భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీల జనగణన చేసి, వారికి వారి జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. కాబట్టే 1947 నుంచి ఎస్సీలు, 1950 నుంచి ఎస్టీలు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. 1953-1955 మధ్య కాకా కాలేల్కర్ నివేదిక ప్రకారం.. దేశంలో 2,399 ఓబీసీ కులాలున్నాయి. అందులో 837 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. కాలేల్కర్ కమిషన్ స్త్రీలను కూడా ఓబీసీలుగా పరిగణించాలని చెప్పింది.
1979, జనవరి 1న ప్రధాని మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన తరగతుల కోసం (2వ కమిషన్) బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ఎంపీ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ నేతృత్వంలో కమిషన్ వేసింది. దీన్నే మండల్ కమిషన్ అంటారు. 1980 డిసెంబర్ 31న ఈ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో ఓబీసీలు 52 శాతంపై మాటే. వీరికి విద్య, ఉద్యోగరంగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. కానీ కమిషన్ వేసిన జనతా పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. మండల్ కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా ఉన్నతవర్గాల వారు దేశవ్యాప్త ఉద్యమాలు చేశారు. దీన్ని మండల్ వర్సెస్ కమండల్ ఉద్యమం అంటారు. తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ ప్రభుత్వం, రాజీవ్‌గాంధీ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను పక్కనపెట్టారు. 1990 ఆగస్టులో వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఎట్టకేలకు 1992 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలుపరచడం మొదలైంది. కొన్ని జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలు నేటికీ ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుచేయడం లేదు. 2011-12లో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక, రాజకీయ, ఆర్థిక, కులగణన చేసింది, కానీ వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. 2018లో బీజేపీ ప్రభుత్వ హోం మినిష్టర్ రాజ్‌నాథ్‌సింగ్ కులగణన చేపడతామన్నారు. కానీ, నేటికీ అది కలగానే మిగిలిపోయింది. విశేషమేమంటే ఇదే బీజేపీ ప్రభుత్వం కులగణన చేయడం కుదరదని 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2022లో ఉదయపూర్‌లో జరిగిన సమావేశంలో కులగణనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, డీఎంకే, వైసీపీ, టీడీపీ, బీఎస్పీ, బీఆర్ఎస్ మొదలగు పార్టీలు కులగణనను సమర్థిస్తున్నాయి. బీజేపీ, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. కులగణన చేయకుండా ప్రభుత్వ పథకాలు కావచ్చు, చట్టసభల సభ్యత్వం కావచ్చు, ఉన్నత ఉద్యోగాలు కావచ్చు అందరికీ చేరుతాయని అనడం నమ్మశక్యం కాదు.
నేడు దేశంలో ఆర్థిక, సామాజిక రాజకీయాలు మొత్తం కులం చుట్టే తిరుగుతున్నాయి. కులంలో నిగూఢంగా దాగి ఉండే సామాజిక హోదా, గౌరవ మర్యాదలు, అధిపత్యం, ఆధిక్యత, అణచివేత, పేదరికం మొదలైనవన్నీ ప్రభావం చూపుతున్నాయి. కులాన్ని రోజురోజుకు బలపరుస్తూ ప్రతి రంగాన్ని శాసిస్తున్నాయి. 1990 నుంచి మండల్ కమిషన్ నివేదిక అమలు పరుస్తామని ప్రకటించడం, ఆ తర్వాత వచ్చిన లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ లాంటి ఆర్థిక సరళీకరణలు మనిషి అస్తిత్వాన్ని చాలా మార్పులకు గురిచేశాయి. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో 3,743కు పైగా కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓబీసీ రిజర్వేషన్ల ప్రకారం 2,479 కులాలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. అంటే ఇంకా వివిధ రాష్ర్టాల్లో ఓబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల పట్టికలోని కులాలు 3,150. కేంద్రం 3,743 ఓబీసీ కులాలకు, వివిధ రాష్ర్టాలు 3,150 బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి.
ఇంకా 1,260 బీసీ కులాలకు రాష్ర్టాలు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సి ఉన్నది. కులగణన చేయడం వల్ల ఏ కులంలో ఎందరు ఉన్నారు కచ్చితమైన లెక్క తెలుసుకొని వారివారి జనాభాకనుగుణంగా రిజర్వేషన్ ఫలాలు, ప్రభుత్వ పథకాలు దక్కేటట్టు చూడవచ్చు. సామాజిక అసమానతలను దూరం చేయడానికి, అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి, వనరుల పంపిణీ సక్రమంగా జరగడానికి, కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను తెలుసుకొని వారిపై దృష్టి కేంద్రీకరించి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లవచ్చు. స్థిరనివాసం లేకుండా సంచార జీవితం గడిపే కులాల లెక్కలు సేకరించి జనజీవన స్రవంతిలో కలిసేటట్లు చేయవచ్చు.
కులాలను లెక్కించడం వల్ల ప్రతి కులం జనాభా ఎంతనేది తెలుస్తుంది. అప్పుడు తక్కువ జనాభా ఉన్న ఉన్నతవర్గాలు ఎక్కువ జనాభా కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను పాలిస్తున్నట్టు యావత్తు ప్రపంచానికి తెలిసిపోతుంది. ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, చలనచిత్ర, సేవల, విద్య, ఉపాధిరంగాలపై ఉన్న ఉన్నతవర్గాల ఆధిపత్యం బట్టబయలైపోతుంది.
ఈ మధ్యనే బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వం రాష్ట్రమంతా సమగ్ర కులగణన చేసి ఎస్సీ ఎస్టీ, బీసీలకు ఇస్తున్న 50 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర చట్టసభలో బిల్ పాస్ చేసి 65 శాతానికి పెంచింది. కానీ పాట్నా హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని పెంచిన రిజర్వేషన్లు కొట్టి వేసింది. కేంద్రం 2019లో తాను అనుకున్న వెంటనే అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. వీరికి రిజర్వేషన్ కల్పించడానికి శాస్త్రీయంగా జనాభా లెక్కలు చేయలేదు మరి ఏ ప్రాతిపదికను 10 శాతం రిజర్వేషన్ కల్పించినట్టు? వీరికి కల్పించిన రిజర్వేషన్లో 50 శాతం పరిమితి దాటట్లేదా? దీన్ని గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఏ ప్రాతిపదికన సమర్థించిందో తెలిస్తే బాగుండేది.
మన దేశంలో సకల సంపదల ఉత్పత్తికి చెమటోడ్చే సృష్టికర్తలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసైనా ఓబీసీలకు రిజర్వేషన్ పెంచాలి. చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు సైతం కల్పించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం కాబట్టి మెజారిటీ ప్రజలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ చేయడం ఎంతైనా అవసరం.
-డాక్టర్ కావలి చెన్నయ్య ముదిరాజ్
90004 81768