మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఒక తినుబండారాల దుకాణానికి వెళ్లాను. అది గోదావరి జిల్లాల వాళ్లది. దాని యజమానికి నేను జర్నలిస్టునని తెలుసు. నన్ను చూడగానే ‘ఏం సార్ ఎట్లా ఉంది పరిస్థితి’ అన్నాడు. ఆ వెంటనే, ‘ఎట్లా ఉంది పరిపాలన’ అని అడిగాడు. ఆ రోజుల్లోనే ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ,పాడి కౌశిక్‌రెడ్డిల ఉదంతం నడుస్తున్నది. పరిస్థితి ఎట్లా ఉందని ఆయన అడిగింది ఈ ఉదంతం గురించి. పరిపాలన అన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి. జర్నలిస్టులు మాట్లాడించాలి తప్ప తాము మాట్లాడగూడదు గనుక, ‘మీరే చెప్పాల’న్నాను. ‘గొడవలేవో ఉంటూనే ఉంటాయి. కానీ, ఒక ఎమ్మెల్యే తన మనుషులతో పోయి ఇంకో ఎమ్మెల్యేపైన దాడి చేయటమేంటి సార్. ఇటువంటిది ఎప్పుడూ చూడలేద’న్నాడు. ‘కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ భేదాలు తెస్తున్నట్టు గాంధీ అంటున్నారు గదా’ అని అడిగాను. ‘ఏంటి సార్, మేమంతా కేసీఆర్‌ను ఎప్పటినుంచి చూస్తున్నాం. అటువంటిది ఎప్పుడైనా ఉందా’ అన్నాడు.
అంతలో మళ్లీ తానే, ‘ఈ రేవంత్‌రెడ్డి పరిపాలనేమిటో అర్థం కావడం లేదు. ఏం జరుగుతున్నదో, ఏం జరగటం లేదో తెలియటం లేదు. రియల్ ఎస్టేట్ అయితే అంతా కుప్పకూలింది. మా వాళ్లు చాలామంది మళ్లీ కేసీఆర్ వస్తాడనుకొని 50 కోట్లు, 100 కోట్లు తెచ్చి వ్యాపారాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ రావటంతో గందరగోళం మొదలైంది. ఇప్పుడు ఇదేదో హైడ్రా అని పెట్టారు. దానితో అంతా కుప్పకూలింది. వాళ్లకు ఏం చేయాలో తోచటం లేద’న్నాడు. ఈ మాటలు సాగుతుండగా, దుకాణం బయట కూర్చుని ఉన్న పెద్దాయన ఒకరు లోపలికి వచ్చి, ‘ఏంటీ రేవంత్‌రెడ్డి గురించేనా’ అని గోదావరి యాసలో అడిగాడు. జవాబు గురించి ఎదురుచూకుండానే ‘ఛీ ఛీ ఛీ’ అంటూ మళ్లీ బయటకు వెళ్లిపోయాడు. నేను కొనటం పూర్తిచేసి వెళ్తుండగా ‘రియల్ ఎస్టేటే కాదు, అన్నీ ఇలాగే ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే ఇలా ఉంటే, ఇంకా నాలుగేండ్లు ఎలా నడుస్తాయి సార్’ అన్నాడు.
ఇంటికి వెళ్తుండగా, వెళ్లిన తర్వాత కొంత సేపటి వరకూ ఆ మూడు విషయాల చుట్టూ ఆలోచనలు తిరుగుతూ పోయాయి. ఒకటి, గాంధీ, కౌశిక్‌రెడ్డిల ఉదంతం. రెండు, హైడ్రా. మూడు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన. వీటిలో మొదటిది ముందుగా చూస్తే, తినుబండారాల దుకాణం యజమాని అన్నట్టు, రాజకీయాలలో గాని, నాయకుల మధ్య గాని గొడవలు ఏవో ఉంటూనే ఉంటాయి. వాటిని వివరంగా తెలుసుకుంటూ, అందులోని తప్పొప్పులపై ఒక అభిప్రాయానికి వచ్చేంత సమయం సాధారణ ప్రజలలో ఎక్కువమందికి ఉండదు. వారికి తమ పనులు తమకుంటాయి. అయితే, కొన్ని కొండ గుర్తులు మిగిలిపోయాయి. తిరిగి ఆ యజమానే అన్నట్టు, మామూలుగా ఉండే గొడవలు వేరు, ఒక ఎమ్మెల్యే అంతటి మనిషి మరొక ఎమ్మెల్యే ఇంటికి మనుషులతో వెళ్లి దాడి చేయటం వేరు. ఇటువంటి ఘటన తానెన్నడూ చూడలేదన్నాడాయన. అవును, మనమెవరమూ చూడలేదు కూడా. అందునా అటువంటిది, ప్రశాంతతకు మొత్తం దేశంలోనే పేరుపడిన తెలంగాణలో జరగటం నమ్మశక్యం కానిది. అది అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది.
