Health Cards | రాష్ట్రావిర్భావ దినోత్సవ వేళ ఉద్యోగులకు సర్కార్ షాక్.. హెల్డ్ కార్డులు ఇవ్వకముందే జీతంలో కోత
Health Cards | తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవ వేళ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబురంగా సంతోషం పంచుకునే సమయాన శుభవార్తను అందించాల్సిందిపోయి..
Health Cards | ఇప్పటికే ఉద్యోగులతో ఆడుకుంటున్న రేవంత్ సర్కార్.. తాజాగా వారికి మరో షాక్ ఇచ్చింది. కొత్త హెల్త్‌కార్డు ఇవ్వకముందే ప్రీమియం వసూలు మొదలుపెట్టింది. హెల్త్‌కేర్ ట్రస్టు ఏర్పాటు చేయలేదు.. మార్గదర్శకాలు జారీ చేయలేదు.. జీవో ఇవ్వలేదు.. దవాఖానలతో ఒప్పందం లేదు.. ఎంపికచేసిన హాస్పిటళ్ల జాబితా ప్రకటించలేదు. ఏ రోగానికి ఎంత ప్యాకేజీ అన్నది నిర్ధారించలేదు.. అన్నింటికి మించి ఉద్యోగుల అంగీకారం తీసుకోలేదు. అయినా తాజాగా ప్రీమియం మొత్తాన్ని కట్ చేసుకుని వేతనాలను చేతిలో పెట్టింది!
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేళ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబురంగా సంతోషం పంచుకునే సమయాన శుభవార్తను అందించాల్సిందిపోయి.. ఊహించని రీతిలో వేతనాల్లో కోతపెట్టి షాకిచ్చింది. ‘ఆలూ లేదు.. చూలూ లేదు’ అన్న చందంగా ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటు కాలేదు.. హెల్త్ కార్డులే ఇవ్వలేదు.. కానీ మే నెల మూలవేతనం నుంచే ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలు కోసం ప్రీమియం వసూలు షురూ చేసింది. ఒక్కో ఉద్యోగి మూలవేతనం నుంచి 1.5 శాతం చొప్పున వాటాను కట్ చేసింది. పే స్లిప్‌లో వేతనం కట్కావడాన్ని చూసుకున్న ఉద్యోగులు అవాక్కయ్యారు. తమ అనుమతి లేకుండా కోత విధించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
భార్యాభర్తలు ఉద్యోగులైతే ఆ ఇద్దరి నుంచి ప్రీమియం కట్ చేయడంపై మరింత దుమారం చెలరేగుతున్నది. ఈ విషయంపై ఉద్యోగులకు కనీస సమాచారం లేదు. ఉత్తర్వుల్లేవు. డ్రాయింగ్ ఆఫీసర్లకు కూడా సమాచారం లేదు. ఆటోమెటిక్‌గా ఉద్యోగుల ఖాతాల నుంచి ప్రీమియం కోత పెట్టారు. రాష్ట్రంలో 2,98,888 మంది ఉద్యోగులుంటే శనివారం వరకు 1,07,926 (36శాతం) ఉద్యోగులు మాత్రమే తమ కుటంబసభ్యుల వివరాలను పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. వీరి నుంచే కాకుండా అప్లోడ్ చేయని వారి ఖాతాల నుంచి ఈహెచ్ఎస్ ప్రీమియం కోత విధించింది. జూన్ నుంచి హెల్త్కార్డులిస్తామన్న సర్కార్ మే మాసం నుంచే ప్రీమియం కట్ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్కార్ తీరును సోషల్ మీడియా వేదికగా దుయ్యబడుతున్నారు.
రాజ్యాంగ ఉల్లంఘనే
వేతనంపై సంపూర్ణ హక్కు ఉద్యోగిదేనని సుప్రీంకోర్టు గత తీర్పులు చెప్తున్నాయి. ఉద్యోగి పొందే జీతం ప్రభుత్వమిచ్చే భిక్ష కాదు. వారి కష్టానికి ప్రతిఫలం. ఆర్టికల్ 300-ఏ ప్రకారం జీతం, పెన్షన్ అనేవి ఉద్యోగుల ఆస్తి కిందికి వస్తాయి. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఉద్యోగి వేతనానికి కోతపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఆర్టికల్ 23 ప్రకారం వేతనంలో కోతపెట్టడం వెట్టిచాకిరీ కిందికి వస్తుంది. జీతంలో కోతకు ఉద్యోగి సమ్మతి తప్పనిసరి. సమ్మతి లేకుండా కోత విధించడం చట్టవిరుద్ధమని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వీటన్నింటినీ ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి మన వద్ద 15వేలకు పైచిలుకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (డీడీవో) యూనిట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, కోతలు ఉన్నా.. ఈ డీడీవో విభాగం కట్ చేయాలి. ఇలా కట్ చేయాలంటే ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేయాలి. బిల్లులు సమర్పించాలి. ఆ మేరకే ఉద్యోగుల వేతనాల నుంచి వాటాను కట్‌చేయాలి. ఉద్యోగుల సమ్మతి లేకుండా. డీడీవోలకు తెలియకుండా ఆటోమెటిక్‌గా కట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని సంఘాల నేతలంటున్నారు. ‘మా జీతాల్లో కోతపెట్టడానికి మీకేం హక్కు ఉన్నది’ అని ప్రశ్నిస్తున్నారు.
