మిడి మిడి జ్ఞానపు ప్రభుత్వాలు, పరిపక్వత లేని పాలకులు ప్రజలకెప్పుడూ అరిష్టమే. ఈ పది నెలల అజ్ఞానపు పాలనను ‘ప్రభుత్వం’ అని అనాలో, మార్పు కోరిన ప్రజల దీనావస్థలు తెలిసి కూడా కాంగ్రెస్ పెద్దలు, ఆ పార్టీ హై కమాండ్ స్పందించని వైనాన్ని ‘మూర్ఖత్వం’ అని అనాలో అర్థం కావడం లేదు.
Congress Govt | రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలకు తోడు పాలనపై పట్టులేని ప్రభుత్వం ఫలితంగా అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆత్మహత్యలు, హత్యలు పెచ్చరిల్లి అత్యాచారాల రోదనలు మిన్నంటుతున్నాయి. మొత్తంగా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నది సత్యం. ఈ సందర్భంలోనే పాలకులు దగ్గరుండి మరీ పేదల ఇండ్లు కూల్చివేస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. హైదరాబాద్‌లో చెరువులు, నాలాల్లో ఆక్రమణలు పెరిగాయని ఇటీవల ‘హైడ్రా’ పేరుతో జరుగుతున్న బుల్డోజర్ కూల్చివేతల వల్ల పేదల హాహాకారాలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. పేదల ఆస్తులు, ఇండ్లు కూల్చేయాలని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పడం, దానికి ఓ రాజకీయ పార్టీని మాత్రమే టార్గెట్ చేసి ఓ ఐపీఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించడం విడ్డూరం. చెరువుల్లో, నాలాల్లో ఆక్రమణల కూల్చివేత కుతంత్రాలకు తెరలేపుతున్న తీరుకు చట్టబద్ధత కల్పించి మరీ బరి తెగించడం వారి అజ్ఞానానికి పరాకాష్ఠ అని చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల మేరకు పనిచేయాల్సిన ఐపీఎస్ అధికారి ‘అంతా నా ఇష్టం’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, అన్ని సమస్యలకు ‘హైడ్రా’నే పరిష్కారం అన్నట్టు రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో హైదరాబాద్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. తాజాగా మూసీ సుందరీకరణ పేరిట కూల్చివేతలకు శ్రీకారం చుట్టిన తీరు, బాధితుల గోడు చూస్తుంటే సర్కార్ బుల్డోజర్ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది.
1908లో మూసీకి భారీ వరదలు వచ్చి హైదరాబాద్‌ను ముంచేసింది. నాటి పాలకులు రాచరికులైనా ప్రజల విశ్వాసాలను గౌరవించారు. మూసీ వరదల నుంచి తన ప్రజలను కాపాడాలని ఆరో నిజాం పూజలు కూడా చేశారు. హైదరాబాద్‌లో వరదల ఉధృతిని తగ్గించడానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిర్మాణాలకు రూపకల్పన చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి, ఆ తర్వాత కొన్నాళ్లకు ఏర్పడ్డ ఉమ్మడి రాష్ర్టాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీ ఆ తర్వాతి స్థానం టీడీపీది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే సరస్సుల నగరం, ఉద్యాన నగరంగా విలసిల్లిన హైదరాబాద్ ఆక్రమణలకు గురైంది.
ఇదంతా చరిత్ర. గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఒక ప్రణాళిక రూపొందించుకొని దానికనుగుణంగా మూసీలోకి వచ్చే 90 శాతం మురుగు నీటి శుద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. శుద్ధి అయిన నీరే మూసీలో కలిసేలా చర్యలు ప్రారంభించింది. ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో మూసీలోకి వెళ్లేది శుద్ధి చేసిన నీరే తప్ప మురుగు నీరు కాదు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మూసీ సుందరీకరణ చేస్తామని, నది పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఇరువై నాలుగు గంటలు అక్కడ కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అధికారంలోకి రాగానే మూసీ సుందరీకరణ కోసం మొదట రూ.50 వేల కోట్లు, ఆ తర్వాత రూ.1.50 లక్షల కోట్లు అవసరమవుతాయని సీఎం, మంత్రులు వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మూసీ సుందరీకరణ చేస్తే, హైడ్రా పేరిట ఆక్రమణలు కూల్చివేస్తే రాష్ట్రంలో ఇక ఏ సమస్యలు ఉండవని.. ఇదే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నట్టు ఏలికలు మాట్లాడుతున్నారు.
