కోటగిరి, మే 31: పొతంగల్ మండల కేంద్రంలో విషాదం నెలకొన్నది. మంజీరా నదిలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు మృతిచెందారు. మృతి చెందిన ఇద్దరు బావ బావమరిది కాగా, ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. పొతంగల్ మండల కేంద్రానికి చెందిన కురుమ గంగొండ(43) ఇంటికి తన బావ అయిన రెంజల్ మండలం బోర్గాంకు చెందిన గంగారాం(50) శనివారం వచ్చాడు.
ఆదివారం ఉదయం గంగొండ, అతడి కుమారుడు కురుమ సంతోష్, గంగారాంతో కలిసి ముగ్గురు పొతంగల్ మంజీరా నది వద్దకు గొర్రెలను తీసుకెళ్లారు. ముందుగా గంగారాం గొర్రెలను శుభ్రం చేయడానికి నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోతుండగా, అతడిని కాపాడడానికి వెళ్లిన గంగొండ కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న సంతోష్ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. గంగొండ భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.