రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అతి పెద్ద చర్చ ఫార్ములా ఈ-రేస్. ఈ కేసును అడ్డం పెట్టుకొని రేవంత్ సర్కారు పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తారంటూ కాంగ్రెస్ అనుకూల మీడియా రోజుకో కథనం వండి వారుస్తున్నది. 11 నెలల కిందట కొలువుదీరిన రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చీరాగానే ఫార్ములా ఈ -రేస్‌తో రాష్ర్టానికి కలిగే ప్రయోజనం సున్నా అంటూ ఈ రేసింగ్ పోటీలను నిర్వహించే కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్లోనే ఈ-రేస్‌పై కొత్తగా కొలువుదీరిన సర్కారులోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రకరకాల వ్యాఖ్యలు చేశారు. భారీ కుంభకోణం జరిగిందని మాట్లాడారు. కానీ, 11 నెలల్లో వాళ్లు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేకపోయారు.
Formula E | రేవంత్ సర్కారు ప్రభ క్రమక్రమంగా మసకబారుతుండటం, ఆరు గ్యారెంటీలను అమలుచేయలేక ఆపసోపాలు పడుతున్న నేపథ్యంలో తాజాగా మరోసారి ఫార్ములా ఈ-రేస్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విఫలమైనప్పుడు, అనుకున్న ఫలితాలు సాధించలేనప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించడం ఇటీవల కాలంలో పెరిగింది. ముఖ్యంగా ఈ రేవంత్ సర్కారులో డైవర్షన్ పాలిటిక్స్ మరీ ఎక్కువయ్యాయన్నది కండ్లముందు కనిపిస్తున్న వాస్తవం.
మోటారు కార్లు, వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, వీటిపై చైతన్యం కలిగించడం, పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహిస్తుంటారు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పోటీలు నిర్వహించే అవకాశం మన తెలంగాణ రాష్ర్టానికి దక్కింది. దీని కోసం నాటి కేసీఆర్ సర్కారు పెద్ద కసరత్తే చేసింది. ప్రపంచంలోనే అత్యంత పేరున్న ‘ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్’ (ఎఫ్ఐఏ) ఈ ఫార్ములా ఈ-రేస్ నిర్వహించింది. గతంలో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ వంటి నగరాల్లో ఈ పోటీలు నిర్వహించారు.
ఈ నగరాల సరసన హైదరాబాద్ నిలవాలన్న సదుద్దేశంతో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ-రేస్ నిర్వహించే సంస్థలను సంప్రదించింది. హైదరాబాద్‌లో ఈ-రేస్ నిర్వహించేలా నిర్వాహకులను నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌లు ఒప్పించారు. వాహన రంగంలో వస్తున్న మార్పులను హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేసేందుకు… కాలుష్య రహిత మోటార్లతో కూడిన కార్ల రేసును నగరంలో నిర్వహించారు. ఫార్ములా ఈ-రేస్ 9వ సీజన్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 5-11వ తేదీ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించి ఈ-మొబిలిటి వారంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ-మొబిలిటి వారం సందర్భంగా ఫార్ములా ఈ-రేస్ ఏర్పాటుచేశారు.
2023, ఫిబ్రవరి 11న తొమ్మిదో సీజన్‌కు సంబంధించిన నాలుగో రేస్ హైదరాబాద్‌లోని హుసేన్సాగర్ తీరంలో జరిగింది. దీనికి ముందు ఈ-రేస్‌పై దేశ ప్రజలకు అవగాహన కలిగించేందుకు కౌంట్‌డౌన్ పేరుతో కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా నిర్వహించారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అట్టహాసంగా జరిగిన కౌంట్‌డౌన్ కార్యక్రమానికి అప్పటి, ఇప్పటి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తదితరులు హాజరయ్యారు.
అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కేంద్రంలో ఆనాడు ఉన్నది బీజేపీ సర్కార్, మహారాష్ట్రలో ఆనాడు ఉన్నది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమన్నది మనం ఇక్కడ గమనించాలి. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-రేస్‌లో 11 జట్లు పాల్గొన్నాయి. మొత్తంగా ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉండే 22 బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లు ఈ రేసులో పాల్గొన్నాయి. మెక్లారెన్, మసారెటీ, మహేంద్ర, జాగ్వార్, పోర్శె, నిస్సాన్ వంటి బ్రాండ్ల కార్లు వచ్చాయి. జెన్ 3 కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎలక్ట్రిక్ కార్లు కూడా గంటకు 322 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకొనిపోగలవని ప్రజలకు వివరించేలా వాహనాలను తీసుకువచ్చారు. దీనిద్వారా ఎలక్ట్రిక్ వాహనాలంటే ఉండే అపోహను దూరం చేసినట్టవుతుందని నిర్వాహకులు భావించారు.
