ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకుల్లో మార్పు రావడం లేదు. ఉద్యోగులే కాదు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోలేక, చాలీచాలని జీతాలతో బతుకలేక ఎంతోమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరణించారు. ఇప్పటికీ ఆ కుటుంబాలకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఒక్కసారి జీతం అరకొర పెంచినా, అదే జీతంతో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఎప్పటికైనా ఈ తెలంగాణలో మా జీవితాలు బాగుపడుతాయని ఆశ పడ్డం. అయినా కూడా ఇప్పటికీ మా బతుకుల్లో ఎటువంటి మార్పు రాలేదు.
ఎప్పటికైనా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు మారుతాయని ఉద్యోగుల ఆశతో బతుకుతున్నారు. అంతెందుకు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటి తేదిన జీతాలు ఇస్తున్నారు. అందరికీ ఉద్యోగ భద్రత ఇచ్చారు. కానీ మార్పు పేరిట ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మాత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. దీంతో వారి పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలి.
గవర్నమెంట్ ఏజెన్సీలు మాత్రం ఉద్యోగులకు నెలలు తరబడి వేతనాలు చెల్లించకుండా, పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ వంటివి కూడా ఉద్యోగి ఖాతాలో జమచేయకుండా ఉద్యోగులని వేధిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల ఏజెన్సీ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాం కాబట్టి మా శ్రమని గుర్తించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి మా అందరి శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి. మరీముఖ్యంగా ఉద్యోగ భద్రత లేక ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు ఊడుతదో అనే భయంతో బతుకలేక బతుకుతూ జీవనం సాగిస్తున్నాము. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం కూడా అవసరం ఉన్నన్ని రోజులు పని చేయించుకొని ఇప్పడు వద్దు అని వారిని రోడ్డు మీదకు నెట్టి వేస్తున్నది.
ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఆయా శాఖల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10 వేల నుంచి రూ.22,500 వరకు నెల వేతనంగా అందుతుంది. దానితో కడుపునింపుకొనే వారికి ఏడెనిమిది నెలలుగా ఏజెన్సీలు వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నది. నెల తిరిగే సరికే పిల్లల ఫీజులు, ఇతర ఇంటిఖర్చుల నేపథ్యంలో జీవితం భారంగా మారి ఇబ్బంది పడుతున్నారు. చేసిన అప్పులు సకాలంలో చెల్లించకపోవడంతో మరోసారి అప్పు పుట్టని పరిస్థితి. కొంతమంది కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఒకే విధమైన బాధ్యతలు నిర్వహిస్తూ, ఒకే రకమైన పనిచేస్తున్న వ్యక్తికి (ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్టు పేరిట)మరొకరి (పర్మినెంట్ ఉద్యోగి) కంటే తక్కువ జీతం ఇవ్వడం కుదరదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వరంగ/శాఖలలో/సంస్థలలో పనిచేస్తున్న సుమారుగా రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ (గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు) ప్రభుత్య ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నాం.