పాఠకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక గంభీరత ఉంటుంది. మనం అనుభవిస్తున్న స్వతంత్రం లక్షల మంది సమరయోధుల త్యాగాల ఫలితం. అందువల్ల ఆ రోజు వారి త్యాగాలను స్మరించుకోవడం సమంజసం గనుక పంద్రాగస్టు నాడు అట్టహాసం అనేది కనిపించదు. రిపబ్లిక్ డే వేరు. ఇది మనం ఒక స్వతంత్ర జాతిగా సాధించిన ప్రగతిని ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పే సందర్భం.
అందుకే గణతంత్ర దినోత్సవాన్ని మనం అట్టహాసంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. ఇది అందరికీ తెలిసిందే. నేటికి మనం రిపబ్లిక్గా అవతరించి 75 వసంతాలు గడుస్తున్న వేళ సంబురాలు జరుపుకోవటంతో పాటుగా సమాలోచన చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలి. పండుగ అంటే కొత్త బట్టలు ధరించటం, మంచి భోజనం చేయటమే మనకు తెలిసిన ఆచారం. రిపబ్లిక్ డేను అలా చూడం. అంతవరకు బాగానే ఉన్నది. కానీ, ఎలా చూడాలి అనేదే ప్రతి పౌరుడు తనని తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం, సందర్భం.
వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మన దేశం రాజులు, రాణుల పాలనకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగ పాలన ఏర్పాటు చేసుకున్న రోజు రిపబ్లిక్ డే. అంటే మనం సుదీర్ఘ సమాలోచన చేసి రాసుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆరోజును ఏటా రిపబ్లిక్ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. కానీ, రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నాం. రిపబ్లిక్ డే నాడు జరిగే వేడుకల్లో రాజ్యాంగం ప్రస్తావన మనకు కనిపించదు. మన దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటం, అక్షర జ్ఞానం లేనివారికి రాజ్యాంగంపై అవగాహన లేకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, విద్యావంతులు, మేధావులు కూడా రిపబ్లిక్ డే నాడు రాజ్యాంగం గురించి ఆలోచించరు. ఇది శోచనీయ పరిణామం. పైగా ఒక సెలవు దినంగా చూస్తారు. ఈ ఏడాది వరసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇంకేం! జాలీ టైం అనుకుంటారు. కానీ, రిపబ్లిక్ డే నాడు మన తలపులు ఏవిధంగా ఉండాలి? అదొక బాధ్యతాయుతమైన రోజు.
వేల సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర గల ఈ భారత భూమిని విదేశీ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించటం కోసం అష్టకష్టాలు పడ్డారు మన స్వాతంత్య్ర సమరయోధులు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా ఉండాలి అన్న విషయంలో వారికి కొన్ని ఆశలు, ఆశయాలు ఉండేవి. ఆ ఆశలు, ఆశయాలు అమలు చేసి ఒక నవ సమాజాన్ని, సమ సమాజాన్ని స్థాపించే ఆలోచనలను విస్తృతంగా చర్చించిన తర్వాత క్రోడీకరించి స్వతంత్ర జాతిగా మనం ఎటు పయనించాలో దశ, దిశా నిర్దేశం చేయటం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక పవిత్ర ఒప్పందం మన రాజ్యాంగం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు. కోట్లాది మంది భారతీయుల కలల సౌధం.
వందల ఏండ్లు పరాయి పాలనలో మగ్గిన ప్రజల ఆశలను, ఆశయాలను ఏ విధంగా ఆచరణలోకి తీసుకురావాలి, ఏ విధమైన సమాజాన్ని పునర్నిర్మించుకోవాలి అనే దానికోసం విపులమైన సూత్రాలు, సిద్ధాంతాలు ప్రతిబింబించే పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం. ఆ పవిత్ర గ్రంథంలో అధికరణాల రూపంలో పొందుపరుచుకున్న ఆశయాలు, ఆదర్శాలు ఏ మేరకు అమల్లోకి వచ్చాయి? ఆ ఆశయాల సాధన కోసం మనం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి? తదితర విషయాలను సమీక్షించుకోవాల్సిన సందర్భమే రిపబ్లిక్ డే.
కానీ, ఈ ప్రశ్నలు ఎంతమంది పౌరుల మదిలో మెదులుతున్నాయి? ఆశించిన విధంగా మనం ప్రగతిని సాధించలేకపోయామన్న చేదు వాస్తవం ఆవేదన ఎంతమంది పౌరులను వేధిస్తున్నది? ఈ ఆలోచనలు ఎంతమంది పౌరుల మదిలో మెదులుతున్నాయని ప్రశ్నించుకుంటే మనకు దొరికే సమాధానం నిరాశాజనకమే! ఒక జాతిగా ఎందుకు మనం ఇంత నిర్లిప్త ధోరణికి అలవాటు పడ్డాం? మనకి ఆత్మైస్థెర్యం నశించిందా? ఇంతకు మించి మనం ఏమీ చేయలేమన్న రాజీ ధోరణికి వచ్చామా? ప్రపంచంలో అనేక రంగాల్లో మన స్థానం ఏంటి? ఎంతమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు? ఎంతమంది నెత్తిన నీడ లేకుండా బతుకుతున్నారు? ఎంత మంది కనీస ఆరోగ్య సౌకర్యానికి దూరంగా ఉన్నారు? నేడు కోట్ల మంది భారతీయులు కనీస అవసరాలు తీర్చుకునే స్థితిలో లేరు.
