కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్ల ఏడు నెలలైంది. ప్రభుత్వం ఊరూ-వాడా సహస్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన సందర్భం కదా! అలా చేసుకుంటే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది? అయినా తమ పాలన గురించి తాము ఘనంగా చెప్పుకోవడానికి ఏమున్నది గనుక? ‘ఉత్సవాలు లేవు.. ఊరేగింపులు లేవు.. ఢిల్లీలో పంచాయితీలే…’ ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్త నిర్వేదం. వాస్తవిక పరిస్థితి కూడా అలాగే ఉన్నది మరి. వెయ్యి రోజుల సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు కీలక మంత్రులు ఢిల్లీలో అధిష్ఠానం ముందు పంచాయితీకి కూర్చున్నారు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు.. సంజాయిషీలు..! ఒకరిని ఒకరు దెబ్బ తీసుకొనేలా వ్యూహాలు, ప్రతివ్యూహాలు! అదే కాంగ్రెస్.. అదే సంస్కృతి! అవే కీచులాటలు! అవే భ్రష్టాచారాలు!
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వానలు సరిగా కురియకపోవడం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సకాలంలో యూరియా అందుబాటులోకి రాకపోవడం వంటి అంశాలు రైతులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కేసీఆర్ పాలనతో పోల్చుకుంటే రేవంత్‌రెడ్డి పాలనలో తమకు ప్రభుత్వపరమైన మద్దతు, భరోసా తగ్గిందన్న ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో ‘ముఖ్యమంత్రి అంటే మంత్రులకు గౌరవం లేదు. కొందరు మంత్రులంటే ముఖ్యమంత్రికి గిట్టదు’ అని కాంగ్రెస్ శ్రేణులే నిర్వేదం వ్యక్తంచేస్తున్న దుస్థితి నెలకొన్నది. తమకు తెలియకుండానే తమ శాఖకు సంబంధించిన నిర్ణయాలు జరిగిపోతున్నాయని, తాము సంతకం చేయకుండానే ఫైళ్లు కదిలిపోతున్నాయని ఒక మంత్రి బాహాటంగానే చెప్పుకొంటుండగా, పలువురు మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోవద్దంటూ ముఖ్యమంత్రిని అధిష్ఠానం కట్టడి చేసిందని, ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం లేదంటూ సానుభూతిని సృష్టించుకొనే ప్రయత్నాలు! ఇటు ముఖ్యమంత్రికీ, అటు మంత్రులకూ స్వేచ్ఛ లేని మాట నిజమే అయితే, మరి పాలన అంతా ఎవరి చేతుల్లోకి వెళ్లినట్టు? ఏ మాఫియా గ్యాంగ్‌లు కంట్రోల్ చేస్తున్నట్టు? పలు కీలక శాఖలను ‘షాడో’లు నియంత్రిస్తున్నారని, ముఖ్యమంత్రి సోదరుల జోక్యం మితిమీరుతున్నదన్న ఆరోపణలు సొంత క్యాంప్ నుంచే వినిపిస్తున్నాయి. క్యాబినెట్‌లోని కీలక మంత్రుల మీద కమీషన్లు, భూదందాల ఆరోపణలు సరేసరి.
మరోవైపు, అంతర్గత కుమ్ములాటలు, పదవీ వ్యామోహాలు, ఎత్తులు, పైఎత్తులతో కాంగ్రెస్ రాజకీయం మరోసారి వేడెక్కింది. రెండు మూడు రోజులపాటు ఢిల్లీలో చర్చల మీద చర్చలు. చివరికి మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డి తొలగింపు. వీరిపై వేటుకు తక్షణ కారణం అవినీతి ఆరోపణలో, అసమర్థతో కాదు! ధిక్కారస్వరం! ‘నా అడ్డాలో నీ పెత్తనం ఏంది?’అనే ధోరణిలో పంచాయితీ! కొండా ఫ్యామిలీ ఎపిసోడ్లో ప్రస్తుతానికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పంతం నెగ్గించుకున్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ, తక్షణం లాభపడ్డది మా త్రం సీనియర్ నేత కే.కేశవరావు కుటుం బం! ‘ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పలువురు సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడితోపాటు సురేఖ ఢిల్లీకి వెళ్లి పంచాయితీ పెట్టుకోగా, కేకే మాత్రం కాలు కదపకుండా సైలెంట్‌గా చక్రం తి ప్పారు’ అని ఓ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషించారు.
కొండా సురేఖను బర్తరఫ్ చేసినందుకు ప్రతిఫలంగా కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మితోపాటు మరో ఇద్దరు బీసీ మహిళానేతలు నేరెళ్ల శారద, గుండు సుధారాణికి క్యాబినెట్ హోదాతో పదవులు దక్కాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం వల్ల జరిగే రాజకీయ నష్టాన్ని, విజయలక్ష్మి, నేరెళ్ల శారద, గుండు సుధారాణికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం ద్వారా పూడ్చుకోవచ్చని అధిష్ఠానం ఏకీభవించి ఉండవచ్చు.
కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పడిన వేటు భవిష్యత్తు రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చెప్పలేం. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టుగా వీరిపై వేసిన వేటుకు భయపడి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి లాంటి వారు సైలెంట్ అవుతారా? లేదంటే ఇతర అసంతృప్తవాదులను కూడగట్టే ప్రయత్నాలు చేస్తారా? అనేది వేచిచూడాలి. కొండా ఫ్యామిలీ తమ సహజసిద్ధ దూకుడు స్వభావంతోనే ముఖ్యమంత్రితో పెట్టుకున్నారా? వెనుక మరేవైనా బలమైన శక్తులు ఉన్నాయా? అనే అంశం మీద ఆధారపడి భవిష్యత్తు పరిణామాలు ఉండొచ్చు. తాము దేనికీ భయపడేది లేదని, మొండిగా ఎదురువెళ్తామని కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు వ్యాఖ్యానించడం, మీసా లు మెలేయడం ఒకింత ఆసక్తికర పరిణామమే.
ముఖ్యమంత్రికి వెయ్యి రోజులు గడిచినంత సాఫీగా, మిగిలిన 825 రోజులు నడువకపోవచ్చు. రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఇదే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రానున్న 500 రోజులు అధికార పార్టీకి చాలా కీలకమైనవి. చివరి మూడొందల రోజులు ఎన్నికల వాతావరణంలో గడిచిపోతాయి. సొంత పార్టీలో క్రమంగా అసమ్మతి స్వరాలు గొంతు విప్పుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం పట్ల వివిధ వర్గాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి క్రమంగా ఉద్యమరూపం తీసుకొంటున్నది. ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ఆయా వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. ఒకవైపు సర్కార్ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలోనే మరోవైపు, రాష్ట్ర రాజధానిలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కదం తొక్కాయి. హామీలు, హక్కుల సాధన కోసం రణభేరి మోగించాయి. ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం’ స్థానంలో పాత పెన్షన్ విధానం తీసుకొస్తామన్న హామీని నెరవేర్చకపోవడం, కొత్త పీఆర్సీ ప్రకటించకపోవడం, డీఏలు పెండింగ్‌లో పెట్టడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల్లో తీవ్ర జాప్యం లాంటి అంశాలు ఉద్యోగ వర్గాల్లో అశాంతిని రాజేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకొంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఎప్పుడు తీరుస్తారో స్పష్టతలేదు.
ఈ ఏడాది నుంచి విద్యా సంవత్సరం ఆరంభంలోనే నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్నవారికి కూడా రూ.35,000 మాత్రమే జమ చేస్తున్నారని, మిగిలిన మొత్తం సంగతేమిటని ఇంజినీరింగ్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాత బకాయిల సంగతి దేవుడెరుగు, కనీసం ఈ ఏడాది ఫీజులైనా ఏ విద్యార్థి ఖాతాలో ఎప్పుడు, ఎంత జమ చేస్తున్నారో తెలియని దుస్థితి విద్యార్థులను కలవరపెడుతున్నది.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వానలు సరిగా కురియకపోవడం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సకాలంలో యూరియా అందుబాటులోకి రాకపోవడం వంటి అంశాలు రైతులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కేసీఆర్ పాలనతో పోల్చుకుంటే రేవంత్‌రెడ్డి పాలనలో తమకు ప్రభుత్వపరమైన మద్దతు, భరోసా తగ్గిందన్న ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా మూడు సీజన్లకు సంబంధించిన రైతుభరోసా ఎగ్గొట్టడం, ధాన్యం బోనస్ సకాలంలో జమ చేయకపోవడం, యూరియా కొరత వంటి అంశాలకు తోడు ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారిన ‘22-ఏ నిషేధిత జాబితా’ సర్కార్‌కు వ్యతిరేక అంశాలుగా మారాయి.
ఇక తాము ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో యువత గుర్రుగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ వివిధ వర్గాలకు ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసింది. అప్పుడు గొర్రెలు, మేకలు, చేప పిల్లల వంటివి పంపిణీ చేస్తే.. బీసీలు ఎప్పటికీ వాటినే మేపుకుంటూ బతకాల్నా? అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని ఇవ్వడం లేదు. దీంతో ఆయా వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలే కాదు, వివిధ అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఉపయోగించిన భాష కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ధిక్కారస్వరం వినిపించిన వారి పదవులు పీకేయడం ద్వారా పార్టీలో అసమ్మతిని అణచివేయడం, ప్రశ్నించే గొంతుకల మీద కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం ద్వారా ఉద్యమాలను అణగదొక్కడం ఒక పరిమిత స్థాయిలో సాధ్యమవుతుందేమో కానీ, విభిన్న వర్గాల్లో గూడుకట్టుకుంటు న్న అశాంతి, అసంతృప్తి, ఆగ్రహం బరస్ట్ కాకుం డా చూడటం ఎక్కువ కాలం సాధ్యం కాదు.
కందిబండ కృష్ణప్రసాద్
91827 77010