వ్యవసాయం, రైతులు, గ్రామాలు పరస్పరాశ్రితాలు. ఆకలి తీర్చే పంటలు లేకుంటే మానవ జాతి కొన్ని రోజులు కూడా బతకడం అసాధ్యం. పట్టణాలు, నగరాల కన్నా పల్లెలే ముందు పుట్టాయి. ఈ గ్రామాల నుంచే అన్ని ఉత్పత్తులూ, ఆహార పదార్థాలు అందరికీ చేరుతాయి. అందువల్ల గ్రామాలు, రైతులు సుభిక్షంగా, సౌఖ్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉన్నట్టు. పల్లెలకు రైతులు, ప్రకృతితో దగ్గరి సంబంధం ఉంటుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గ్రామాలను, రైతులను, ప్రకృతిని మన దేశ పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో వ్యవసాయం దెబ్బతిన్నది. ఆహార పదార్థాలు కూడా దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది. చెట్లు, అడవులు నరికివేతకు గురై పచ్చదనం దెబ్బతింది. గ్రామాల్లో వృత్తులన్నీ నశించిపోయి పట్టణాలకు పొట్ట చేత బట్టుకొని వలసలు వెళ్లడం ఉధృతమైంది. పల్లెలు దుబ్బ కొట్టుకుపోయి దీన వదనలయ్యాయి. అన్ని వృత్తులూ దెబ్బతిని పల్లెల్లో పేదరికం విలయ తాండవం చేసేది. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి, తాగునీటి కొరత, కరెంటు కొరతతో పల్లెలు దీన స్థితిలోకి నెట్టబడ్డాయి. తాగేందుకు కూడా నీరు లేని దుస్థితి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణ గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది.
అందరూ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అన్నవారే కానీ ఆ రైతును పట్టించుకున్నవారు లేరు. వ్యవసాయం దండగ అన్నవారు లేకపోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల రైతుల జీవితంలో విప్లవాత్మకమైన పరిణామాలు వచ్చాయి. నెర్రెలు బారిన బీడు పొలాల్లోకి సాగునీరొచ్చి భూమి పూట పండులా తయారైంది. తెలంగాణ నుండి వలసలు దూరమై తెలంగాణకే వలసలు రావడం ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజల ఆదాయ మార్గాలు పెరిగి సామాన్యులు కూడా సమున్నతంగా తలెత్తుకుంటూ నాకేం పర్వాలేదు అనే స్థితిలోకొస్తున్నారు.
ఈ స్వల్ప కాలంలో తెలంగాణలో ఇదంతా ఎలా సాధ్యమైంది? సీఎం కేసీఆర్ తెలంగాణ ఆత్మను ఆవహింపజేసుకొని పథకాలు రచించి శీఘ్రంగా అమలు చేయడంవల్ల. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, ఉచిత కరెంటు వల్ల వ్యవసాయానికి సాగునీటి సమస్య పరిష్కారమైంది. రైతుబంధు, రుణమాఫీ వల్ల రైతుకు పెట్టుబడి సాయం, ఆర్థిక వెసులుబాటు పెరిగింది. కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేయడంవల్ల రైతుల ముఖాల్లో వెలుగు నిండాయి. వ్యవసాయాధారిత వృత్తుల వారికి గొర్రెలను, మేకలను, బర్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం అందించడం వల్ల వారి ఆదాయం పెరిగింది.
కేసీఆర్ పాలనలో బట్టలు తయారుచేసే సాలె రైతన్న, పాలు, మాంసం ఉత్పత్తి చేసే గొల్ల రైతన్న, చేపలు పట్టే తెనుగు, బెస్త రైతన్నలు, కల్లు తీసే గౌడన్న, మట్టితో కుండలు చేసే కుమ్మరన్న, పశువుల తోలుతో చెప్పులు, డప్పులు, తోలు ఉత్పత్తులు చేసే దళితన్న లాంటి వాళ్ళందరి బతుకుల్లో గణనీయమైన మార్పులొచ్చాయన్నది వాస్తవం. ఇదీ తెలంగాణ రైతన్న మాడల్ అభివృద్ధి నమూనా. హైదరాబాద్‌ను సిటీ ఆఫ్ ట్రీస్‌గా, ప్రకృతి వనంగా, దేశానికే ఆదర్శప్రాయ నివాసయోగ్య నగరంగా మార్చడంలోనూ కేసీఆర్ ఆలోచనా సరళి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది.
తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తెలంగాణ మాడల్‌ను దేశమంతటా అమలు చేయడానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అంటే మరేంటో కాదు.. రైతును రాజును చేసే మ్యానిఫెస్టో. ఇంత కాలంగా ఏ జాతీయ పార్టీ అయినా రైతుల గురించి గొప్పగా మాట్లాడిందే తప్ప వారి గురించి, వ్యవసాయం గురించి, గ్రామాల గురించి పట్టించుకోలేదు.
ఈ కాలపు మొట్టమొదటి ముఖ్యాంశమైన ప్రకృతి సంరక్షణ గురించి అసలే పట్టించుకోలేదు. విశ్రాంతి వర్గాలనే తప్ప రైతును పాలకుడిగా చేసే అంశం గురించి ప్రస్తావన కూడా చేయలేదు. కానీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రైతును రాజును చేస్తానంటూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్(ఈసారి రైతు ప్రభుత్వమే) అనే నినాదంతో, అదే మ్యానిఫెస్టోగా జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతున్నారు!
అవును కేసీఆర్ చెప్పినట్టు రైతును రాజును చేయాల్సిందే. అది బీఆర్ఎస్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రైతును రాజును చేయడమంటే ఈ దేశంలోని మెజారిటీ ప్రజలను పాలితుల స్థానం నుండి పాలకుల స్థానానికి తీసుకెళ్ళడమే. రైతును రాజును చేయడంలోని ఉద్దేశం గ్రామాలను కాపాడటమే. రైతు భూమిని ప్రేమిస్తాడు.. పచ్చదనాన్ని ప్రేమిస్తాడు.. చెట్లను పెంచుతాడు.. అడవులను రక్షిస్తాడు. అలాగే ప్రకృతిని ఆరాధిస్తాడు.. గ్రామాలను ప్రేమిస్తాడు. రైతు రాజయితే తాను ప్రేమించే వాటినన్నిటినీ రక్షిస్తాడు. చెట్లను, ప్రకృతిని, గ్రామాలను రక్షించుకోవడమంటే మనిషి తనను తాను రక్షించుకోవడమే. ఓ సువిశాల దృక్పథంతో జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే సామర్థ్యం, వ్యూహాలున్న కేసీఆర్‌లో రైతును రాజును చేసే చాణక్యముందన్న విషయాన్ని భవిష్యత్తు తేల్చి చెప్పనుంది. ఏదేమైనా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన, బంగారు తెలంగాణ స్వప్నాలు సాకారమయినట్టే, రైతు రాజ్యం స్వప్నం కూడా సాకారమవుతుంది.
-డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567