కాంగ్రెస్ తలచుకుంటే కానిదేముంటుంది? అందులోనూ అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినప్పుడు. మన మామూలు ఇంద్రియాలకూ.. వాటికి అందే లెక్కలకూ.. రెండు రెండ్లు అంటే నాలుగు అని అర్థం. లేదు 10 +10=20 అనేది నిజం. కానీ, సాధారణ గణితశాస్త్ర సూత్రాలకు ఆవల, అబద్ధాల ఫ్యాక్టరీలో మరో తర్కం ఉన్నది. సంవత్సరం తరబడి.. ఆ మాటకు వస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు అనేక మాసాల ముందునుంచి గంటకో రకంగా మాట్లాడుతూ… రాష్ట్రం అప్పుల గురించీ, సృష్టించిన ఆస్తుల గురించి అతిశయోక్తులు, అంతులేని అబద్ధాలు మాట్లాడుతూ నడిపిన కుతర్కంతో కాంగ్రెస్ పార్టీని రేవంత్ అధికారంలోకి తెచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చాక కూడా అదే వ్యక్తిత్వం ఆయనను విడదీయలేని నీడగా వెంటాడుతూనే ఉన్నది.
రైతు బంధును, రైతు భరోసాగా మార్చి కేసీఆర్ ఇస్తున్న రూ.10 వేల బదులు తాను రూ.15 వేలు ఇస్తానంటూ ఆకాశంలో మబ్బులు చూసి ముంత పారబోసుకునేలా పేద రైతులను మభ్యపెట్టారు. కాగా, నేడు అధికారంలో కూర్చున్నాక, తన రెండో బడ్జెట్లో – రూ.15 వేలు కాదు తూచ్, రూ.12 వేలతో సర్దుకోండంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆ మాటకు వస్తే, స్వయంగా కేసీఆరే తిరిగి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తామే స్వయంగా రైతుబంధు డబ్బును రూ.12 వేలకు పెంచుతామంటూ చేసిన వాగ్దానాన్ని ఇక్కడ ఒకసారి గుర్తుచేసుకోవచ్చు. కానీ, అదనంగా మరో రూ.3 వేలకు రేవంత్ చేసిన వాగ్దానం నేడు తెలంగాణ కొంప ముంచింది.
అలాగే, అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న (2023) రూ.2 లక్షల మేరకు రైతు రుణమాఫీ చేస్తానంటూ మరో వాగ్దానం చేశారు రేవంత్. అది చాలదన్నట్టు, రుణమాఫీ చేస్తున్నాను కనుక వీలైతే వెళ్లి బ్యాంక్‌లో అప్పు తీసేసుకోండి అంటూ రైతులకు ఉచిత సలహాలు ఇచ్చారు. ఇక వీటితో పాటుగా ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. చివరికి నేడు బడ్జెట్ మీద బడ్జెట్ పడుతున్నా, జనాల ఆశలు అడియాసలుగా మిగిలిపోతున్నాయి. ఆకాశంలో మబ్బులు చూసి ముంత పారబోసుకున్న విధంగా నేడు తెలంగాణ పేద రైతు పరిస్థితీ.. ముసలి పింఛనర్ల దుస్థితి, నిరుద్యోగ యువకుల జీవితాలు మిగిలిపోయాయి.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రే మాయ మాటలు.. మభ్య పెట్టడంతో సాగింది. దీనికి తార్కాణమే, 1960లోనే, నాటి సోషలిస్ట్ నాయకుడు రామ్మనోహర్ లోహియా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పిన మాటలు ‘తక్షణ ప్రయోజనాలను పొందటానికి దీర్ఘకాలిక పర్యవసానాలను లెక్కచేయనితనం కాంగ్రెస్ పార్టీది’. అదీ కథ. అంటే, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం కాంగ్రెస్ పార్టీకి షరామామూలే. ఇదంతా పాత కథ. ఈ కథ తాలుకు ప్రస్తుత ఎపిసోడ్లో రాహుల్ నేతృత్వంలో రాష్ర్టానికి ఓ రకంగా, 5, 6, 7, రకాలుగా గ్యారెంటీలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ రథం కదులుతుంది. కానీ, ఇటు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అటు కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చారు. కానీ, అమలు జరుగుతున్న దాఖలా లేకే ఆఖరికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా ఈ గ్యారెంటీల వ్యవహారం ఏమీ బాగున్నట్టు లేదంటూ మొన్నీ మధ్య ముక్తాయించారు. అంటే, కాంగ్రెస్ పెద్దాయనకే, ఆ పార్టీ నేతల అబద్ధాలు వెగటు పుట్టే స్థాయికి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ అబద్ధాలకు, గంట క్రితం తానేం మాట్లాడాడో కూడా మర్చిపోయే సత్తా ఉన్న మన ముఖ్యమంత్రి శక్తి సామర్థ్యాలు తోడయ్యాయి. ఇంకేం కథ రక్తసిక్తమవుతుంది. తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లతో నేడు మరోసారి ఈ నేల తల్లడిల్లుతుంది.
