రాజకీయాలను జూదంలా, జాణతనంలా మాత్రమే భావించేవారు పాలకులైతే.. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడానికి నేడు తెలంగాణ నిదర్శనంలా మారింది. కుసంస్కార సర్కార్ కుప్పిగంతులు విజయాల తెలంగాణను వివాదాలకు నిలయంగా, వేదనకు వేదికగా మార్చాయి. అసలే అది కాంగ్రెస్ పార్టీ, పైగా అదొక కుట్రదారి చేతిలో పావుగా మారడంతో ప్రభుత్వమే పగదారిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మౌలిక స్వభావంలోనే పేదల వ్యతిరేకత, నైతికతలేమి ఇమిడి ఉన్నాయనే వాస్తవం దాని రాజకీయ చరిత్రను చూస్తే మనకు స్పష్టమవుతుంది.
ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్లుగా.. అచ్చంగా అవే సుగుణాలతో పెరిగిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి, చెరబట్టి చరిత్రను పునరావృతం చేస్తున్నారు. ప్రభుత్వాలను ప్రజా విరోధులుగా మార్చి, సమాజాన్ని వెనక్కు నడపడంలో హస్తం పార్టీ నేతలందరూ అందెవేసిన ‘చెయ్యి’లే. ఆ కోవలోనే మరింత వికృతంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలన సాగుతున్నది. దానివల్లనే ఏడాదికే తెలంగాణ దుఃఖదాయినిగా మారిపోయింది. హైదరాబాద్‌లో రోదన, గ్రామాల్లో వేదన తప్ప మరో భావోద్వేగం కనిపించడం లేదు. ఏడాది ఏలుబడిలోనే తెలంగాణ వికాసానికి తలకొరివి పెట్టేశారు. పైగా మరో ఏడాదిలో కేసీఆర్ పేరే వినపడకుండా చేస్తానని రేవంత్‌రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతుండటం చూస్తుంటే.. మనిషిలో ఇంత విలనిజం కూడా ఉంటుందా? అని ఆశ్చర్యమేస్తున్నది.
అవివేకులు మాత్రమే తెలంగాణను, కేసీఆర్‌ను వేర్వేరుగా చూస్తారు. కల్యాణలక్ష్మితో సంసారమై పండి, కేసీఆర్ కిట్‌తో మానవవనరులై వర్ధిల్లుతున్న వేలాదిమంది మదిలో నుంచి కేసీఆర్‌ను ఎలా చెరిపేయగలరు? అసలు తెలంగాణ రాష్ట్రం మనుగడలోనే మమేకమైపోయిన నేత కేసీఆర్. ఆయన పేరును చెరిపేయాలని ఉబలాటపడటమంటే.. తీరంలో నిలబడి సముద్రాన్ని మింగేయాలనుకోవడమే. అయినా చారిత్రక నేతల పేర్లు చెరిపేయాలనే తలంపు రావడమే ఎంతటి పైశాచికత్వం? మనిషి ఎంత మరుగుజ్జుగా ఆలోచిస్తే మాత్రం.. అంతగా మంచిచేయాలనే దారి వదిలి, ఎత్తులతో తుడిపేస్తాననే వికారత్వాన్ని నమ్ముకుంటాడు? బహుశా ఈ విపరీత ధోరణి ఇటీవల కాలంలో రేవంత్‌రెడ్డిలో తప్ప దేశంలో మరెవరిలోనూ మనం చూడజాలం. మనస్తత్వంలోనే వైకల్యం ఉన్న వ్యక్తి నుంచి ఉన్నతమైన ఆచరణను ఆశించలేం. నిత్యం కుట్రాజకీయం తప్ప మరో ప్రగతి కోణమే తలంపునకు రాని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతీ చర్యకు ప్రతీకారమే కొలమానంగా మారిపోయింది.
మొన్నటికి మొన్న రాజ్ పాకాల నివాసంలోకి చొరబడ్డ రేవంత్‌రెడ్డి సర్కార్ ఎంతటి పైశాచికత్వాన్ని ప్రదర్శించిందో యావత్ సమాజం గమనించింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని విపక్ష పార్టీ నేతల బంధువులను లక్ష్యంగా చేసుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ కుట్రలు, బరితెగుంపు నైజం బట్టబయలైంది. నిత్యం విపక్షమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాగాన్ని వాడుకోవడం ఎంతటి అన్యాయం? ప్రజల విశ్వాసాన్ని, రాష్ట్ర భవితవ్యాన్ని పణంగా పెట్టి, కేవలం బీఆర్ఎస్ పార్టీని కటకటాల్లోకి నెట్టాలనే కడుపుబ్బర వ్యాధితో రేవంత్‌రెడ్డి సర్కార్ సతమతమవుతున్నది. అందుకే అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై ఒంటికాలితో లేచింది. విద్యుత్తు ఒప్పందాలపై విరుచుకుపడి అభాండాలేసింది. తాజాగా ఫార్ములా ఈ-రేసింగ్‌పై రంధ్రాన్వేషణ చేస్తున్నది.