ఈ విషయం ముఖ్యంగా విద్యావంతులను ఆందోళనకు గురిచేసి నిద్రలేకుండా చేయాలి. కానీ, ఎందుకని విద్యావంతులు, సంపన్నులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు కనీసం చీమ కుట్టినట్టు కూడా భావించటం లేదు? తీవ్ర ఆందోళన కలిగించే ఈ విషయాల నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చటానికేనా ఎక్కువగా సింబాలిజం గురించి మాట్లాడుతున్నారు? మొన్న చంద్రయాన్-3 ఉపగ్రహం జాబిల్లిపై విజయవంతంగా దిగటాన్ని వేడుక చేసుకున్నాం. నేడు అయోధ్యలో రామమందిరం నిర్మించటం గొప్ప ఘనతగా చెప్పుకొన్నాం.
ఏ విధంగా ఇటువంటి సింబాలిజం కోట్లాదిమంది భారతీయులను పేదరికంలో నుంచి బయటకు తీసుకురాగలదు? ఆధ్యాత్మిక తృప్తితో ఆకలి తీరుతుందా? ఇస్రో శాస్త్రవేత్తలు ఖగోళంలో సాధించిన అద్భుత విజయాలు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఏ విధంగా ఉపయోగపడగలవు? ఈవిజయాలు వ్యవసాయ రంగానికి సాయపడగలవా? ఏటా ఢిల్లీలో అట్టహాసంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేక రంగాల్లో మనం సాధించిన ప్రగతిని కనుల పండుగగా చాటి చెప్తుంటాయి. రెపరెపలాడే మువ్వన్నెల జెండా నీడలో జరిగే ఆ సంబురాలను టీవీలో చూసి మురిసిపోతుంటాం.
ఆ తర్వాత మనం ఒకసారి చుట్టూ చూసుకుంటే మనకి కనిపించే వాస్తవమేంటి? మనం సాధించాం అని చెప్పుకొనే ప్రగతి ఫలాలు సామాన్య మనిషికి అందుతున్నాయా? సామాన్య మనిషి అంటే ఎవరు? మీరు, నేను, అందరం సామాన్యులమే కదా! వార్తా పత్రికలు చదువుకునేవారు, ముఖ్యంగా ‘వేదిక’ లాంటి పేజీ చదివేవారు, విద్యావంతులు, విజ్ఞులు, మేధావి వర్గాలకు చెందిన వాళ్లే కదా.
మనలో ఎంతమంది ఫలానా రంగంలో నిర్దిష్టమైన హర్షించదగ్గ మార్పును గమనించామని చెప్పగలరు? విద్య, ఉద్యోగం, వైద్యం, సేద్యం, ఆహార భద్రత, రవాణా, పర్యావరణం లాంటి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల్లో మనకి స్పష్టంగా కనిపించే ప్రగతి ఏమైనా ఉందా? మన అవసరాలు గడియారంలో సెకండ్లు చూపే ముల్లు అయితే, మన ప్రగతి గంటలు చూపే ముల్లులా ఉంది పరిస్థితి. ఈ స్థితి నుంచి బయటపడాలంటే ముందుగా సమస్య ఉందన్న విషయాన్ని గుర్తించాలి.
ఇది ఒకరిద్దరి సమస్య కాదు. యావత్ భారతావని సమస్య. దాని గురించి అందరం దీర్ఘంగా ఆలోచించాలి. పేదరికం, వెనుకబాటుతనం అనేవి కులం, మతం, ప్రాంతం అనే భావాలకు అతీతమైనవి. పేదరికాన్ని జయించాలంటే, వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. కులం, మతం, ప్రాంతం అనేవి ఆధారాలా లేక అవరోధాలా అనేది కూడా ప్రతి పౌరుడూ ఆలోచించాలి.
‘హమ్ సబ్ ఏక్ హై’ అంటే మనమంతా ఒక్కటే, అందరం భారతీయులమే అనే నినాదం గణతంత్ర వేడుకలు జరుగుతున్న కాసేపు మైకులో మోగే శబ్దమేనా? ఆ తర్వాత ఏమవుతుంది ఆ ఐక్యతా స్ఫూర్తి? ఎందుకని మనం ఒక జాతిగా ఐకమత్యంగా ఉండలేకపోతున్నాం? సుసంపన్నమైన బహు భాషలు, మహోన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలు విలసిల్లుతున్న ఈ భారత భూమి మీద భారతీయత అనే భావం ఎందుకు బలం పుంజుకోలేకపోతున్నది? దీనికి కారణం మనకి మన రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేకపోవటమేనని అనిపిస్తున్నది.