ఈ కారణం చేతనే, నేడు దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా కేవలం 15 నెలల్లోనే.. ఆ మాటకు వస్తే మొదటి ఆరు నెలల లోపే జనాల ఆగ్రహానికి.. అసహ్యానికి, వ్యతిరేకతకు ఈ ప్రభుత్వం లక్ష్యమైంది. ఈ క్రమంలోనే నిన్నా మొన్నటి బడ్జెట్లో కూడా మరుగుజ్జులు వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసినట్టు ఒక ప్రక్కన గతేడాది బడ్జెట్ తాలూకు రూ.2,91,000 కోట్లలోనే రూ.71,000 కోట్ల మేరకు కోత పడిందని చెప్పుకొంటూనే అంటే గతేడాది బడ్జెట్ అసలు సైజు రూ.2,20,000 కోట్లు అంటూనే, మరో ప్రక్కన నేడు రూ.3,04,000 కోట్ల సూపర్ సైజ్‌తో రికార్డ్ స్థాయి బడ్జెట్‌ను వేసిన దుస్సాహసం ప్రభుత్వానిది.
దీనికిముందు మరో విషయం – 2024 లో బడ్జెట్ వేసే క్రమంలో -అంతకుముందరి టీఆర్ఎస్ బడ్జెట్‌ను విమర్శిస్తూ ఆ బడ్జెట్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయనీ, అవి తాము వేసిన అంచనాలను చేరుకోలేకపోయాయని రేవంత్ ప్రభుత్వం విమర్శించింది. దీనిలో భాగంగానే, కేంద్రం నుంచి వచ్చే గ్రాం ట్ అంచనాలు. కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, అతిగా అంచనా వేసుకున్నదని.. అటువంటి పొరపాట్లు తాము చేయబోమని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మధింపు చేసుకుని వాస్తవాలకు అనుగుణంగా, అతిశయోక్తులు లేకుండా బడ్జెట్ ప్రవేశపెడుతామంటూ చెప్పుకొన్నారు. కాగా, ఈ 15 నెలల కాలంలో ఏ అంచనాను కూడా సరిగా వేయలేక పోవడమే కాకుండా కేసీఆర్ సాధించిన విజయాలను కూడా నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్వపక్షం చేస్తుంది. ఫలితంగానే నేడు తెలంగాణలో తిరిగి రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల కడగండ్లు, నిరుద్యోగ యువతకు ఉపాధి వ్యథలు, దగాపడ్డ మహిళల దిక్కుతోచని స్థితి కనపడుతున్నాయి.
దీనంతటిలో భాగంగానే, నేడు ఈ బడ్జెట్ 6 గ్యారెంటీలకు కేవలం రూ.59,000 కోట్ల చిల్లర కేటాయించి, పండుగ చేసుకోండి అంటూ జనాలకు సెలవిస్తున్నది. కాగా, గత బడ్జెట్లో ఈ గ్యారెంటీలకు రూ.53,000 కోట్ల మేర కేటాయించారు. దీనినైనా పక్కాగా బడ్జెట్లో గ్యారెంటీలకు ఖర్చుపెట్టిన దాఖలాలు లేవు. వాస్తవంలో ఇప్పటికీ అమలు జరిగిన గ్యారెంటీ ఏదైనా ఉందంటే ‘అది కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే. – మిగతా పథకాలన్నీ, అరకొరగానో.. అసలు అమలుకాకుండానో మిగిలిపోయాయి.
అదేమిటని ప్రశ్నిస్తే, కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి పోయిందంటూ అబద్ధాల పరంపరలో మరో అబద్ధం రేవంత్ రెడ్డి సొంతం. అయితే, అసెంబ్లీ సాక్షిగా నాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులంటూ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన నాడూ.. నాటి నుంచి నేటి వరకూ అసెంబ్లీలోనూ బయట, పదే పదే అదే అబద్ధాన్ని వల్లె వేసినాడు కూడా. ఆర్బీఐ, కాగ్ అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ ఎన్నిసార్లు, ఈ ఆరోపణలకు జవాబు చెప్పినా తగ్గేదేలే అన్నది రేవంత్ తీరు. విషయం జనాలకు అర్థమైందని కూడా, బహుశా ఆయన గ్రహిస్తున్నట్టు లేరు. ఏకపక్షంగా తన ధోరణిలో తాను తిట్ల దండకంతో కలగలుపుతూ అంకెల అబద్ధాల కషాయాన్ని కూడా ఇంకా జనం గొంతులో పోయాలని ఆయన చూస్తున్నారు. అదీ ఇదీ అని కాదు, ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోని రేవంత్ కాంగ్రెస్ ప్రస్తు తం బీసీ జనోద్ధరణకు కులగణన చేశానంటూ, చెప్పుకుంటూ.. ఆ సర్వే నివేదిక సిరా చుక్కలు ఇంకా ఆరకముందే బీసీలను దగా చేస్తూ, ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం రూ.11,000 కోట్లకు కొద్దిగా పైనే కేటాయించింది. కాగా, గత సంవత్సరం బడ్జెట్లో ఈ కేటాయింపు రూ.8 వేల కోట్లు మాత్రమే. ఇక ఇప్పుడు గుర్తుచేయాల్సిన హైలైట్ ‘కామారెడ్డిలో.. బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో రూ.20,000 కోట్లు కేటాయిస్తామన్న వాగ్దానాన్ని. అంటే, వాగ్దానాన్ని గత బడ్జెట్లో కాక, ప్రస్తుతం బీసీల కోసం కులగణన పూర్తిచేయాలని చెప్తున్న ఈ బడ్జెట్ ముంగిటిలో కూడా పరిహాసమే చేశారు. అదీ విషయం.
