జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారం, పోలింగ్ తీరు చూస్తే ఇది ఒక ఉపఎన్నిక పోలింగ్లా కాకుండా, రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకొనేందుకు పడిన తంటాగా కనిపించింది. ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్‌రెడ్డిని పక్కకు తప్పించి మరొకరిని సీఎంను చేస్తారని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు ఆ సీటు కోసం కాచుకొని కూర్చున్నారనే ప్రచారం బలంగా జరిగింది. దీనికి తగ్గట్టు హై కమాండ్ నుంచి కూడా రేవంత్‌రెడ్డికి ఆశించిన మద్దతు లభించడం లేదు.
ఉప ఎన్నికలో ఓడిపోతే తన కుర్చీకే ఎసరు వస్తుందనే భయంతో ఎన్ని అక్రమాలు చేసైనా గెలవాలని, ఎంత ఖర్చు అయినా గెలవాలనే పట్టుదలను రేవంత్ చూపించారు. ఉమ్మడి రాష్ట్రం లో చెన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు వంటి హేమాహేమీలు సీఎంలుగా ఉన్నప్పుడు జర్నలిస్టులు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కోసం ప్రెస్‌క్లబ్‌కు వచ్చేవారు. కానీ, నేడు ఒక ఉప ఎన్నిక కోసం ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌ను రేవంతే నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌లో స్టార్ హోటల్లో వలె మీట్ ది ప్రెస్‌కు ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదు. అధికార పక్షానికి ఆ ఖర్చు పెద్ద విషయం కాకపోవచ్చు. ఉప ఎన్నికల వ్యయాన్ని కాంగ్రెస్ పార్టీ స్టార్ హోటల్ స్థాయిలోనే నిర్వహించింది. ఉప ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసం అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎలాంటి కోడ్ అడ్డు రాలేదు. గవర్నర్ నుంచి వ్యతిరేకత రాలేదు. బీఆర్ఎస్ సర్కార్‌కు నాడు తమిళి సై అడుగడుగునా అడ్డుపుల్ల వేశారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసిన అజహర్‌ను మంత్రివర్గంలోకి ప్రచార సమయంలో తీసుకున్నా, గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మినహాయిస్తే సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పక్షానికి పెద్ద ఇబ్బందిగా ఉండటం అరుదు. కానీ, రెండేండ్లలోపే ప్రజల్లో అధికారపక్షంపై ఏర్పడిన వ్యతిరేకత, దీనికి తోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే సీఎంను మారుస్తారనే ప్రచారంతో అధికార బలం, అర్థ బలం, సర్వశక్తులు ఒడ్డి ఎలాగైనా గెలవాలని పాలకపక్షం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
అధికార పార్టీ శాసనసభ్యులు, మండలి సభ్యులు పోలింగ్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న దృశ్యాలను మనం చూశాం. సామాన్యులు సైతం వాటిని చిత్రీకరించడం, టీవీల్లో రావడంతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. స్థానికేతరులు అక్కడ ఉండటం తీవ్రమైన విషయమని ప్రకటించారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, జి.రామచంద్ర నాయక్, విప్ బీర్ల ఐలయ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. వాళ్లు అధికార పక్షం నాయకులు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీ, వాళ్లు నిబంధనలు ఉల్లంఘించి పని చేసింది వాళ్ల పార్టీ కోసమే. కాబట్టి, ఎన్నికల అధికారి సీరియస్ అంటే వాళ్లకు ఏదో అయిపోతుందనుకోవద్దు.
ఇదేమి టీఎన్ శేషన్ కాలం కాదు. పైగా బాగా పని చేశారని వీరికి పార్టీలో, ప్రభుత్వంలో గుర్తింపు లభిస్తుంది. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు యథేచ్ఛగా పోలింగ్ బూత్‌లలో తిరుగుతూ ఎన్నికలను అపహాస్యం చేశా రు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే రేవంత్‌రెడ్డి తన పదవిని నిలుపుకోవడానికి అన్నట్టు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాదు, గోపీనాథ్ తల్లిని, ఆయన మొదటి భార్య కుమారుడిని, గోపీనాథ్ తమ్ముడిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. గోపీనాథ్ కుటుంబ వ్యవహారాలను కూడా తెరపైకి తీసుకువచ్చింది. గోపీనాథ్ తల్లితో మీడియా సమావేశం పెట్టించి, అనవసరమైన విషయాలను చర్చకు తెచ్చింది. కుటుంబ వ్యవహారాలను ఉపయోగించుకొని ప్రచారంలో నీచ రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది.
రెండేండ్లలో తాము అద్భుతమైన అభివృద్ధి సాధించామని కాంగ్రెస్ నాయకత్వానికి, రేవంత్ రెడ్డికి నమ్మకం ఉంటే ‘మేం ఇది చేశాం, చేసింది చూసి ఓటు వేయండి’ అని ప్రచారం చేయొచు. కానీ, చేసిందేమీ లేదు కాబట్టి, ఎన్నికల్లో ఇతర మార్గాలను ఎంచుకున్నది. సాధారణంగా రాజకీయ పార్టీలు అధికార పక్షం, విపక్షం ‘మీ పాలనలో ఏం చేశారు? మా హయాంలో ఇది చేశాం’ అని చెప్పి ఓట్లు అడుగుతాయి. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం రెండేండ్లలో తాము ఏం చేశారో ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి చూడాలని ప్రచారం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో స్వయంగా రేవంత్‌రెడ్డి చేసిన ఉపన్యాస వీడియో వైరల్ అయింది. కాం గ్రెస్ అంటేనే అవినీతి, కుంభకోణాలంటూ, ఆ పార్టీ పాలనలో ఏయే రాష్ట్రంలో, ఏయే కుంభకోణాలు జరిగాయో కామన్వెల్త్ కుంభకోణం నుంచి 2జీ కుంభకోణం వరకు, రాజశేఖర్‌రెడ్డి ధనయజ్ఞం అం టూ స్వయంగా రేవంత్‌రెడ్డియే ఎద్దేవా చేస్తూ గతం లో కుంభకోణాల జాబితా చదివారు. ఈ ఎన్నిక ద్వారా తన రెండేండ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదని రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పారు.
-బుద్దా మురళి