2014 నుంచి జరుగుతున్న ఫార్ములా ఈ-రేస్ అత్యంత ప్రత్యేకమైనది. అంతకుముందు కార్ల రేసు అంటే ప్రత్యేకమైన ఇంధనంతో మాత్రమే రేస్ నిర్వహించేవారు. ఇంధనం స్థానంలో బ్యాటరీతో కూడిన వాహనాలను ఉపయోగించి పోటీ నిర్వహించి, బ్యాటరీల సామర్థ్యం ఎలా ఉంటుందో వివరించేందుకు ఈ-రేస్‌లు ఉపయోగపడుతున్నాయి. 2020లో ఫార్ములా ఈ-రేస్‌కు ప్రపంచ రేసింగ్ హోదాను ఎఫ్ఐఏ ఇచ్చింది. ఫార్ములా ఈ-రేస్ కోసం బుక్ మై షోలో టిక్కెట్లను ఉంచితే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎలక్ట్రిక్ కార్లు దూసుకుపోవడాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చినవారున్నారు. రేస్ జరిగిన రెండు రోజులు హుసేన్సాగర్ జనసంద్రాన్ని తలపించింది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని కార్ల ప్రేమికులు ఈ-రేస్‌ను ప్రత్యక్ష ప్రసారాలు, వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మన దేశంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా అనేక మంది క్రీడాకారులు, సినిమా, పారిశ్రామిక ప్రముఖులు వచ్చారు. 31 వేల మంది రేస్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వస్తే… వీళ్లలో సగం మంది బయటి రాష్ర్టాలు, దేశాల నుంచే వచ్చినట్టు నిర్వాహకులు అదేరోజు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుచేసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం ఈ రేస్‌ను ప్రపంచ స్థాయిలో నిర్వహించింది. ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఏ విధంగా అయితే నిర్వహిస్తారో.. అదే స్థాయిలో హైదరాబాద్‌లో అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. మీడియా, సోషల్ మీడియా సహా అనేక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏర్పాట్లు అదరహో అని అభిమానులు కొనియాడారు. నిర్వాహకులు కూడా కేసీఆర్ సర్కార్‌ను ప్రశంసించారు. ప్రభుత్వం ఈ రేస్ నిర్వహణ కోసం ఒప్పందం చేసుకోవడంతో పాటు నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటుచేసింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు, రెవెన్యూ, జలమండలి, విద్యుత్తు తదితర శాఖల అధికారులతో ఒక కమిటీని, పురపాలక శాఖ మంత్రి చైర్మన్‌గా మరో కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి చైర్మన్‌గా ఉన్న కమిటీలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, మహీంద్రా రేసింగ్ టీమ్ సీఈవో దిల్బాగ్ గిల్, ఎఫ్ఐఏకు చెందిన ప్రతినిధి, రేసింగ్‌లో అనుభవం ఉన్న మరో ముగ్గురు కూడా సభ్యులుగా ఉన్నారు. రేస్ నిర్వహణను ఈ కమిటీ పర్యవేక్షించింది. మొత్తం నాలుగు సార్లు ఇక్కడే రేస్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట ఒప్పందం చేసుకున్నది. అయితే, తొలి రేస్‌కు గ్రీన్ కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి. తర్వాత ఏడాది ఫిబ్రవరిలో జరిగే రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది.
ఈ మేరకు హెచ్ఎండీఏ నుంచి నిధులు ఇచ్చారు. రేస్ నిర్వహణలో హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. అందుకే నిధులను అక్కడి నుంచి ఇచ్చారు. రేస్ జరుగుతుందన్న ఉద్దేశంతో నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హెచ్ఎండీఏ స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. దీనికి చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్‌గా పురపాలక శాఖ మంత్రి ఉంటారు. అందుకే ఇక్కడి నుంచి ఇచ్చే నిధులకు రాష్ట్ర ఆర్థిక శాఖతో సంబంధం లేదు. హెచ్ఎండీఏ నుంచి విడుదల చేసిన నిధులను రేస్ నిర్వహించే సంస్థ ఖాతాకే పంపించారు. ఇక్కడ ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదు. ఒకవేళ అనుకున్న ప్రకారం రేస్ జరిగి ఉంటే నిధుల కేటాయింపు అన్నదానిపై అసలు చర్చనే ఉండదు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్ములా ఈ-రేస్‌ను రద్దుచేసింది. డిసెంబర్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
దీంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేస్ రద్దయ్యింది. ప్రభుత్వం ఈ రేస్ నుంచి వైదొలగడంతో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ సంస్థ తనకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెనక్కి ఇవ్వలేదు. ‘మీరు రేస్ నిర్వహిస్తే మేం వచ్చేవాళ్లం కదా’ అన్నది ఆ సంస్థ వాదన. ఇక్కడ నిధుల దుర్వినియోగం లేదా కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు మనీలాండరింగ్ అన్న ముచ్చటే లేదు. ప్రభుత్వం ఒప్పందం నుంచి వెనక్కి మళ్లడంతో రేస్ నిర్వహణ సంస్థ ఒప్పందం ప్రకారం నిధులను తిరిగివ్వలేదు. ఈ రేస్ నిర్వహణ ఏదో గుట్టుచప్పుడు కాకుండా ‘మమ’ అనిపించి నిధులను జేబులో వేసుకున్నారన్నట్టు ప్రచారం చేస్తున్నారు. రూ.50 కోట్ల నిధుల్లోంచి ఆనాటి మంత్రి కేటీఆర్‌కో, లేదా బీఆర్ఎస్ పార్టీకో ఒక్క రూపాయి కూడా వెళ్లలేదు. వాస్తవానికి రేవంత్ సర్కార్ ఒప్పందం నుంచి వెనక్కి వెళ్లాలన్న మూర్ఖపు నిర్ణయంతో ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులకు లబ్ధి చేకూర్చినట్టయింది.