దీనంతటికీ మూలం ఎక్కడుంది, పార్టీ ఫిరాయింపులేమిటి, ఆ సంస్కృతికి 1967 నాటి హర్యానాలో ప్రారంభోత్సవం చేసిందెవరు, తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిందేమిటి, తర్వాత కేసీఆర్ ఏం చేశారు, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన ఏం జరుగుతున్నదనేదంతా ఒక సుదీర్ఘ చర్చ. ప్రజలకు, ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు ఇదంతా ఎప్పుడూ ఉన్నదే. అందుకు సంబంధించిన వాదోపవాదాలు, చట్టాలు, కేసులు, చట్టాలను వంకర టింకరగా తిప్పే చాతుర్యాలు, దీనంతటిలో స్పీకర్లు, గవర్నర్ల పాత్రలు ఒక అంతులేని నీతిరహితమైన కథ వలె నిరంతరం సాగుతున్నవే. ప్రస్తుత సందర్భంలోనూ బీఆర్ఎస్ నుంచి కొన్ని ఫిరాయింపులు, వాటిపై ఫిర్యాదులు, అవి స్పీకర్‌తో పాటు హైకోర్టు పరిధిలో ఉండటాన్ని ప్రజలు గమనిస్తూ వస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందన్నది వారి ఆసక్తి. కానీ, ఇటువంటి సాధారణ స్థాయి పరిణామాల క్రమం కాస్తా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీ భౌతికదాడితో అకస్మాత్తుగా మరొకస్థాయికి వెళ్లింది.
తెలంగాణలో రాజకీయ సంస్కృతి ఈ స్థాయికి పతనం కావటమన్నది మనకు ఆందోళన కలిగిస్తుండటం ఒక విషయం కాగా, ఇది ఈ ఒక్క ఘటనతో ఆగుతుందా, ఇంతకు మించి కూడా మరేమైనా జరగవచ్చునా అన్నవి ఇతర ప్రశ్నలు. కౌశిక్‌రెడ్డిని చంపివేయగలనని గాంధీ కుమారుడు ఇప్పటికే బహిరంగంగా హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. దాన్ని బట్టి, ప్రశాంతతకు పేరుబడ్డ తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఒక ప్రమాదకర దశ రాగలదేమోనని మనం భయపడాలేమో తెలియటం లేదు.
హైడ్రా విషయానికి వస్తే, దాని లక్ష్యం చాలా మంచిది. అదే సమయంలో రెండు మాటలు చెప్పాలి. పర్యావరణ పరిరక్షణ అనే కోణం నుంచి అది కీలకమైనది కాగా, దాని అమలుతో ముడిబడిన సామాజిక అంశాల కోణం నుంచి సున్నితమైనది. అటువంటప్పుడు ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకుంటూ ముందుగా చేయవలసిన ఆలోచనలు, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉంటాయి. అట్లా చేయనప్పుడు ఒకవైపు అమలులో హైడ్రా సంస్థకు, రెండవవైపు ప్రజలకు కలిగే అయోమయాలు, అనర్థాలు అనేకం ఉంటాయి. కానీ, ఇంత భారీ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు అవసరమైన ముందస్తు ఆలోచనలు, ఏర్పాట్లు జరగకపోవటమన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అందువల్లనే ప్రజల నుంచే గాక కోర్టుల నుంచి కూడా మళ్లీ మళ్లీ ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతున్నాయి. పర్యావరణ లక్ష్యం పట్ల మొదట కలిగిన సదభిప్రాయం నెమ్మదిగా మసకబారిపోతున్నది. అయినప్పటికీ ప్రభుత్వం గాని, హైడ్రా గాని తగు సవరణలు చేసుకోకపోవటం తీవ్రమైన అభ్యంతరకర విషయం.
