అస్తిత్వానికి నిలువెత్తు ఆసేతు హిమాచలం సురవరం
ఆయన జయంతిన నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం
బుద్ధిలేనితనం సోయి అడుగంటిన దినం
బానిసలున్నంతకాలం మైత్రివనాలు,
మహానాడుల ఏడ్పులుంటాయి
చెంబు చేతి నుండి జారాక అన్నీ కన్నీళ్లే
అవమానాలు వడిసెల రాళ్లయి విసురుతుంటాయి
విగ్రహాలు ఠీవిగా వెలుస్తుంటాయి
తల్లికి జైకొట్టని వాళ్లందరూ గులాములే!
అవును! డిక్షనరీలో లేదంటున్నావ్
అసలు నువ్విక్కడ పుడితే కదా!
ఇక్కడే పుట్టిన జొన్నకర్రకు, తంగేడు పూలకు,
చెలిమెలకు పోరాట చరిత్ర తెలుసు
తుమ్మకాయను శాన్రాయి మీద రాసి బొట్టుపెట్టుకో
అప్పుడు కన్పిస్తది భారత చిత్రపటంలో
సముజ్వల సంగ్రామం తెలంగాణం!
కవులే పూజ్యంబంటే
గోలకొండ కవుల సంచిక మాడు పగులగొట్టింది
తౌరకాంధ్రమన్న కరుణశ్రీల కళ్లు తెరిపించింది
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో చేర్చింది నేనన్న
రెండు కళ్ల సిద్ధాంతిని ఊరు దాటించింది
భాషను మేమే నేర్పించామన్న నోళ్లకు తాళం పడింది
మున్ముందు ఇంకా అవమానిస్తే
అన్నదమ్ములమని మర్సిపోవాల్సిందే!
తెచ్చుకున్నామన్న సంబురం పదేళ్లే పూలపండుగ
చాపకింద నీరులా వలసవాదాన్ని
సుస్థిరపరస్తూ విస్తృతమవుతున్నారు
ఇక్కడి కవులతోనే మా తెలుగుతల్లికి
మల్లెపూల దండంటూ పాడిస్తున్నారు
ఇక్కడి వ్యాఖ్యాతలతోనే వైభవాన్ని పలికిస్తున్నారు
దిగుమతవుతున్నాయి సమైక్య నేతల రూపాలు
రవీంద్రభారతి ఆంధ్రభారతై ఎక్కిరిస్తున్నది
అదునుచూసి పంజా విసురుతున్నారు
పదేళ్లు ఈగలు వాలలే
సమైక్య నక్కలు, తోడేళ్లు తోకలూపుతున్నాయి
మతతత్వ శక్తుల అండతో మీసాలు మెలేస్తున్న విద్వేషాలు
బుద్ధిజీవులం,బుద్ధులం, జయశంకరులం
నిప్పుల నెగళ్లు ఆరిపోలే
అమరుల స్ఫూర్తితో
కవుల కలాలను కదిలిస్తాం..
గోలకొండలా వెలిగిస్తాం
సాంస్కృతిక చారిత్రక
అస్తిత్వాన్ని కాపాడుతాం
కృష్ణా గోదావరులపై
పెత్తనాన్నెదిరిద్దాం!
దళారులను పొలిమేర దాటిద్దాం!
-వనపట్ల సుబ్బయ్య
9492765358