పురాతన పార్టీగా పేరున్న కాంగ్రెస్ దేశంలోని మూడు రాష్ర్టాల్లో మాత్రమే సొంతంగా అధికారంలో ఉన్నది. వాటిలో దక్షిణాది రాష్ర్టాలైన కర్ణాటక ఒకటైతే, అతికష్టం మీద అధికారంలోకి వచ్చిన తెలంగాణ రెండవది. పద్నాలుగేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపించి, మరో పదేండ్లు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ, ఆ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి ఎంపికలో చారిత్రక తప్పిదం చేసినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలోని మిగతా సీనియర్ నాయకులను కాదని ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడం ఆ పార్టీ చేసిన అతి పెద్ద తప్పిదంగా మారింది.
కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో ముఖ్యమంత్రిగా ఎలాంటి మార్పులు తీసుకురాకపోగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల అరెస్టులు, సోషల్ మీడియా వ్యాఖ్యలపై పోలీసు కేసులు ఆ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంపై కక్షగట్టి కేసీఆర్, కేటీఆర్ లాంటి నాయకులపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. ‘ఫార్ములా-ఈ’ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయాలనే ఆతృతతో ఉన్న రేవంత్‌రెడ్డి ఎంతకైనా దిగజారేందుకు ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ లాంటి నాయకుడిని అరెస్టు చేసి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్న ఆయన ప్రయత్నాలు ఏ మాత్రం సఫలం కావడం లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పరువును దిగజార్చుతున్నాయి. ఒక జాతీయ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా దిగజారడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇలాగే తన వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ వైషమ్యాల కోసం ఇలాగే సమయం వృథా చేస్తే ఆ నష్టం కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జరుగుతుంది.
ఇక తెలంగాణ ఉద్యమ చిహ్నాలను, రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను మార్చే ఉద్దేశంతో ఉన్న ఆయన మొదట రాజముద్రను మార్చాలని ప్రయత్నించి భంగపడ్డారు. తర్వాత టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు. ఇలా పేర్లు, చిహ్నాల మార్పులపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన జాతీయస్థాయిలో బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలకు, విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో జాతీయస్థాయిలో కాంగ్రెస్ పరువు పల్చనయ్యే అవకాశం ఉన్నది. ఇక, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు.
ఇప్పటివరకు రుణమాఫీ పూర్తికాలేదు. దానికోసం ఆశగా ఎదురు చూసిన రైతులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించి, ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ఇలా హామీలు ఇచ్చి అమలు చేయలేకపోతే రేవంత్‌రెడ్డి మాత్రమే వ్యక్తిగతంగా బాధ్యుడు కాదు, ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేదంటే తెలంగాణలోనే కాదు, మరే రాష్ట్రంలోనూ ప్రజలు ఆ పార్టీని నమ్మరు. అంతెందుకు మహారాష్ట్రలో కాంగ్రెస్ హామీలను ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణలో అమలు చేయని హామీలు తమకెందుకని అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు.
హామీల అమలుపై కంటే కక్ష రాజకీయాలపై దృష్టిపెడితే ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించిన ఆ పార్టీ మహారాష్ట్రలో కర్ణాటక, తెలంగాణ హమీల మాట ఎత్తొద్దని నాయకులకు నిర్దేశించింది. చివరికి కాంగ్రెస్ పార్టీ జరిపిన విజయోత్సవాలకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం రావడానికి సుముఖత చూపలేదంటే రేవంత్ సారథ్యంలోని ఆ పార్టీ ఏ మేరకు విజయం సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది కాలంలో అసలు తెలంగాణలో కనిపించదగిన మార్పేమీ రేవంత్‌రెడ్డి తీసుకురాలేకపోయారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న ఆయన ఏడాది గడుస్తున్నా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏదైనా జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మిగతా రాష్ర్టాల్లోనూ చెప్పుకొని ప్రచారం చేసుకుంటుంది. కానీ, తెలంగాణ విషయంలో మాత్రం ఆ పార్టీ జాతీయ నాయకత్వం చెప్పుకోవడానికి సంకోచిస్తున్నది. మామూలుగా కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రులను మార్చే అలవాటు ఉన్నది. కానీ, ఎదురుచూసి నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ దూకుడు మనస్తత్వం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి.
అధిష్ఠానం సూచనలను తెలంగాణ పాలకులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. మిగతా నాయకులతో అంటీముట్టనట్టు వ్యవహరించడం వల్ల ఆయనపై అధిష్ఠానం గతంలో సీరియస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రూ.15 వేల రైతు భరోసాపై వెనక్కి తగ్గడంపై క్యాబినెట్ సహచరుల సూచనలను ఆయన పట్టించుకున్నట్టు కనిపించలేదు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలకు ప్రజల మద్దతు విశేష స్థాయిలో ఎందుకు ఉంటుందన్న విషయాన్ని గ్రహించడం లేదు. లగచర్ల సహా ప్రతిపక్షాలు చేసే ఏ పోరాటాలకైనా ప్రజలు భారీగా మద్దతునిస్తున్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఆమె అమలుచేసిన సం క్షేమ పథకాలా? లేదంటే ఆమె విధించిన ఎమర్జెన్సీ నా? అన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఎలాగూ విశ్వాసం కోల్పోయింది. ఇప్పటికైనా తెలంగాణలోని నాయకత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం సరైన మార్గ నిర్దేశం చేయకపోతే మిగతా రాష్ర్టాల్లోనూ ఆ పార్టీకి అదే గతి పడు తుంది. ఇందులో అనుమానం లేదు.
– (వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి)
సుంకె రవిశంకర్ 79974 26666