విస్తృతంగా చర్చకు వచ్చినవే అయినా కొన్ని ప్రధాన అంశాలను మరొకమారు పేర్కొందాం. హైడ్రాను తెలంగాణ అంతటా గాక హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్కు పరిమితం చేయటం ఎందుకనే ప్రశ్నను పక్కన ఉంచుదాం. ప్రస్తుతానికి తీసుకున్న పరిధిలోనైనా ఏమి చేయవలసింది? అన్ని చెరువులు, కుంటలు, నాలాల జాబితా ఏమిటి? వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ల సరిహద్దులు ఎక్కడున్నాయి? అందుకు సంబంధించిన మ్యాప్‌లు, ఉపగ్రహ చిత్రాలు? ఆ ప్రకారం నేలపై గుర్తింపులు? మ్యాప్‌లు, ఉపగ్రహ చిత్రాలు వేర్వేరు ప్రభుత్వ శాఖల వద్ద, సంస్థల వద్ద వేర్వేరుగా పరస్పర విరుద్ధంగా గల సందర్భాలు కూడా కనిపిస్తున్నందున వాటిలో దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి? ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో గల తాత్కాలిక నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు ఏవి? శాశ్వత నిర్మాణాల స్థలాలకు రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతులు ఎంతకాలం క్రితం ఇచ్చారు, ఇచ్చిందెవరు? నిర్మాణాల తర్వాత ఇంటి నంబర్, వివిధ కనెక్షన్లు, ఇతర పౌర సదుపాయాలు కల్పించిందెవరు?
వీటన్నింటికి రుసుముల వసూలు ఏ విధంగా ఎవరు చేస్తున్నారు? ఇంకా నిర్మాణ దశలో ఉన్నవి ఏవి? నిర్మాణాలు చేసినవారు వ్యక్తులు, స్వయంగానా లేక బిల్డర్‌లా? సహకార గృహ నిర్మాణ సంస్థలా? నిర్మాణమైన తర్వాత ఎవరినుంచి ఎవరికైనా అమ్మకాల ద్వారానో లేక కుటుంబ పంపిణీల వల్లనో చేతులు మారాయా? స్థలాలను ప్రభుత్వాలే ఏవో పథకాల కింద పేదలకు పట్టాలిచ్చినవి ఉన్నాయా? పక్కాగా కబ్జాలు జరిగినవి ఏవి? దీనంతటిలో నాయకుల పాత్ర ఏమిటి? తరచూ ప్రకటిస్తూ వస్తున్న క్రమబద్ధీకరణ పథకాలు వర్తించినవి ఏవి? ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఉన్నప్పటికీ వాతావరణ మార్పులు, నీటి పరీవాహకతలో మార్పుల వల్ల దశాబ్దాల కాలంలో ప్రజలు, అధికారులు గాని గమనించక సహజమైనరీతిలో కుంచించుకుపోయినవి ఏవి? ఇప్పుడు ఉల్లంఘనలను వెనుకకు పోయి గుర్తించేందుకు కటాఫ్ సంవత్సరం ఏమిటి? వీటన్నింటిని తిరగదోడటం ఎట్లా? దేనిని ఆధారంగా తీసుకొని ఆ పనిచేయాలి? చివరకు ఇవన్నీ సమగ్రంగా తేలి ఒక చిత్రం స్పష్టమైన వెనుక చర్యలు తీసుకునేందుకు ఎట్లా ముందుకు కదలాలి? ఆ విషయంలో చట్టాలు, ఇతరత్రా ప్రభుత్వ నిబంధనలు, గతంలో కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి?