మరో అంశం నిరుద్యోగ భృతికి సంబంధించినది. ఖమ్మం యూత్ డిక్లరేషన్ పేరిట -నిరుద్యోగ యువతకు భృతి కింద రూ.4 వేలు ఇస్తామంటూ స్వయానా ప్రియాంకా గాంధీ ప్రకటించి వెళ్లారు. అయితే, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలొనే మన భట్టి విక్రమార్క గారు నిరుద్యోగ భృతి ఇస్తమని చెప్పలేదని ముక్తాయించి ఊరుకున్నారు. వాగ్దానభంగాల పరంపరలో ఇదో మైలురాయి. అయితే, నిరుద్యోగ యువత అందరి సంగతి ఏమో కానీ, మా కార్యకర్తలకు మాత్రం న్యాయం చేస్తామంటూ రాజీవ్ యువ వికాసం పేరిట, సోనియాగాంధీని మెప్పించే పథకం ఒక దానిని ప్రస్తుత బడ్జెట్లో ప్రవేశపెట్టారు.
కాకపోగా, అన్ని వాగ్దానాలను భంగపర్చి ప్రజల్లో అవమానాన్ని, అపకీర్తిని మూటగట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రస్తుతం ఈ రాజీవ్ యువ వికాసం పట్ల పెద్దగా ఉత్సాహంగా ఉంటారని నేననుకోను. పార్టీలోని పెద్ద నాయకులు అంటే పాలకుల స్థాయిలో ఉన్నవారి అవకతవకలు, ఆలోచనరహిత తీరుకు తాము జనాలలో జవాబు చెప్పుకోవాల్సి రావడం, ప్రస్తుతం కార్యకర్తలకు బహుశా గతంలో ఎప్పుడూ లేనంతటి పెద్ద సమస్యగా తయారైంది.
‘పీఎస్’ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో.. ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయినా, అదంతా ఏమీ పట్టనట్టు రికార్డు స్థాయి బడ్జెట్ మళ్లీ వేసిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తాము ఆ ఖర్చులకు డబ్బు ఎలా సమకూర్చుకుంటామో చెప్పే విజ్ఞత కూడా కొరవడింది. అంటే, నేటి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వీళ్లు గాలిలో దీపంలా మార్చి.. ‘దేవుడా.. నీవే దిక్కు’ అనుకోమంటున్నారు. గుడ్డేటుగానో, గాలివాటుగానో.. మంచే జరుగుతుందని మనల్ని నమ్మమంటున్నారు. ఈ పాలన ఇంకా మూడున్నరేండ్లు ఉన్నది. నిజంగానే తెలంగాణకు నీవే దిక్కు దేవుడా…
కాంగ్రెస్ ప్రస్తుతం బీసీ జనోద్ధరణకు కులగణన చేశానంటూ, చెప్పుకుంటూ.. ఆ సర్వే నివేదిక సిరా చుక్కలు ఇంకా ఆరకముందే బీసీలను దగా చేస్తూ, ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం రూ.11,000 కోట్లకు కొద్దిగా పైనే కేటాయించింది. కాగా, గత సంవత్సరం బడ్జెట్లో ఈ కేటాయింపు రూ.8 వేల కోట్లు మాత్రమే. ఇక ఇప్పుడు గుర్తుచేయాల్సిన హైలైట్ ‘కామారెడ్డిలో.. బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో రూ.20,000 కోట్లు కేటాయిస్తామన్న వాగ్దానాన్ని. అంటే, వాగ్దానాన్ని గత బడ్జెట్లో కాక, ప్రస్తుతం బీసీల కోసం కులగణన పూర్తిచేయాలని చెప్తున్న ఈ బడ్జెట్ ముంగిటిలో కూడా పరిహాసమే చేశారు. అదీ విషయం.