ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో ఎన్ని మార్పులు సంభవించినా, భౌగోళిక వాస్తవం మాత్రం మారదు. సముద్రమార్గాలపై పట్టు ఉన్నవారే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి కేంద్రంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, అతివేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయాలు ఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో కలిపే ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం, ద్రవీకృత సహజవాయువు, ఎరువుల్లో మూడవ వంతు, పెట్రో రసాయనాల్లో పది శాతానికి పైగా, గల్ఫ్ దేశాల నిత్యావసరాల్లో సుమారు 70 శాతం జరుగుతాయి. అందుకే, ఇక్కడ ఏ చిన్న అంతరాయం జరిగినా ప్రపంచ మార్కెట్లు తక్షణమే స్పందిస్తాయి, వినియోగదారులు ఆందోళన చెందుతారు. ఇటీవలి కాలంలో ఇది మన ప్రత్యక్షానుభవం కూడా!
ఈ జలసంధి ద్వారా జరిగే రవాణాను అనిశ్చితికి గురిచేయగలిగేవి దాని భౌగోళిక స్వరూపం, దానిపై పట్టు కోసం పరితపించే దేశాలు. అత్యంత సన్నని ప్రదేశంలో సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ మార్గంలో, నౌకాయానానికి అనుకూలమైన దారి ఒక్కో వైపు కేవలం మూడు కిలోమీటర్లకే పరిమితం. అందువల్ల, ఈ దారిలో సంచరించే నౌకలపై నిఘా పెట్టడం, వాటి ప్రయాణానికి అవాంతరాలు సృష్టించడం సాంకేతికంగా సులభం. ఈ జలసంధికి ఉత్తరతీరంలో ఉన్న ఇరాన్ ఆ భౌగోళిక సంక్లిష్టతను తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం నేర్పుగా వాడుకుంటున్నది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ హొర్ముజ్‌ను మూసివేస్తామనే హెచ్చరికలు, సముద్రగర్భంలో మందుపాతరలు, నౌకల స్వాధీనం, అడపాదడపా డ్రోన్ దాడులు, టోల్ వసూలు ప్రతిపాదనలు వంటి చర్యలతో అంతర్జాతీయ విపణిలో అస్థిరతకు కారణమవుతున్నది.
అంతేగాక, తమ ప్రధాన ఆదాయవనరు అయిన చమురు సరఫరా ఆగిపోతే – ఖతార్, అరబ్ సంయుక్త రాష్ర్టాలు, బహ్రెయిన్, సౌదీ వంటి ఆర్థికవ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి. సౌదీ, యూఏఈ దేశాలకు పైపులైన్ల వంటి ప్రత్యామ్నాయ మార్గాలున్నా, హొర్ముజ్ లోటును అవి పూడ్చలేవు. ఆసక్తికరంగా, ఈ మార్గాన్ని మూసివేస్తే అమెరికాకు నేరుగా కలిగే నష్టం పరిమితమే. కానీ ముడిచమురు సరఫరా వ్యవస్థలు గాడితప్పడం, ఇంధనధరల్లో హెచ్చుతగ్గులు, తనతో రక్షణ ఒప్పందాలు కలిగి ఉన్న గల్ఫ్ దేశాల్లో అమెరికా సామర్థ్యంపై అనుమానాలు వంటి పరిణామాల వల్ల అమెరికాకు జరిగే పరోక్ష, వ్యూహాత్మక నష్టం మాత్రం దీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుంది.
హొర్ముజ్ ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, ప్రపంచంలోని ఇతర కీలక జలసంధులను కూడా పరిశీలించాలి. మలక్కా జలసంధి ఆసియాలోని పలు పారిశ్రామిక దేశాలకు జీవనాడి. మధ్యప్రాచ్యంలోని చమురు దీని ద్వారా దక్షిణ చైనా సముద్రాన్ని చేరుకుని, అక్కడి నుంచి చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి పారిశ్రామిక దేశాలకు చేరుతుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఏ చిన్న అవాంతరం ఏర్పడినా ఈ దేశాల్లో ఉత్పత్తి కుంటుపడి ప్రపంచ సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతాయి. ఈ జలసంధిలో 1990, 2000 దశకాల్లో జరిగిన నౌకల దోపిడీలు, దారి మళ్లింపులు వంటివి ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.
అలాగే బాబ్ అల్ మాందెబ్ జలసంధి యూరప్-ఆసియా వాణిజ్యానికి కీలకమైన సముద్రద్వారం. దీని ద్వారా నౌకలు సూయజ్ కాలువలోకి ప్రవేశించి, అక్కడి నుంచి మధ్యధరా సముద్రం ద్వారా ఐరోపాలోని ఓడరేవులకు చేరుకునే వెసులుబాటు ఉండటంతో ఈ జలసంధి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ప్రముఖ చమురు ఉత్పత్తిదారు సౌదీ అరేబియా ఎగుమతుల్లో నాలుగో వంతు యాన్బు రేవు నుంచి ఈ జలసంధి ద్వారా ఎర్రసముద్రం చేరుకుంటుంది. యెమెన్‌లోని రాజకీయ అస్థిరతలు, ఇరాన్ ప్రాపకం కలిగిన హౌతీల హెచ్చరికలు ఈ మార్గంలో తరచూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి.