ఆశలు.. అడియాశలు
జూన్ 2న రాష్ర్టావిర్భావ వేడుకల సందర్భంగా ఏదో ఒక శుభవార్త ఉంటుందని భావించిన ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాలతో ఇటీవల ప్రభుత్వం తరఫున నిర్వహించిన సమావేశం నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత వస్తుందని ఉద్యోగులు భావించారు. పీఆర్సీ ప్రకటిస్తారని, పెండింగ్‌లోని డీఏలను విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ, ఆఖరుకు వేతనాల్లోనే కోత పెట్టిందని లబోదిబోమంటున్నారు. పెండింగ్ బిల్లుల్లో మొత్తం క్లియర్ కాలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందలేదు. పైగా తమ జీతాలకే కోత పెడుతారా? అంటూ ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఈహెచ్ఎస్ ప్రీమియం నగదు కట్ చేశారు సరే. మరి సోమవారం నుంచి హెల్త్ కార్డులు పనిచేస్తాయా? ఉచిత ఆరోగ్య సేవలు అందుతాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
భగ్గుమంటున్న ఉపాధ్యాయ సంఘాలు
హెల్త్‌కార్డులు ఇవ్వకుండానే ఉద్యోగుల వేతనాల నుంచి ఈహెచ్ఎస్ ప్రీమియం కట్చేయడాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సర్కార్ తీరుపై భగ్గుమన్నాయి. డీడీవోలకు తెలియకుండానే బిల్లులు చేయకుండా ఆటోమెటిక్‌గా కట్ చేయడాన్ని ఖండించాయి. సర్కార్‌కు ఇంత తొందరెందుకని ప్రశ్నించాయి. ఈహెచ్ఎస్పై ఒక్క ముందడుగు పడకుండానే వేతనాల్లో కోతలు పెట్టడం అన్యాయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అభిప్రాయపడింది. వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమచేయాలని సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వోడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల అంగీకారం లేకుండా, వివరాలు సమర్పించకుండానే ప్రీమియం ఎలా కట్ చేస్తారని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య ప్రశ్నించారు. విధివిధానాలు రూపొందించకుండా 1.5 శాతం కట్ చేయడం అన్యాయమని, ఇలాంటి చర్యలతో ప్రభుత్వంపై నమ్మకం పోతుందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్‌యూపీపీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండానే ఈహెచ్ఎస్ కటింగ్ చేయడమేమిటని టీఎస్ యూటీఎఫ్ ప్రశ్నించింది. ఇలాంటి ఏకీకృత నియంతృత్వ నిర్ణయాలతో ప్రభుత్వం అభాసుపాలవుతుందని సంఘం అధ్యక్షుడు సీహెచ్ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ హెచ్చరించారు.
సర్కార్ తీరును సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, సీపీఎస్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. బలవంతంగా ప్రీమియం మినహాయించడంపై టీపీటీఎఫ్ తీవ్ర నిరసనను వ్యక్తంచేసింది. సర్కార్ తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ (ఎస్‌ఎల్‌టీఏ టీఎస్) అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు చందూరి రాజిరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, చింతకుంట జగదీశ్, ములుకనూరి శంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. డీటీఎఫ్ నేతలు సైతం వేతనాల కోతను తప్పుబట్టారు.
వేతనాల కోతను తక్షణమే నిలిపివేయాలి: ఎస్టీయూ టీఎస్
ఈహెచ్ఎస్ కోసం వేతన కోతలను తక్షణమే నిలిపివేయాలని ఎస్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది. ఏకపక్ష చందా మినహాయింపును ఖండించింది. హెల్త్ స్కీమ్ విధివిధానాలు ఖరారు కాకముందే ప్రీమియం కోతపెట్టడం సరికాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఏకపక్షంగా కోత విధించడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, మినహాయించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరారు.
కోత పెట్టడం రాజ్యాంగ విరుద్ధం: సీపీఎస్ఈయూ
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తమకొద్దని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. సీపీఎస్ ఉద్యోగులు, టీచర్ల వేతనాల నుంచి ఏకపక్షంగా కోత విధించడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. వేతనాల నుంచి 1.5 శాతం కోత విధిస్తూ ప్లే స్లిప్స్ జనరేట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పేర్కొన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఉద్యోగి జీతాన్ని కోత కోయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు.