నీళ్లు, కరెంట్‌ను కలిపి తెలంగాణలో సిరులు పండించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆవేదనాగ్నిని చల్లార్చి.. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని ఊరూ రా వెలిగించింది పదేండ్ల బీఆర్ఎస్ సర్కార్. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలెన్నో తెలంగాణ ప్రగతిని కొనియాడాయి. గతంలో రాసిన అనేక వ్యాసాల్లో నేనే కాదు, చాలామంది అవగాహనాపరులు ఆ అభివృద్ధి గణాంకాలను ప్రజల ముం దుంచారు. అలాగే ఫార్ములా ఈ -రేసింగ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరుప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది. కేసీఆర్‌కు ముందటి ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో అనేక రకాల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల కోసం వందలాది కోట్ల రూపాయలు వెచ్చించాయి. కామన్వెల్త్, ఆఫ్రో- ఏసియన్ గేమ్స్ ఇలా ఎన్నో మెగా క్రీడా ఈవెంట్లను దేశంలో నిర్వహించాయి. దేశం పేరుప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేసే ఇలాంటి వాటిపై నీలాపనిందలేయడం మంచి ప్రభుత్వాల నైజం కాజాలదు. అయినా ప్రజల విజయం కోసం శ్రమించే సర్కార్ అయితే, నిన్నటికి మించిన సకారాత్మక పాలనా విధానాలను అమలు చేయడంపైనే దృష్టిసారిస్తుంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తన సహజ స్వభావానికి విరుద్ధంగా అలా ఎలా పనిచేయగలుగుతుంది? రేవంత్ సర్కార్‌కు మాయోపాయాలు తప్ప మంచి పనులు చేతకానే కావని తేటతెల్లమైంది. ఆ కోవలోనే ఇప్పుడు తాజాగా దీపావళి బాంబుల బాగోతం బయటపెట్టుకుంది. అయినా బాంబుల వర్షం కురిసినా, ఫిరంగుల మోతమోగినా ఎత్తిన జెండా దించడం, తెలంగాణకు తలవంపులు తేవడం కేసీఆర్ అభిమాన గణానికి తెలియదు.
అవివేకులు మాత్రమే తెలంగాణను, కేసీఆర్‌ను వేర్వేరుగా చూస్తారు. కల్యాణలక్ష్మితో సంసారమై పండి, కేసీఆర్ కిట్‌తో మానవవనరులై వర్ధిల్లుతున్న వేలాదిమంది మదిలో నుంచి కేసీఆర్‌ను ఎలా చెరిపేయగలరు? అసలు తెలంగాణ రాష్ట్రం మనుగడలోనే మమేకమైపోయిన నేత కేసీఆర్. ఆయన పేరును చెరిపేయాలని ఉబలాటపడటమంటే.. తీరంలో నిలబడి సముద్రాన్ని మింగేయాలనుకోవడమే.
విపక్షంపై ఇలా ఎన్నో విధాలుగా బ్లేమ్ గేమ్ ఎత్తులు వేస్తున్న రేవంత్ సర్కార్ చివరికి పథకాలను, ప్రభుత్వ విధానాలను కూడా శకుని పాచికల్లా వాడుతుండటమే అందరికీ ఆవేదన కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీపడ్డ హామీలనూ కుట్రార్పణం చేసేలా కార్యాచరణను అమలు పరుస్తుండటం బాధ కలిగిస్తున్నది. ఇప్పటికే వానకాలంలో వ్యవసాయ రంగానికి వడదెబ్బ సోకించారు. రుణమాఫీ, రైతుభరోసాల అంశంలో సర్కార్ అన్నదాతలతో చెలగాటమెలా ఆడుతున్నదో తేలిపోయింది. దేశంలో చరిత్ర పొడుగునా ఏ ప్రభుత్వాలైనా, పాలకులెవరైనా సరే రైతుల విషయంలో అప్పటికే అమలవుతున్న పథకాలకు అదనపు విలువను జోడించారే తప్ప, కత్తిరించే చర్యలకు పూనుకోలేదు. కానీ, రేవంత్ ప్రభుత్వం మాత్రం రైతుబంధును, రుణమాఫీని కొండంత రాగమాలపించి, కోడి ఈకలు పీకిచ్చినట్లుగా చేసేసింది. ఇక మరో కీలకమైన విద్యారంగమైతే విలవిలాడుతోంది. ఎండమావులను చూపించి, ఉన్న చెరువుగట్టును తెంపినట్లుగా సమీకృత గురుకులాల పేరిట సాంఘిక సంక్షేమ గురుకులాలను క్రమంగా ఖాళీ చేయించే కుయుక్తులు పన్నుతున్నది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ భావజాలంలోనే వివక్షాపూరిత విద్యానమూనా నిక్షిప్తమై ఉన్నది. అందుకే 1959లో కేవలం విద్యాసంస్థలను జాతీయం చేసిందనే ఒకేఒక్క కారణంగా నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని మెజారిటీ ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ కూలదోశారు. ఇలా ఎన్నో అన్యాయమైన విధానాలతో దేశంలో సుదీర్ఘకాలం విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలకు పేదవర్గాలను దూరంగా ఉంచిందే కాంగ్రెస్ పార్టీ కదా!
