మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అంటే అధిష్ఠానం అనుగ్రహం ఉంటే చాలు అనుకునే రోజుల్లో పాలనపై పూర్తి పట్టు ఉన్న నాయకుడిగా పేరు పొందారు. ఆయన వద్దకు ఐఏఎస్ అధికారులు సైతం ఫైళ్లు తీసుకు వెళ్లేటప్పుడు వణికిపోయేవారు. విషయ పరిజ్ఞానం ఉన్న సీఎంలు, మంత్రులు అంటే ఉన్నతాధికారులు సైతం ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారు. సీఎంగా ఒక జిల్లా పర్యటనలో మర్రి చెన్నారెడ్డి నా మాటే జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) అని ప్రకటించారు. ఆ మాట రాజకీయాల్లో ఎంత పాపులర్ అయిందంటే చివరకు ఇప్పటికీ రాజకీయ శాస్త్రం డిగ్రీ సిలబస్‌లో కూడా చేరిన బలమైన స్టేట్మెంట్ ఇది. ప్రభుత్వంలో ఏంచేయాలన్నా జీవో అంటే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా జరుగుతుంది. సమావేశాల్లో, బహిరంగ సభల్లో, అసెంబ్లీలో సీఎంలు ఎన్నో చెబుతుంటారు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారంటే అది ప్రభుత్వ ఉత్తర్వుగానే భావించాలి అని చెన్నారెడ్డి ఆ మాట చెప్పారు. సీఎం మాట్లాడిన దానికి విలువ లేకపోతే.. దారినపోయే దానయ్య మాట్లాడిన దానికి, సీఎం మాటలకు తేడా ఏముంటుంది? గల్లీ లీడర్లు, సామాన్యులు ఏదేదో మాట్లాడవచ్చు. కానీ సీఎం వంటి ఉన్నత స్థానంలో ఉన్నవారు మాట్లాడే మాటలకు విలువ ఉండాలి.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి బ్యాంక్ అకౌంట్ నుంచి జరిమానా సొమ్ము అప్పటికప్పుడు వసూలు అయ్యేట్టు చేయమని ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం. ఆచరణ సాధ్యం కాని, నిబంధనలకు విరుద్ధమైన ఈ మాట విని ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా నవ్వుకొని ఉంటారు. ఇది ఆచరణ సాధ్యమా? అని ఆలోచించడం రేవంత్‌రెడ్డి ఆలోచనా స్థాయికి మించిన విషయం కావచ్చు. కనీసం ఆ మాట అనే ముందు అధికారులతో చర్చించి ఆచరించవచ్చు అని చెబితే.. అప్పుడు బహిరంగ సభలో మాట్లాడితే ఆ పదవికి గౌరవం ఉండేది. నోటికి వచ్చింది ఏదో మాట్లాడితే ఎలా? ఆ మరుసటిరోజే ట్రాఫిక్ చలాన్ల మీద హైకోర్ట్ ఆదేశాలు కళ్లు తెరిపించే విధంగా ఉన్నాయి. జరిమానా ఇప్పుడే చెల్లించాలని ఒత్తిడి తేవద్దు అని ఒక కేసు విచారణలో హైకోర్ట్ ఆదేశించింది ఇదే రేవంత్‌రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు.. తాగి వాహనం నడిపినపుడు పట్టుబడితే జరిమానా విధిస్తున్నారని, సన్నాసులు అని తిట్టారు. సీఎం కాగానే తానే జరిమానా అప్పటికప్పుడు బ్యాంకు ఖాతా నుంచి కట్ కావాలి అంటున్నారు.
తన మాటల మీద తనకే విలువ లేకపోతే, గౌరవం లేకపోతే ప్రజలు ఎలా గౌరవిస్తారు? రేవంత్‌రెడ్డి అంటే మీకు నచ్చకపోవచ్చు కానీ సీఎం హోదాను గౌరవించండి అని ఆయన అనేకసార్లు ఓ మంచి మాట చెప్పారు. అయితే సీఎం హోదాను గౌరవించడాన్ని ముందుగా రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలి. తాను నోరు విప్పే ముందు తాను కేవలం రేవంత్‌రెడ్డిని కాదు.. తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిని అని గుర్తు పెట్టుకోవాలి. ఆ పదవి గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరించమని కోరడం అత్యాశ అవుతుంది. గౌరవం పెంచకపోయినా, ఆ పదవి గౌరవాన్ని తగ్గించవద్దు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు పాలించిన తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రుల్లో అత్యంత బలహీన, విషయ పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిలో రేవంత్‌రెడ్డి ముందుంటారు. టంగుటూరి అంజయ్య విద్యావంతుడు కాకపోయినా సంస్కారవంతుడు. చదువుకు, చదువుకున్న వారికి విలువ ఇచ్చేవారు. కింది నుంచి వచ్చినవారు కావడం వల్ల పేదలకు ఏదో చేయాలని తపించేవారు. అంజయ్య యాదగిరి అనే హెలికాఫ్టర్‌ను ఉపయోగిస్తే ఆయన దుస్తులకు హెలికాప్టర్ వేలాడుతున్నట్టు కార్టూన్ వేసి అపహాస్యం చేశారు. ఆయన భాషను, దుస్తులను, చివరకు హెలికాఫ్టర్‌ను అన్నింటినీ అపహాస్యం చేశారు.