ఇదీ పరిస్థితి!
- జగిత్యాల జిల్లాకు చెందిన భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులే. వీరిలో ఒకరి ఖాతా నుంచి రూ.907, మరొకరి ఖాతా నుంచి రూ.907 చొప్పున కోతపెట్టారు. ఈ ఇంట్లో నలుగురు సభ్యులకే హెల్త్‌కార్డు వర్తిస్తుంది. నలుగురికి నెలకు రూ.1814 కట్ చేస్తున్నారని, ప్రైవేట్ హెల్త్ పాలసీతో పోల్చితే ఈహెచ్ఎస్ ప్రీమియమే అధికంగా ఉన్నట్టు సదరు ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
- ఓ ఉద్యోగి ఖాతా నుంచి రూ.1,347, అతడి భార్య ఖాతా నుంచి రూ.1,775 హెల్త్‌కార్డు కోసం కోతపెట్టారు. ప్రతినెలా రూ.3,100కు పైగా ఈ కుటుంబం నుంచే కట్ అవుతున్నాయి. అంటే అంటే ఏడాదికి రూ.40 వేలు ఈ ఒక్క కుటుంబమే వెచ్చించనున్నది. దీంతో ఆ ఇద్దరు ఉద్యోగులూ లబోదిబోమంటున్నారు.
- వికారాబాద్‌కు చెందిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇంతవరకూ వివరాలు నమోదు చేయనేలేదు. కానీ ఆయన ఖాతా నుంచి రూ.1,729 కట్ అయ్యింది.
- మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి మూల వేతనం రూ.89,780 ఉండగా, ఆ ఉద్యోగి నుంచి రూ.1,347 కట్ చేశారు.
- భవిష్యత్తులో పీఆర్సీ ప్రకటిస్తే ఒక్కొక్కరి ప్రీమియం రూ.2వేలు దాటుతుంది. పైగా 25 ఏండ్లు నిండిన పిల్లలను హెల్త్‌కార్డు నుంచి మినహాయిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. డిపెండెంట్ల వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
- కొందరు ఉద్యోగులు తమకు ఎగ్జిట్ అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. హెల్త్‌కార్డు ఎంపిక విషయంలో స్వేచ్ఛనివ్వాలని కోరుతున్నారు. దీనిని పట్టించుకోకుండా బలవంతంగా ఉద్యోగులందరి ఖాతాల నుంచి ప్రీమియం కోతపెట్టడం సరికాదంటున్నారు.
ఇవేవీ లేకుండా కోతలా?
- రాష్ట్రంలో ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు ఏర్పాటు చేయాలి. ఉద్యోగ సంఘాల నేతలు, ఐఏఎస్ అధికారులతో ఓ ట్రస్టును నెలకొల్పాలి. ఆ ట్రస్టుకు సీఈవోను నియమించలేదు. అయినా ఈహెచ్ఎస్ ప్రీమియం పేరిట ఉద్యోగుల వేతనాల నుంచి అప్పుడే కోతలు మొదలుపెట్టింది.
- ఈహెచ్ఎస్ అమలుపై ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. జీవోను, ఎలాంటి ఉత్తర్వులను జారీచేయలేదు.
- కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలతో ఒప్పందాలు చేసుకోలేదు. చికిత్స అందించే దవాఖానల జాబితాను విడుదల చేయలేదు.
- ఏఏ వ్యాధులు, ఏ రకమైన చికిత్స లభిస్తుందన్న స్పష్టత లేదు. ఏ రోగానికి ఎంత ప్యాకేజీ అన్నది నిర్ధారణే కాలేదు.
- ఉద్యోగుల కాన్సెంట్ లేకుండా, ఉద్యోగుల ప్రమేయంలేకుండా జీతం నుంచి కట్ చేశారు.
- భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి జీతాలూ కట్‌చేశారు. ఎగ్జిట్ ఆప్షన్ ఎందుకివ్వలేదు? ఐచ్ఛికాలివ్వాల్సి ఉండగా, బలవంతంగా ఎలా కట్ చేస్తారు.
- రాష్ట్రంలో కొందరు సీపీఎస్ ఉద్యోగులు రిటైరయ్యారు. పెన్షనర్లకు ఈహెచ్ఎస్ను అమలు చేస్తున్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనే రాలేదు. వీరికెలా హెల్త్కార్డులిస్తారు?
- ఉద్యోగుల వాటా కోత సరే.. సర్కార్ ఇవ్వాల్సిన 1.5 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకివ్వలేదు?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