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంలోనూ నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టుగానే కాంగ్రెస్ వ్యవహరించింది. న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోకి తీసుకొని, రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా కాకుండా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక, ఆర్థిక సర్వే జరిపించాలని బీఆర్ఎస్ చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. బీసీ కమిషన్, ప్లానింగ్ డిపార్టుమెంట్లకు విడివిడిగా జీవోలు ఇచ్చి, చివరికి బీసీ రిజర్వేషన్లు న్యాయ వివాదంలో చిక్కుకునేలా రేవంత్ సర్కార్ కుయుక్తులు పన్నింది. బీఆర్ఎస్ చెప్పినట్టే హైకోర్ట్ కూడా సర్కార్ చేస్తున్న కసరత్తు అశాస్త్రీయమని తేటతెల్లం చేసింది.
ఇలా హైడ్రా, మూసీ.. అన్నింటా వంచనే విధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యాచరణ సాగుతున్నది. దీని వల్లే తెలంగాణ ఆందోళన బాటపట్టింది. చివరికి సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని ప్రజలు దేహశుద్ధి చేసేదాకా పరిస్థితి విషమించింది. ఇటీవల అకడమిక్ పరిశోధనల్లో ప్రామాణిక సంస్థ అయిన ఈపీడబ్ల్యూ 2014-15 నుంచి 2022-23 మధ్య దేశంలోనే తెలంగాణ ఎలాంటి ఆరోగ్యకర ఆర్థిక వ్యవస్థను అమలుపరిచిందో స్పష్టాతిస్పష్టంగా పరిశోధించి వెల్లడించింది. వనరులు, రుణాలు, వ్యయాల్లో రాష్ట్ర సమతుల్య అభివృద్ధే కొలమానంగా కేసీఆర్ సర్కార్ దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాల కంటే శాస్త్రీయ పాలనను అందించిందని కొనియాడింది. కానీ, గడిచిన 11 నెలలుగా రాష్ట్ర విత్త నిర్వహణలో గందరగోళం నెలకొన్నా, పాలనలో ప్రతీ చర్య ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నా.. గాంధీల వైపు నుంచి గాని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి గాని సరిదిద్దే ప్రయత్నాలు జరగడమే లేదు.
వాస్తవానికి 1938లో హైదరాబాద్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్గాలు, కుమ్ములాటలు సహజాతి సహజం. ఆనాడే రామానంద తీర్థ, జనార్దన్ దేశాయ్ మధ్య గోసాయి కాంగ్రెస్, దేశాయి కాంగ్రెస్‌గా విడిపోయి ఒక వర్గం తప్పులను మరో వర్గం బట్టబయలు చేసేవారు. అదే సంస్కృతి ఇప్పటికీ ఉన్నా, శిశుపాలుడి పాపాల మాదిరి రేవంత్ సర్కార్ పాపాలు పెరిగిన తర్వాత కుర్చీ లాగేద్దామని కాంగ్రెస్‌లోని మరో గుంపు రేవంత్‌రెడ్డి దారుణ తప్పిదాలకు తాళమేస్తున్నది. ఇలా పాలనలో, పార్టీలో కుతంత్రాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలే కనిపించడం లేదు. పైగా పోలీసింగ్‌ను నమ్ముకొని అక్రమ కేసులు, దాడుల దారిలో నడక సాగిస్తున్నారు. కాంగ్రెస్ చట్టాలకు చరిత్రలో పెద్ద బాధిత సమాజం తెలుగు ప్రజలే. గతంలో రాజీవ్‌గాంధీ సర్కార్ తెచ్చిన టాడా చట్టం కింద కశ్మీర్, పంజాబ్ రాష్ర్టాల్లో కంటే అప్పటి ఉమ్మడి ఏపీలోని తెలంగాణలోనే అత్యధికంగా 15 వేల మందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. వేల మంది అమాయకులు అరెస్టు అయ్యారు. ప్రభుత్వాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడం, నిలదీసిన విపక్షాలు, జనాలపై నిర్బంధం విధించడం కూడా కాంగ్రెస్ పాలకుల సహజ లక్షణం.
అయితే చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఏనాడూ వదిలిపెట్టలేదు, క్షమించలేదు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో మళ్లీ మొలకెత్తలేని దుస్థితిని హస్తం పార్టీకి ప్రజలు కల్పించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ రేవంత్‌రెడ్డి సర్కార్ చర్యలు కాంగ్రెస్ పార్టీకి అదే గతి పట్టించడం ఖాయం. వర్తమానంలో నుంచి భవిష్యత్ అందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది.