కొన్ని నెలలుగా కాలయాపన చేసి బీసీ సమాజాన్ని నమ్మిస్తూ, బురిడీ కొట్టిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు మరో అధికారిక మోసానికి తెగబడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామన్న ఆ పార్టీ ఇప్పుడు ప్రత్యేక జీవో ద్వారా కోటా పరిమితి ఎత్తివేసి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఊదరగొడుతున్నది. అసెంబ్లీ సాక్షిగా బిల్లులు మార్చి రాష్ట్ర ప్రజలను మరోసారి ఏమార్చింది.
మూడు దశాబ్దాల కిందట సుప్రీంకోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ సీలింగ్‌ను సడలించే రాజ్యాంగ హక్కు రాష్ర్టానికి ఉంటుందా? న్యాయ సమీక్ష ముందు ప్రభుత్వ జీవో నిలబడుతుందా? దేశంలో ఏ రాష్ట్రమైనా సొంత జీవోలతో కోటా పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నదా? రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని, తీసుకున్నా అవి రాజ్యాంగపరంగా, న్యాయపరంగా చెల్లుబాటు కావని న్యాయనిపుణులు చెప్తున్నా, బీహార్ ఎన్నికల కోసం తెలంగాణలోని బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు అయినా, నేటికీ బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకా పోరాటాలు చేయాల్సి వస్తుందంటే దానికి కారణం తొలి ప్రధాని నెహ్రూనే. 1951లో జరిగిన జనగణనలో కులగణనను విస్మరించడమే కాకుండా, 1953లో నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను కూడా తిరస్కరించారు. 1980 మండల్ కమిషన్ సిఫారసు చేసిన విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రధానులు ఇందిర, రాజీవ్‌గాంధీ దశాబ్దం పాటు అమలు చేయలేదు. 1990లో వీపీ సింగ్ సర్కార్ మండల్ కమిషన్ సిఫారసుల ను అమలు చేయాలనుకున్నప్పుడు నాటి ప్రతిపక్ష నేత రాజీవ్‌గాంధీ వ్యతిరేకించారు. మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తే జాతి విచ్ఛిన్నమవుతుందని లోక్‌సభ సాక్షిగా చెప్తూ, బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయ త్నం చేశారు. యూపీఏ-2 ప్రభుత్వంలో 2011లో చేసిన సామాజిక, ఆర్థిక కులగణన సర్వే డేటాను 2014 వరకు బహిర్గతం చేయలేదు. అంతేకాదు, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉండగా, 19 సీట్లు మాత్రమే ఇచ్చారు. రూ.150 కోట్లు ఖర్చు చేసి చేయించిన కులగణన సర్వే తప్పులతడకగా మారింది. 2014లో కేసీఆర్ సర్కారు అద్భుతంగా నిర్వహించిన సమగ్ర కులగణనలో తెలంగాణలో 3.68 కోట్ల మంది ఉన్నట్టు తేలగా, తాజా సర్వేలో 3.54 కోట్ల మంది ఉన్నట్టు తేలడం విడ్డూరం. 2014లో 51 శాతం బీసీలుంటే, రేవంత్ ప్రభుత్వం మాత్రం 46 శాతమే ఉన్నట్టు చెప్తున్నది. పదేండ్లలో జనాభా తగ్గుతుందా? పెరుగుతుందా?
స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే రాజ్యాంగంలోని 243 డీ (6), 243 టీ (6)లను సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయాన్ని కాంగ్రెస్ సర్కారు విస్మ రిస్తున్నది. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం లేదన్న విషయం దేశాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌కు తెలియ దా? బీహార్ ప్రభుత్వం పెంచిన 65% రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు కొట్టేసిన విషయం ఆ పార్టీకి తెలియదా? రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్ ఆమోదం పొందుతుందా? లోక్‌సభలో 234 ఎంపీలున్న కాంగ్రెస్ కూటమి 42% బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ఎందుకు పోరాటం చేయట్లేదు? 52 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ ప్రధాని మోదీని కలిసి రిజర్వేషన్ల గురించి ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదు? కోటా పరిమితి ఎత్తివేతపై ఎవరైనా కోర్టులో పిటిషన్ వేస్తే, ఈ ప్రక్రియ నిలిచిపోతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కోర్టుకు ఎవరెళ్లినా, కేసీఆరే ఎన్నికలను అడ్డుకున్నారని ప్రచారం చేసి, పార్టీపరంగా రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ చూస్తున్నది. కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి కుట్రలను బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు.
(వ్యాసకర్త: న్యాయవాది, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
శుభప్రద్ పటేల్