ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పతనమవుతుందని నాడు కొందరు ప్రచారం చేశారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకున్నది. హైదరాబాద్ అయితే ఏకంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. హైదరాబాద్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా నాటి బీఆర్ఎస్ సర్కార్ తీసుకొన్న చర్యలే అందుకు ప్రధాన కారణం. అలాంటి హైదరాబాద్‌లో హైడ్రా పుణ్యమాని నేడు రియల్ ఎస్టేట్ ఢమాలైంది. ఇందుకు తాజా నివేదికలే తార్కాణం.
హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొన్నందునే బీఆర్ఎస్కు మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం గ్రేటర్ పరిధిలోనుంచే గెలిచారు. కానీ, కాంగ్రెస్ పాలన రావడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌రంగం తిరోగమనంలోకి వెళ్లింది. దీనికి కారణం రేవంత్ సర్కార్ చర్యలేనని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హైడ్రా కాన్సెప్ట్‌ను సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి ఐపీఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించి, హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారు. ప్రత్యేకంగా సిబ్బందిని సైతం కేటాయించారు. ఈ క్రమంలోనే చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. వీకెండ్ వస్తున్నదంటే చాలు నగర వాసులు భయపడిపోతున్నారు.
ముఖ్యంగా బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధి పేరుతో తమ నివాసాలపై హైడ్రా వచ్చిపడుతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొన్నది. ఇప్పటికే 160కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చేసినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసిన తర్వాత హైడ్రా పేరు ఒక్కసారిగా ప్రాచుర్యం పొందింది. ఈ నేథ్యంలో ప్రస్తుతం హైడ్రా చర్యల వల్ల ప్రభుత్వానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయాన్ని పక్కనపెడితే, రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలైందన్న విషయం నూటికి నూరుపాళ్లు నిజం. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జరిగిన ఇండ్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ ఓ రిపోర్టు విడుదల చేసింది.
ఈ సర్వే ప్రకారం 42 శాతం క్షీణతతో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉన్నది. ఆ తర్వాత బెంగళూరు (26 శాతం), కోల్‌కతా (23 శాతం), పుణె (19 శాతం), చెన్నై (18 శాతం), ముంబై (17 శాతం), థానె (10 శాతం) తర్వాతి వరుసలో ఉన్నాయి. మొత్తం ఈ 9 నగరాల్లో ఈ జూలై-సెప్టెంబర్‌లో ఇండ్ల విక్రయాలు 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చని సంస్థ తెలిపింది. నిరుడు ఇదే వ్యవధిలో 1,26,848 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు తెలుస్తున్నది. దీంతో 18 శాతం పతనమైనట్టు ప్రాప్ ఈక్విటీ పేర్కొంది. హైదరాబాద్‌లో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని కూడా ఈ సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయని వెల్లడించింది. తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లోనే అత్యంత క్షీణత కనిపిస్తున్నది. కానీ, తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు దాదాపు పదేండ్ల కాలంలో ముంబై, బెంగళూరు వంటి నగరాలనూ దాటుకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. నేడు హైదరా బాద్‌లో ఇండ్లు, స్థలాలు కొనేందుకు ప్రజలు జంకుతు న్నట్టు తేలింది. మరోవైపు హైడ్రా ఇలానే కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగంలో కరోనా లాంటి సంక్షోభం రావొచ్చని నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్‌లో 2023-24లో రియల్ ఎస్టేట్ డిమాండ్ బాగానే ఉన్నా హైడ్రా రాకతో పరిస్థితి తారుమారైంది. గత పదేండ్లలో సాగిన రియల్ ఎస్టేట్ పురోగతి కారణంగా తాజాగా హౌసింగ్ సేల్స్ పెరుగుతాయని ఇటీవల ప్రాప్ ఈక్విటీ అంచనా వేయగా, కొల్లియర్స్ రిపోర్ట్ మాత్రం షాకింగ్ నిజాలు వెల్లడించింది. హైదరాబాద్‌లో ఆఫీసులకు భారీగా డిమాండ్ తగ్గిందని, ఏకంగా 48 శాతం పతనమైనట్టు అంచనా వేసింది.
వాస్తవానికి తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నదన్న టాక్ నడిచింది. ఇక్కడికి దేశంలోని దిగ్గజ కంపెనీలు సహా.. విదేశాల నుంచి మల్టీ నేషనల్ కంపెనీలు (ఎంఎన్సీ), జీసీసీలు క్యూ కట్టాయి. దిగ్గజ విదేశీ బ్యాంకులు, ఇ- కామర్స్, టెక్ సంస్థలు ఇంకా ఇతర ఆర్థిక సంస్థలు కూడా హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపాయి. దీంతో గత కొన్నేండ్లుగా హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ మార్కెట్లో జోరు పెరిగింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. జూలై- సెప్టెంబర్ సమయంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ హైదరాబాద్‌లో భారీగా తగ్గినట్లు అంచనా వేసింది ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా. ఈ మేరకు ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ కాలంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కాస్త తగ్గి 172 లక్షల చదరపు అడుగులకు పరిమితమైందని పేర్కొన్నది. ముఖ్యంగా హైదరాబాద్ సహా బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్లో డిమాండ్ భారీగా తగ్గిందని అంచనా వేసింది. అయితే, హైదరాబాద్‌లో క్షీణతకు మాత్రం హైడ్రా దూకుడే కారణమని చెప్పక తప్పదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-సయ్యద్ నిసార్ అహ్మద్
78010 19343