మనం రాజ్యాంగాన్ని కేవలం హక్కుల పట్టికగానే చూస్తున్నాం గానీ, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్న సత్యాన్ని మనం పూర్తిగా విస్మరించాం. మన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మాత్రమే మనం రాజ్యాంగం వైపు చూస్తాం. రాజ్యాంగం ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలను కూడా విశదీకరించింది. కానీ, రాజ్యాంగంలో పేర్కొన్న బాధ్యతల గురించి మనం ఏనాడైనా ఆలోచించామా? ప్రాథమిక హక్కులను కూడా ఒక సంకుచిత కోణం నుంచే చూస్తున్నాం కానీ, విశాల దృక్పథంతో కాదు. ఇది శోచనీయమైన పరిణామం. సంకుచిత కోణం అని ఎందుకు అంటున్నానో చెప్తాను. మనకి స్వేచ్ఛ అంటే.. ఒక వ్యక్తికో, ఒక వర్గానికో అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు నిరసన తెలియజేసే నెపంతో రోడ్డుమీద నానా రభస చేయటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటమే తెలుసు.
ఇదేనా స్వేచ్ఛ అంటే? వ్యక్తి హక్కులు, కమ్యూనిటీ హక్కులు రెండూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి రెండు కండ్లు. బస్సులు, రైళ్లు కమ్యూనిటీ కోసం, అంటే అందరి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రయాణ సాధనాలు. మరి ఆ ప్రయాణ సాధనాలను ధ్వంసం చేయటమంటే కమ్యూనిటీకి సంబంధించిన తిరిగే హక్కును హరించినట్టే కదా? కానీ, ఆ కోణంలో ఆలోచించటం లేదు. అందుకే సంకుచిత కోణం అంటున్నాను. ఈ సంకుచిత ధోరణికి మరో నిదర్శనం ఏమంటే.. ప్రతిదానికి రాజకీయ నాయకులను నిందించటం. నాయకులు సమాజంలో నుంచి వచ్చినవారే కదా. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అదే నాయకుల దగ్గరకుపోయి సహాయం ఆశించటానికి వెనుకాడం. నాయకులు ఒకప్పుడు పదిమందికి మార్గం చూపించేవాళ్లు. ఈ రోజు పది మంది నడిచే మార్గంలో నడవాలి అనుకుంటున్నారు. ‘యథా ప్రజా తథా రాజా’ అనే రోజులు ఇవి.
రాజ్యాంగాన్ని ఆమోదించటానికి ఒక రోజు ముందు అంబేద్కర్ మహాశయులు అన్న మాటల్లో కొన్నింటిని మనం ఇక్కడ మననం చేసుకోవటం సముచితం. ‘1950 జనవరి 26న మనం ఒక వైరుధ్యమైన పరిస్థితిలోకి వెళ్లబోతున్నాం. రాజకీయ సమానత్వం, సామాజిక, ఆర్థిక అసమానత్వం అనే విరుద్ధమైన జీవితం మనకి ఎదురవుతుంది.
రాజకీయంగా ‘ఒక మనిషి ఒక ఓటు’అనే విధానం ఉంటుంది. కానీ, సామాజిక,ఆర్థిక కోణంలో ఒక మనిషి ఒక విలువ అనేది ఉండదు. కానీ, ఎంత కాలం ఈ వైరుధ్యమైనపరిస్థితిలో ఉండగలం. అసమానతలను తొలగించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదం పొంచి ఉంది’ అని అంబేద్కర్ ఆనాడు చెప్పారు. ఒక దార్శనికుడి మస్తిష్కంలో నుంచి వచ్చిన వేద ప్రవచనం కన్నా విలువైన గొప్ప ఆలోచన ఇది.
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఈ అమూల్యమైన మాటల్లో ఆనాడు, ఎంత సత్యం దాగిఉందో అంతకుమించిన సత్యం నేడు 75 సంవత్సరాల తర్వాత కూడా ఉన్నది. ఈ 75 ఏండ్లలో మనం సాధించిన ప్రగతి కన్నా అసమానతలు అనేక రెట్లు పెరిగాయి. కులం, మతం, వర్గం పేరుతో వైషమ్యాలు తీవ్రం అవుతున్నాయి. అన్నిటికన్నా మించి ఈ రోజు మానవతా విలువల కన్నా మతతత్వాన్ని పెంచి పోషించే ధోరణినే మనం ఎక్కువగా చూస్తున్నాం.
ఇది మన వ్యవస్థకు చాలా ప్రమాదకరం. లౌకికవాదం అనే ప్రాణవాయువుతో మన వ్యవస్థ నడుస్తున్నది. అన్ని మతాలకు రాజ్యం సమాన దూరం పాటించటమే మనకు శ్రీరామరక్ష! ఈ వైషమ్యాలను పరిష్కరించే దిశగా బాధ్యత గల పౌరులందరూ ఆలోచించాలి. ఈ ఆలోచన గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి నుంచే అందరి మదిలో మెదలాలి. అప్పుడు ఇది ఒక సెలవు దినంగా కనిపించదు. ఇంకా కష్టపడి పని చేయాలనిపిస్తుంది. ఆ రోజు కోసం ఈ రోజు నుంచే అందరం ఎదురుచూద్దాం.
గుమ్మడిదల రంగారావు