ప్రజా ప్రభుత్వమని చెప్పుకొంటూప్రజల విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. ప్రజల ఆవేదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే ఇవాళ మూసీ పరీవాహక ప్రాంతంలో సర్వేకు వెళ్లిన అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అమాయకులు తనువు చాలించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని, ఏ ప్రభుత్వాన్ని శపించని విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
నిజానికి మురికికూపంగా మారిన మూసీ ప్రక్షాళన కోసం కేసీఆర్ ప్రభుత్వం ‘మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ-ఎంఆర్డీసీ’ని ఏర్పాటు చేసింది. మూసీ నదిని ప్రక్షాళన చేయడం, పరీవాహక ప్రాంతాలను సుందరీకరించడం తదితర పనులు ఎంఆర్డీసీ లక్ష్యం. మురికికూపంగా మారిన నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం రూ.16,635 కోట్ల అవసరమవుతాయని, అప్పట్లో ఎంఆర్డీసీ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అంచనా వేశాయి. రోడ్ల నిర్మాణానికి రూ.9,000 కోట్లు, 31 ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రూ.3,866 కోట్లు, సుందరీకరణ కోసం రూ.2,000 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో లెక్కగట్టారు. దీనికితోడు మూసీపై 14 వంతెనలు నిర్మించేందుకు రూ.545 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్టు అప్పటి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా, ఈ పనులన్నీ జరగాలంటే మొదటిదశలో మురుగునీటి శుద్ధి జరగాల్సి ఉన్నది.
హైదరాబాద్ సీవరేజీ బోర్డు పరిధిలో రోజు దాదాపు 2వేల మిలియన్ గ్యాలన్ల మురుగునీరు విడుదల అవుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. కాగా, ఇందులో 772 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి 25 ఎస్టీపీలు నిర్మించారు. మరో 1,259 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. అంటే ఎక్కడా ఏ చిన్న కూల్చివేత, ఏ చిన్న ఇబ్బంది లేకుండా నగరవాసులను గత ప్రభుత్వం కాపాడుకున్నది. కానీ, హైదరాబాద్ ప్రజలు తమ వెంట లేరనో, లేక ఢిల్లీ పెద్దల వ్యాపారం కోసమో మూసీని పణంగా పెట్టి సుందరీకరణ పేరుతో పేట్రేగుతున్న మారణకాండ పైశాచిక పానలకు అద్దం పడుతున్నది. ప్రభుత్వానికి, ప్రధానంగా ముఖ్యమంత్రికి ఎంత ఆదరణ ఉన్నదో సామాజిక మాధ్యమాలను చూస్తే తెలుస్తున్నది.
హామీల అమల్లో వైఫల్యం, పథకాల లేమి, పాలనపై పట్టు లేకపోవడం వంటి కారణాలతో పాటు అజ్ఞానపు నిర్ణయాలతో అబాసుపాలవుతున్న తీరును కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవలోకనం చేసుకోవాలి. ఇప్పటికైనా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే పాలనలో మార్పు రావాలి. కాబట్టి, అత్యవసరంగా ముఖ్యమంత్రి మారాలి. ఇందుకుగాను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఒక్కసారి తెలంగాణ స్థితిగతులను, భవితను అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నమో ఆ లక్ష్య సాధన దిశగా మంచి పాలన అందించే ముఖ్యమంత్రినే కాంగ్రెస్ తిరిగి ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817