న్యాయవ్యవస్థ తప్ప ఈ నియంతృత్వానికి ఎదురే లేదా? అని భావిస్తున్న సమయంలో కర్ణాటక ఓటరు అద్భుతమైన తీర్పునిచ్చి తిరిగి ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగేట్టు చేశారు. కాంగ్రెస్ అద్భుతమైన పార్టీ, బీజేపీ దుర్మార్గమైన పార్టీ అని కాదు. బీజేపీ విజయం కోసం దుర్మార్గమైన విధానాలు అవలంబిస్తున్నది. అలాంటి బీజేపీకి ఎక్కడ బలమైన ప్రత్యామ్నాయం ఉంటే దాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక ప్రజలు తీర్పు చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు 136 స్థానాలు, బీజేపీకి 65 స్థానాలు లభించాయి. బీజేపీ పాలకులు వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని తమకు ఎదురే లేదని విర్రవీగుతుంటే, ప్రజాస్వామ్య దేశంలో అన్ని వ్యవస్థల కన్నా సామాన్య ప్రజల చేతిలోని ఓటు అత్యంత శక్తివంతమైనదని సామాన్యుడు తీర్పు చెప్పాడు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నది. ఈ ప్రజాతీర్పును బీజేపీ సానుకూలంగా తీసుకొని ద్వేషపూరిత రాజకీయాలకు బదులు, అభివృద్ధి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తే దేశానికి మంచిది. అలా కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు మరింత పదును పెడితే ఏమవుతుందో పొరుగు దేశం పాకిస్థాన్‌ను చూస్తే అర్థమవుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-బుద్దా మురళి
98499 98087