‘ఆర్టీసీ’.. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే సంస్థ. ఈ బస్సులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2023, జూలై 31న క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రజా రవాణాను పటిష్ఠం చేసేందుకు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. 43,373 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. ఆగస్టు 3న ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై సంస్థ లాభనష్టాలు, సంస్థ ఆదాయంతో నిమిత్తం లేకుండానే ఉద్యోగుల బాగోగులకు ప్రభుత్వం నుంచి భరోసా లభించనున్నది.
ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లిస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు, వేతనాలు ఆలస్యమై నెలాఖరుకు జీతాలు ఇచ్చిన ఉదంతాలున్నాయి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. అప్పుల కోసం ప్రభుత్వ గ్యారంటీ సమస్య ఉండదు. ఉద్యోగులకు రూ.3600 కోట్ల బకాయిలు చెల్లించాలి. బ్యాంకు రుణాలు రూ.2,220 కోట్లున్నాయి. ఉద్యోగుల బకాయిలను వీలైనంత తొందరగా చెల్లించడానికి ప్రస్తుత నిర్ణయం దోహదం చేస్తుంది. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ పథకం లేదు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టే వీరికి కూడా అన్ని ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది. ప్రజలకు మరిన్ని సేవలందించడానికి ఆర్టీసీకి వీలుకలుగుతుంది. ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉద్యోగులు చేరే అవకాశం ఉంటుంది.
ఆర్టీసీలో ప్రస్తుతం 18,257 మంది కండక్లర్లు, 15,412 మంది డ్రైవర్లు, 4,700 మంది గ్యారేజీ సిబ్బంది, 812 మంది సూపర్వైజర్లు, 289 మంది అధికారులు, 3800 మంది అకౌంట్స్, పర్సనల్ డిపార్ట్మెంట్ వారు, 103 మంది ఇతర ఉద్యోగులున్నారు. వీరి శ్రమకు దక్కిన గౌరవం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 43 వేల కుటుంబాల్లో వెలుగులు నింపింది.
నిజాం కాలంలో ప్రారంభమై వందేండ్లు పూర్తికాబోయే ముందే ఆర్టీసీకి తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. సంస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలందరూ సమర్థించవలసిన అవసరం ఉన్నది. 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా శాఖ’ అని పిలిచేవారు. 27 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. స్వాతంత్య్రానంతరం 1951 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1958 జనవరి 11న ఏపీఎస్ఆర్టీసీగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 22,628 బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ రవాణా వ్యవస్థగా రికార్డు సాధించింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం, 2015 జూన్ 3న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపాంతరం చెందింది. పేద, మధ్యతరగతి ప్రజలే కాకుండా సంపన్నవర్గాల ప్రజలు కూడా ప్రయాణ భద్రత దృష్ట్యా దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. ప్రస్తుతం ఆర్టీసీలో 9,384 బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 364 బస్స్టేషన్లు, 92 ఆర్టీసీ డిపోలు, 11 రీజియన్లు, 3 జోన్లు, 2 స్టాఫ్ ట్రేనింగ్ కాలేజీలు, 3501 గ్రామీణ ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 2,889 పట్టణ రవాణా వాహనాలు, 39 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలు చవిచూసింది. నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అప్పులలో కూరుకుపోయింది. ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి తలెత్తింది. సంస్థకున్న వేల కోట్ల ఆస్తులను తనఖా పెట్టాల్సిన దుస్థితికి చేరుకున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవలను గుర్తించిన కేసీఆర్ మొదట 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ప్రోత్సహించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన మొదటి రెండేండ్లు రూ.500 కోట్లు, ఆ తర్వాత రెండేండ్లు రూ.1500 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించి సంస్థను నిలబెట్టారు.
ఆర్టీసీ మొబైల్ ద్వారా ‘బస్ ట్రాకింగ్ యాప్’ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూసే పనిలేకుండాపోయింది? బస్సు ఎప్పుడు వస్తుందనే సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. హైదరాబాద్ సిటీ, మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లతో పాటు డిస్ట్రిక్ట్ బస్సులకు వేర్వేరుగా ట్రాక్ చేయవచ్చు.
ఆర్టీసీ 2020, జూన్‌లో ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించింది. ఉపయోగించని పాత బస్సులను పునరుద్ధరించి కార్గో వాహనాలుగా మార్చింది. ప్రభుత్వ వస్తువులు, డిపార్ట్మెంటల్ మెటీరియల్ సరఫరా చేసే లక్ష్యంతో కొనసాగించి, ప్రజలకు అందుబాటులో సేవలనందిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం తీసుకొనే ఈ చర్యను ప్రజలు సమర్థించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
సీవీవీ ప్రసాద్
80196 08475