తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మూడు రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏడాది నుంచి దశల వారి ఆందోళనలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో విసిగివేసారిపోయి మార్చి 13న 32 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును కార్మికసంఘాల జేఏసీ యాజమాన్యానికి ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి లెక్కచేయలేదు. దీంతో ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ కార్మికులందరూ నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల ఉద్యోగ భద్రత హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నది.
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నది. కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తిని మరిపిస్తున్నది. బాధ్యతను విస్మరించిన ప్రభుత్వ ధోరణి ఆర్టీసీ కార్మికులపై కక్షపూరిత వైఖరిగానే కనిపిస్తున్నది. అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లను పెట్టుకుని బస్ సర్వీసులను బలవంతంగా నడిపించడం ద్వారా వివిధ చోట్ల ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. టికెట్ లేని ప్రయాణం, తాత్కాలిక డ్రైవర్ల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తే ఎవరు బాధ్యులు? కనీసం పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ వైఖరి ప్రమాదకరమైనది.
ఆర్టీసీ కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే చర్యలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నది. బస్ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్షలు చేసేందుకు అనుమతించకుండా పోలీసులు టెంట్లను తొలగిస్తున్నారు. పదిమంది కార్మికులు ముచ్చటించుకుంటున్న సమయాల్లో కూడా 144 సెక్షన్ పేరుతో వాళ్లను తరిమి వేస్తున్నారు. పోలీసులు తమ పరిధిని ఉల్లంఘించి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆర్టీసీ చైర్మన్ ఎం.నాగిరెడ్డి బెదిరిస్తున్నారు.
ప్రభుత్వ బెదిరింపులు, నిర్బంధపు చర్యల ఫలితంగా నర్సంపేట డ్రైవర్
కోల శంకర్‌గౌడ్ బలయ్యాడు. అంతేకాకుండా జహీరాబాద్‌లో తాత్కాలిక డ్రైవర్ వల్ల 50 మంది ప్రయాణికులు ఉన్న బస్సు ప్రమాదానికి గురై 15 మందికి గాయాలయ్యాయి. భూపాలపల్లిలో డ్రైవర్ రవీందర్ ఆత్మహత్య ప్రయత్నం చేసి ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. భద్రాచలం, ఖమ్మం లాంటి సెంటర్లలో డ్రైవర్లు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యకు యత్నిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ రోజుకు 35.06 లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో 62.34 లక్షల మంది ప్రజలకు ముఖ్యమైన రవాణా సౌకర్యంగా ఉన్నది. ఆర్టీసీకి 9,384 సొంత బస్సులు, 3,396 అద్దె బస్సులను వినియోగిస్తున్నది. ఆక్యుపెన్సివ్ రేషియో (ఓఆర్)లో 90.17 శాతం సాధించి ప్రభుత్వరంగ సంస్థలలో అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందింది. ఆర్టీసీ 58 వేల మంది కార్మికులు 38,419 మందికి తగ్గిపోయారు. సుమారు 20 వేల మంది కార్మికులు రిటైర్డ్ అయినా వారి స్థానంలో రిక్రూట్మెంట్ చేయడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. పథకం వల్ల ఆర్టీసీపై పడే భారాన్ని మాత్రం తగ్గించేందుకు పూనుకోవడం లేదు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2026 మార్చి నాటికి ప్రభుత్వం ఆర్టీసీకి రూ.996 కోట్లు బకాయి పడింది. అంతేకాకుండా రకరకాల సబ్సిడీ ప్రయాణాలకు సంబంధించిన రూ.404.16 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
మెగా రిక్రూట్మెంట్ ద్వారా ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని, సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో నమ్మబలికింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలేదు. ఆర్టీసీ సంస్థలో యూనియన్ గుర్తింపు ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దానిని బుట్టదాఖలా చేసింది. లాభాలతో నడుస్తున్న సంస్థలో కొత్త బస్సులను కొనుగోలు చేసి, ప్రజలకు మరిన్ని రవాణా సౌకర్యాలను కల్పించాల్సిందిపోయి, అద్దెబస్సులు, ఎలక్ట్రిక్ బస్సులతో కాలం గడపాలని చూస్తున్నది. ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.1,400.16 కోట్లు చెల్లించకుండా ఆర్టీసీని దివాలా తీయించే చర్యలకు పాల్పడుతూ ప్రైవేటు సంస్థలకు అమ్మివేయాలని చూస్తున్నది. సిబ్బంది ఆరోగ్య భద్రత, సంక్షేమం గురించి పట్టించుకోకపోగా, ఆర్టీసీ కార్మికుల సహకార నిధులు, పెన్షన్ డబ్బులు వెయ్యి కోట్లకుపైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మారాయి.
ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసులోని 32 డిమాండ్లను పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి. ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేసి, పీఆర్సీని అమలు చేయాలి. సీఎస్ఐ, పీఎఫ్ బకాయిలను చెల్లించాలి. కొత్త ఉద్యోగాలను కల్పించాలి. ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం బకాయిలను చెల్లించాలి. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దుచేసి ఆర్టీసీ సంస్థ ద్వారానే బస్సులు కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. పని భారాన్ని తగ్గించడం, అక్రమ కేసులను ఎత్తివేయడం తదితర డిమాండ్లను తక్షణం పరిష్కరించాలి. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలను చేపట్టాలి. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కార్మికులు చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనది. సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల బాధలను గుర్తించి ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాల్సిన తక్షణ అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని డిమాండ్లను పరిష్కరించేందుకు కార్మికులకు స్పష్టమైన హామీని ఇవ్వాల్సి ఉన్నది. సబ్‌కమిటీని వేశామని ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. సబ్ కమిటీ చెప్పినట్టు 39 డిమాండ్లు 29 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొంటూ పరిష్కరించడానికి ఎందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు? ఆర్టీసీ కార్మికుల ఆకలి మంటలు చల్లారని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఆర్టీసీ కార్మికులపై కక్షపూరిత చర్యలను విడనాడి తక్షణమే జేఏసీతో చిత్తశుద్ధితో కూడిన చర్చలు నిర్వహించి, సమస్యలను పరిష్కరించేలా చూడాలని తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది.
(వ్యాసకర్త: ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు)
-జే.సీతారామయ్య
9490700954