రాజకీయాలంటే నటించడమేనని నిరూపిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, మన సీఎం రేవంత్‌రెడ్డి. ఈ ఇద్దరికి ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోయినా తాజాగా బీసీలు, ఓబీసీల కోసం కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డ్రామా రక్తి కడుతున్నది. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటూ ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ వేదికగా ఇద్దరూ పరడబ్బా పరస్పర డబ్బాలు కొట్టుకున్న తీరు రాజకీయాల్లో ఓ రకంగా వెగటు పుట్టిస్తున్నది. 45 సార్లు ఢిల్లీకి వెళ్లిన మన ముఖ్యమంత్రి అక్కడ రాహుల్‌గాంధీ లఘు, శీఘ్ర దర్శనం కోసం ఎన్నిసార్లు పడిగాపులు కాశారో అందరికీ తెలిసిందే. సకుటుంబ సమేతంగా వెళ్లి మరీ ఒక్కసారి దర్శనమివ్వాలని రాహుల్ ఇంటి ముందు ఎన్నిసార్లు వేచి చూశారో.
ఏఐసీసీ కార్యాలయంలో ఉన్నట్టుండి రాహుల్, ఖర్గేతోపాటు రేవంత్ ఉన్న ఫొటోలు ఒక్కసారిగా చక్కర్లు కొట్టడంతో ముఖ్యమంత్రి మొహం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగింది. అయితే రేవంత్, రాహుల్ ఏకాంత భేటీ కాలేదు. ఆ అవకాశం ఇవ్వలేదు కూడా. కానీ, వేదికపై సోనియా ప్రశంసాపత్రం, రాహుల్ మదిని దోచి ఆయన ఆలోచనలు అమలుపరిచానని నమ్మిస్తూ అధిష్ఠానాన్ని ఆకాశానికెత్తిన తీరు, రేవంత్ నటనాశైలి రాజకీయ వర్గాల్లో హస్యాస్పదంగా కనిపిస్తున్నది. అదే సమయంలో తనను అంతలా పొగిడారు కదా.. రేవంత్ గురించి ఆ మాత్రం పొగడకుంటే ఎలా అని రాహుల్ గాంధీ కూడా రేవంత్‌ను అంతకంటే ఎక్కువగా ఆకాశానికెత్తేశారు. అంటే ఇద్దరూ పరడబ్బా, పరస్పర డబ్బాల డాంబికాలతో మమ అనిపించారు. సమావేశం ఆసాంతం రేవంత్, రాహుల్ ముక్తసరితోనే ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకోకపోయినా వేదికపై ఆ ప్రశంసలే పది వేలనట్టుగా తెల్లారే ‘ఎక్స్’ ద్వారా తన అల్పపు సంతోషాన్ని రేవంత్ బయటపెట్టుకున్నారు. తన వందిమాగధులతో సోషల్ మీడియాలో ఆ ఫొటోలను చక్కర్లు కొట్టించారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, రాహుల్‌గాంధీ ఇన్నాళ్లు తనకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదో రేవంత్ అడగలేకపోయారు. తనపై వస్తున్న ఫిర్యాదులపై, ఆరోపణలపై వివరణలు ఇచ్చుకోలేకపోయారు. అదానీతో దోస్తానీ, తన గురువు చంద్రబాబు మధ్యవర్తిగా ప్రధాని మోదీ త్రయంతో చెట్టాపట్టాలు, తన ఆలోచనకనుగుణంగా తెలంగాణ పాలన సాగడం లేదనే ఆక్రోశాన్ని దిగమింగుకుని రేవంత్‌కు దూరంగా రాహుల్ ఉంటున్నారని ఓ ప్రచారం జరుగుతున్నది. పార్లమెంట్ సమావేశాల వేళ ఓబీసీ సదస్సు, తెలంగాణలో జరిగిన కులగణన సర్వే అంశాల కోసం విధిగా రేవంత్‌ను కలవాల్సి వచ్చిందని స్వయానా కాంగ్రెస్ పెద్దలే అంతర్గతంగా చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా రాహుల్, రేవంత్ ఇద్దరూ ఒకే వేదికపై మాట్లాడిన పచ్చి అబద్ధాలపై చర్చ జరగాలి.
తెలంగాణలో కుల సర్వే శా స్త్రీయంగా జరిగిందా? తెలంగాణ జనాభాకు కుల సర్వేలో వెల్లడైన లెక్కలకు పొంతన ఉన్నదా? కుల సర్వే మొదలు, డెడికేటెడ్ కమిషన్, నిపుణుల కమిటీ ఇత్యాదివన్నీ తూతూమంత్రంగానే జరిగాయని రాహుల్‌కు తెలియదా?
అసలు సీఎం హోదాలో కుల సర్వేలో పాల్గొనాలని ఒక్క ప్రెస్ మీట్ గాని, ఒక్క అప్పీల్ గాని చేశారా? ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా? తీరా లెక్కలు బయటికొచ్చాక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సహా బీసీ సంఘాలు తప్పుడు లెక్కలంటూ ఆ పత్రాలకు అగ్గిపెట్టలేదా? ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లినా ఒక్కసారైనా రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి 9వ షెడ్యూల్ గురించి మాట్లాడారా? ఇదే విషయంపై బీసీ కమిషన్ సహా బీసీ సంఘాలు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించలేదా? ఆయన చిత్తశుద్ధిని శంకించలేదా? అటు ఆర్డినెన్స్, ఇటు బిల్లు రూపంలో ద్వంద్వ వైఖరి అవలంబించి బీసీలను మోసం చేస్తున్న తీరుపై చర్చ జరగాలి. ఇలా నిగ్గదిస్తూపోతే కానీ నిజాలు రావు.
ఢిల్లీలో ఏఐసీసీ వేదికపై రేవంత్ మాట్లాడిన తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. తను బీసీ రిజర్వేషన్ల కోసం, కుల సర్వే కోసం 60 రోజులపాటు అహర్నిశలు కృషి చేశారట.. టెన్షన్‌తో ఉన్నారట. ఈ మాటలు విన్న కాంగ్రెస్ బీసీ నేతలే లోలోన నవ్వుకుంటున్నారు. అదే సమయంలో రాహుల్‌గాంధీ కూడా నవ్వుపోదురు గాక నాకేటి సిగ్గని రేవంత్‌ను కృత్రిమ ప్రశంసలతో ముంచెత్తడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తీరు పట్ల రాహుల్ సహా అధిష్ఠానం అంత సానుకూలంగా లేకపోయినా, ఒకరిపై మరొకరికి నమ్మకాలు లేకపోయినా ఇలా నటించడాన్ని చూస్తే ప్రజలకు నవ్వొస్తున్నది.