అదే మీడియా ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి అండగా నిలిచింది. అయినా ముఖ్యమంత్రి తన మాటలతో, బూతులతో ప్రజల్లో చులకన అవుతున్నారు. ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్న బూతు మాటలనే బాధితులు అయిన సామాన్య ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఒక బాధిత మహిళ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ‘సీఎం పండబెట్టి తొక్కుతా అంటున్నాడు.. మేం చదువుకోలేదు.. మాలాంటి సామాన్యులు చెడ్డ మాటలు మాట్లాడితే అనుకోవచ్చు.. చదువుకున్నాడు కదా? అంత పెద్ద పదవిలో ఉన్నాడు కదా? అలాంటి భాష మాట్లాడవచ్చునా’? అంటూ చదువు లేని ఒక సామాన్య మహిళ అడుగుతోంది.
భారత్‌పై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. మీరు ప్రధాన మంత్రిగా ఉంటే ఏం చేస్తారు? అని జాతీయ చానెల్లో అడిగితే రేవంత్‌రెడ్డి చెప్పిన సమాధానం..అమెరికాలో మనవాళ్లు అంతా పని చేయడం ఆపేస్తే ట్రంప్ దారికి వస్తాడట. ఇదీ.. విదేశీ విధానాలపై రేవంత్‌రెడ్డి జ్ఞాన గుళిక. కొత్తగా తమ దేశంలోకి మనవాళ్లు రాకుండా అమెరికా తలుపులు మూసుకుంది. రేవంత్‌రెడ్డి చెప్పినట్టు అమెరికాలో మనవాళ్లు పని మానేసి రోడ్డున పడితే వాళ్లను ఇండియాకు పంపిస్తారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పీసీసీ అధ్యక్షుడిగా నోటికి వచ్చింది మాట్లాడి నవ్వులపాలు కావడమే తప్ప సమస్యను అర్థం చేసుకోవాలి అనే ఆలోచన లేదు. ఏ విషయంలోనైనా రేవంత్‌రెడ్డి మాట తీరు ఇలానే ఉంది.
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పాలన చూసిన తరం ఇప్పుడు లేదు. వారి తరువాత తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు అయిన అందరూ గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్నవారు. తమ పాలనతో రాష్ట్రంపై మంచి ప్రభావం చూపినవారు. పీవీ నరసింహారావు స్వయంగా భూస్వామ్య కుటుంబం దాదాపు 15 వందల ఎకరాల వ్యవసాయ భూములు పంచిన దాత. బహుభాషా కోవిదుడు. భూసంస్కరణల ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. దేశంలో గొప్ప మార్పు తెచ్చిన వారు. సీఎంగానే కాదు.. దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణల ద్వారా ఆధునిక భారతదేశానికి దారిచూపినవారు. ‘మా తెలంగాణ బిడ్డ’ అని పీవీ గురించి గొప్పగా చెప్పుకుంటారు.
జలగం వెంగళరావు పుట్టింది కృష్ణా జిల్లాలో. ఉత్తరాంధ్ర మూలాలు ఉన్నా రాజకీయ జీవితం ప్రారంభించింది ఖమ్మం జిల్లాలోనే. జలగంను తెలంగాణ నాయకునిగానే గుర్తిస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి దోహదం చేసిన నాయకుడు, పరిపాలనాదక్షుడు. ఇప్పటి అత్యధిక సర్క్యులేషన్ పత్రికకు ప్రోత్సాహం అందించింది జలగం వెంగళరావే. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఉత్తరాదిలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంగళరావు సమర్థ్ధుడైన ముఖ్యమంత్రిగా అత్యవసర పరిస్థితి నీడలు రాష్ట్రంపై పడకుండా పాలించారు. అంజయ్య తరువాత మరోసారి చెన్నారెడ్డికి అవకాశం దక్కింది. ఆ తరువాత తెలంగాణ వారికి ప్రధాన మంత్రి పదవి దక్కింది కానీ ముఖ్యమంత్రి పదవి దక్కలేదు.