ఐరోపా విషయానికి వస్తే – రష్యా, ఉక్రెయిన్, టర్కీ వంటి నల్లసముద్రం తీరదేశాలను మధ్యధరా సముద్రంతో కలిపే బోస్పోరస్, దార్దెనెల్లెస్ జలసంధులు చరిత్రకెక్కిన గల్లీపోలీ యుద్ధంతో పాటుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. అదే విధంగా జిబ్రాల్టర్ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలుపుతూ, యూరప్-ఆఫ్రికాలను అనుసంధానిస్తున్నది. మిగిలిన జలసంధులతో పోల్చితే, ఇది వివాదాలకు, యుద్ధాలకు కొంత దూరంగానే ఉన్నప్పటికీ, సమీప దేశాలైన స్పెయిన్, ఇంగ్లాండ్ మధ్య ఆధిపత్యపోరుకు వేదికైంది. అన్ని కీలకమైన జలసంధులు కొన్ని సారూప్యతలను సూచిస్తున్నాయి. అవి సన్నని సముద్రమార్గాలు, వినియోగదేశాలు-ఉత్పత్తికేంద్రాల అనుసంధానం, నియంత్రణ కోసం వివాదాలు, ప్రపంచ వాణిజ్యంపై వాటి ప్రభావం.
ప్రపంచం ఇరుపార్శ్వాలను దగ్గరకు చేర్చే సూయజ్ కాలువది మరోచరిత్ర. వాస్తవానికి ఇది సహజసిద్ధంగా ఏర్పడిన జలసంధి కాదు, మానవనిర్మిత కాలువ. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలిపి, ఐరోపాను ఆసియాతో నేరుగా అనుసంధానిస్తుంది. దీంతో ఈ కాలువ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకంగా మారింది. ఒకప్పుడు ఈ కాలువ బ్రిటిష్ సామ్రాజ్య ప్రాబల్యానికి ప్రతీకగా నిలిచింది. కానీ ఈజిప్ట్‌పై బ్రిటన్, దాని మిత్రదేశాలు జరిపిన దాడి అనంతరం సూయజ్పై బ్రిటన్ పట్టు సడలింది. అప్పటివరకు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన పౌండ్ స్టెర్లింగ్ విదేశీమారకద్రవ్యంగా తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోవడం యాదృచ్ఛికం కాదు. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య రంగాల్లో బ్రిటన్ ప్రభావం బలహీనపడటానికి పౌండ్ క్షీణత కూడా ముఖ్య కారణాలల్లో ఒకటిగా నిలిచింది.
పునరావృతం కావడం చరిత్ర లక్షణం. ప్రస్తుతం పాత్రధారులు మారారు కానీ, పాత్రలు కాదు. సూయజ్ స్థానంలో హొర్ముజ్, బ్రిటన్ స్థానంలో అమెరికా, పౌండ్ స్థానంలో పెట్రోడాలర్, ఈజిప్ట్ స్థానంలో ఇరాన్ చేరాయి. ప్రస్తుతం హొర్ముజ్ కేంద్రంగా ఇరాన్ – అమెరికా మధ్య ప్రపంచాన్ని విస్తుగొలిపే దోబూచులాట జరుగుతున్నది. అమెరికా హెచ్చరికలు – అంతలోనే బుజ్జగింపులు, కాల్పుల విరమణ ఒప్పందం – వెనువెంటనే అతిక్రమణ, మందుపాతరలు అమర్చటం – తొలగించటం, అమెరికా-ఇరాన్ పోటాపోటీ అడ్డగింతలు. ఈ చదరంగంలో ఒకవేళ ఇరాన్ పైచేయి సాధిస్తే – దాని ప్రభావం కేవలం చమురు సరఫరాపైనే కాదు; అది పెట్రోడాలర్ వ్యవస్థపై కూడా పడుతుంది.
అంతర్జాతీయ చమురు వాణిజ్యం అత్యధిక శాతం డాలర్ల లోనే జరగడం, అమెరికా తిరుగులేని ఆర్థిక ఆధిపత్యానికి ఒక ప్రధాన కారణం. ఆ దేశం సైనికపాటవం, రవాణామార్గాలపై ఆధిపత్యం, సంప్రదింపుల్లో చాకచక్యం, ఇరాన్ వంటి దేశాలను తన దారికి తెచ్చుకోగలగటం వంటి అంశాలపై ప్రపంచదేశాల్లో సందేహాలు ఏర్పడితే – రష్యా, చైనా, బ్రిక్స్ వంటి దేశాలు, కూటములు డాలర్‌కు తగిన ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు కొంతకాలంపాటు మన మారకంలో చెల్లించి, పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి కూడా పెట్రో డాలర్ స్థానాన్ని పరిమితంగానైన భర్తీ చేయగలదనే సంకేతాన్ని భారత్ ఎప్పుడో ఇచ్చింది.
ఇరాన్‌కు కావలసింది కూడా అదే. దానికి నాందిగానేమో – జలసంధి ద్వారా వెళ్లే చమురు నౌకలకు చైనా వినిమయం యువాన్లలో టోల్‌ను పోలిన రుసుము వసూలు చేయడం ప్రారంభించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఇప్పటికిప్పుడు డాలర్ ప్రాముఖ్యతను తగ్గించలేకపోయినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడవచ్చని విశ్లేషకుల అంచనా. అది ఏ స్థాయిలో జరుగుతుందన్నది చరిత్ర నిర్ణయిస్తుంది. ప్రధాన పాత్రధారులైన అమెరికా- ఇరాన్‌ను పక్కన పెడితే, భారత్ లాంటి చమురు దిగుమతుల ఆధారిత దేశాలకు పటిష్ఠమైన దౌత్యసంబంధాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, వ్యూహాత్మక నిల్వలు, సరఫరాదారుల జాబితా విస్తరణ అనేవి హొర్ముజ్ వంటి జలసంధులు నేర్పే గుణపాఠాలు.
– (వ్యాసకర్త: ఎస్బీఐ విశ్రాంత ఉన్నతాధికారి)
కృష్ణబాలాజి పల్లపోతు