ఈ రేస్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ సర్కారు పెద్దలు వచ్చీరాగానే హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇది కనీసం పట్టుమని నాలుగు వందల మంది కూడా చూసింది లేదు. ఫుట్‌బాల్ ఆటకు కూడా ఉపయోగపడిందేమీ లేదు. ఇంటర్ కాంటినెంటల్ కప్ పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో మూడు మ్యాచ్‌లు నిర్వహించారు. ఇండియా, మారిషస్, సిరియా దేశాల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆ మ్యాచ్‌లకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. దీనికోసం అక్షరాలా రూ.20 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చుచేసింది. గచ్చిబౌలి స్టేడియానికి మరమ్మతులు చేసింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల పేరుతో రూ.20 కోట్లతో మరమ్మతులు చేసి.. మూడు మ్యాచ్‌లు ఆడిపించిన ప్రభుత్వం ఆ తర్వాత వెంటనే సినిమా పాటల కచేరికి స్టేడియాన్ని అప్పగించింది. ఈ నిర్వాకం నిధుల దుర్వినియోగం కిందికి రాదా? అన్న ప్రశ్న ఉదయిస్తున్నది.
‘ఫార్ములా ఈ-రేస్‌లో అవినీతి’ అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బురద జల్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, తద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కక్షసాధింపు కోసం వాడుకోవాలని చూస్తున్నది. 11 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం ప్రతిబింబించలేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఏదో ఒక విధంగా కేటీఆర్‌ను బద్నాం చేయాలన్న లక్ష్యంతో సాగుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కమిషన్, కాళేళ్వరం కమిషన్లను వేసిన ప్రభుత్వం.. ఏమీ సాధించలేకపోయింది. తాజాగా ఈ-రేసు అంశాన్ని తెరమీదికి తెస్తున్నది. కాంగ్రెస్ చేస్తున్న ఈ అరాచకాలను రాష్ట్ర ప్రజలు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు.రాజకీయ కక్షతో చేసే ఏ పనినీ తెలంగాణ ప్రజలు హర్షించరనేది చారిత్రక సత్యం.
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణతో ప్రపంచదేశాల సరసన హైదరాబాద్ చేరినట్టయింది. ప్రపంచంలోని టాప్-25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్టు అనేక సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఈ-రేస్ జరిగిన తర్వాత ఈ-రేస్ ప్రభావంపై నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో హైదరాబాద్ ఆర్థికానికి ఫార్ములా ఈ-రేస్‌తో లబ్ధి చేకూరినట్టు గుర్తించింది.
సుమారు రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి తెలంగాణ రాష్ర్టానికి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. హైదరాబాద్ ఆతిథ్య నగరంగా గొప్ప పేరును సంపాదించుకున్నదని కూడా ఆ సంస్థ చెప్పింది. ఫార్ములా ఈ-రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాదు, ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చిందన్నది వాస్తవం. నీల్సన్ సంస్థ ఇప్పుడు ఇచ్చిన నివేదిక కాదిది. రేస్ జరిగిన తర్వాత ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి అధ్యయనాలను ఆ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది.
ఫార్ములా ఈ-రేస్‌ను తమ రాష్ట్రంలో నిర్వహించాలని సాక్షాత్తూ మహారాష్ట్ర నిర్వాహకులతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కోరారు. ముంబైలోని సమృద్ధి హైవేపై నిర్వహించే అవకాశం ఉన్నదని, రోడ్లు బాగున్నాయని, ఫార్ములా ఈ-రేస్ వంటిది వస్తే ముంబై ఇమేజ్ పెరుగుతుందని ఆయన గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ కౌంట్‌డౌన్ కార్యక్రమంలో అభ్యర్థించారు. హైదరాబాద్‌లో రేస్ నిర్వహిస్తున్నారని, తాము కూడా పోటీ పడతామని, ముంబై వాసులకు ఈ రేస్ చూపిస్తామని ఆయన ఆనాడు వ్యాఖ్యానించడం గమనార్హం.
– ( అర్జున్ )