2014లో తెలంగాణ ఏర్పడిన తరువాతే తెలంగాణ వారికి పాలించే అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ‘మీకు పాలించడం రాదు’ అని ఆంధ్ర నాయకత్వం నుంచి బలమైన విమర్శలు వినిపించేవి. మరోవైపు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం విద్యుత్ సమస్య, రైతుల ఆత్మహత్యలు, రాష్ట్ర ఆదాయం ఎంతో, భవిష్యత్తు ఏమిటో తెలియదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యమ నాయకునిగా విజయం సాధించారు. కానీ ఇలాంటి అయోమయ పరిస్థితిలో పాలన ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో అధికారం చేపట్టిన కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పాలనపై పూర్తి పట్టు సాధించడమే కాదు.. తెలంగాణలో అమలు చేసిన పలు పథకాలు దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేసే పరిస్థితి కల్పించి కొత్త రాష్ట్రం తెలంగాణ సగర్వంగా తలెత్తుకునేట్టు చేశారు.
రైతు బంధు, రైతు బీమా, ఇంటింటికీ తాగునీరు వంటి తెలంగాణ పథకాలను కేంద్రం కూడా ప్రవేశ పెట్టింది. పాలకునిగా ఉద్యమ నాయకుడు రాణిస్తాడా అనే అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేశారు. తెలంగాణ అంటే కరువు, రైతుల ఆత్మహత్యలకు ‘సింబాలిక్’ అనే స్థితి నుంచి దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారు.
తెలంగాణ నుంచి దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో అధికారం చేపట్టిన నాయకులు అందరూ పాలనపై పట్టు సాధించడమే కాకుండా, పాలనపై తమ ప్రభావం చూపించారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే..అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచిపోయినా ఇంకా పాలనపై పట్టు సాధించలేదు. విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి అనే ఆసక్తి కూడా ఆయనలో ఏమాత్రం కనిపించడం లేదు. బూతులే తన ‘బ్రాండ్’గా గుర్తింపు పొందారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర అధికార చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉండడం ఏమిటి? చట్.. సహించేది లేదు.. తీసిపారేస్తాను అని సవాల్ చేశారు. కేంద్రం మొట్టికాయలు వేసిందో.. ఏం జరిగిందో.. కానీ ఇప్పుడే కాదు.. డిసెంబర్లో అని అన్నారు. రెండేండ్లయినా ఆయన ప్రకటించిన డిసెంబర్ ఇంకా రాలేదు. అమలు చేసే అధికారం చేతిలో లేనప్పుడు ప్రకటించి నవ్వులపాలు కావడం ఎందుకు?
ఆంధ్రాలో టీడీపీకి, తెలంగాణలో కాంగ్రెస్ శ్రేయోభిలాషి అయిన ఒక వ్యక్తి పలికిన పలుకుల్లో.. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ‘రేవంత్‌రెడ్డి’ సీఎం అయ్యారట. ఆ శ్రేయోభిలాషి మాటల్లో నిజం ఎంత ఉందో, ఎలా సీఎం అయ్యారో తెలియదు. ఎలా అయితేనేం ముఖ్యమంత్రి పదవి లభించింది. రాజకీయాల్లో దశాబ్దాల పాటు కొట్టుమిట్టాడిన వారికి మంత్రి పదవి లభించడమే కష్టం. అలాంటిది ఆ స్థాయి పరిజ్ఞానం, అనుభవం లేకపోయినా దక్కిన సీఎం పదవి గౌరవాన్ని నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించాలి. తన మాట తీరు వల్ల తనకు నష్టం లేకపోవచ్చు కానీ రాష్ట్రం పరువు పోతుంది. నా మాటే జీవో అని సగర్వంగా ప్రకటించిన చెన్నారెడ్డి కాలం నుంచి నోటికి ఏది వస్తే అది మాట్లాడే రేవంత్‌రెడ్డి కాలంలోకి వచ్చాం. ఏ రంగంలోనైనా కాలం గడుస్తున్నకొద్ద్దీ సామర్థ్యం పెరగాలి.
-బుద్దా మురళి