గమనించదగిన మౌలిక వైఫల్యం ఏమంటే, ఇటువంటి మేధోమథనం ఏమీ జరగలేదు. అంతేకాదు, కూల్చివేతల వల్ల శాశ్వత నివాసాలు కోల్పోయే అమాయక కొనుగోలుదారుల గురించి గాని, తాత్కాలిక నివాసాలు పోగొట్టుకునే పేదల విషయంలో గాని చేయవలసిందేమిటి? ఈ చర్యలన్నింటి ఫలితంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ప్రజలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలున్నాయా? ఉంటే ఏ విధంగా, ఏ మేరకు? ఆ నష్టాలను ఏ విధంగా వీలైనంత మేరకు పరిమితం చేయాలి? తర్వాత తిరిగి ఏ విధంగా కోలుకోవాలి? అందుకు ఇప్పటినుంచే ఏమి ఏర్పాట్లు చేసుకోవాలి? అనే ఆలోచనలు గాని, వాటినన్నింటిని ప్రజల ముందు పారదర్శకంగా, ప్రజాస్వామికంగా ఉంచటం గాని ఏమీ జరగలేదు.
హైడ్రా అధికారి రంగనాథ్ అరకొర మాటలేవో ఇప్పుడు చెప్తున్నారు. హైడ్రా కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని వారాల పాటు ఆయన నుంచి ఈ మాత్రపు సంయమనపూరితమైన మాటలు అయినా వినిపించలేదు. పైగా, కోర్టుకు ఎవరైనా వెళ్తే స్టే వచ్చేలోపల కూల్చేస్తాం తరహా విభ్రాంతికరమైన మాటలు మాట్లాడారు. చివరికి పేదల రేకుల ఇళ్లను సైతం రాత్రి వేళ కూల్చే అత్యుత్సాహానికి పాల్పడ్డారు. ఆ మాటలు చేతలు చూడగా, హాలీవుడ్ సినిమాలలో అశ్వారూఢులై వచ్చి పిస్తోళ్లను తీసి ఢాం ఢామ్మని పేల్చి మళ్లీ అంతే వేగంగా దూసుకుపోయే పాత్రలు గుర్తుకువచ్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగం వ్యవహరించదగిన పద్ధతేనా అది? అది కూడా పైన సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టూ, బుల్డోజర్ న్యాయాలు తగవని, చట్టవిరుద్ధమని హెచ్చరిస్తుండగా.
ఈ తీరు వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలటం, పేదలే నిరాశ్రయులు కావటం, మధ్య తరగతిలో, పై తరగతిలో, వ్యాపార వర్గాలలో భయాందోళనలు వ్యాపించటం ఒక్కటైతే, అంతకన్న మౌలికంగా ప్రభుత్వం పట్ల, హైడ్రాతో సహా అధికార యంత్రాంగం పట్ల ప్రజల విశ్వాసం దెబ్బతినిపోతున్నది. కబ్జాదారులలో భయం సృష్టించటం కూడా తమ లక్ష్యమన్నారు హైడ్రా కమిషనర్. అది మంచి మాటే. కానీ భయం సృష్టి చట్టాల సక్రమమైన అమలు ద్వారా జరగాలి తప్ప, పైన అన్న హాలీవుడ్ సినిమాల తీరులో కాదు. రంగనాథ్‌కు గత రికార్డు వల్ల మంచిపేరు, గౌరవం తగినంత లభించగా, తన మాటలు చేతల తీరు కారణంగా ఇప్పుడది దెబ్బతినటం మొదలైంది. కనుక సంయమనం చూపించి జాగ్రత్తపడటం మంచిది. అంతకన్న ముఖ్యంగా, సమగ్రమైన సమాచారంతో సంపూర్ణమైన విధి విధానాలు రూపొందించి ఇవ్వవలసిందిగా, వాటిని ప్రజలకు పారదర్శకంగా ప్రకటించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాలి. లేనిపక్షంలో ప్రభుత్వ వైఫల్యాల దోషం తనకు సైతం చుట్టుకోకతప్పదు.
చివరగా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఏర్పడుతున్న అభిప్రాయాలు అనేకం ఉన్నా, వాటి సారాంశాన్ని ఒకే ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, తిరిగి ఆ తినుబండారాల దుకాణం యజమాని నిస్పృహగా, ‘ఒక్క ఏడాదిలోనే ఇలా ఉంటే ఇంకా నాలుగేండ్లు ఎలా నడుస్తాయి సార్’ అని అడిగినట్టు, పరిస్థితులు అనేక విధాలుగా నానాటికి నిస్పృహకరంగానే మారుతున్నాయి. ఆ వివరాలు అనేకానేకం అయినందున, అందరూ గమనిస్తున్నవే గనుక, ఇక్కడ ప్రత్యేకంగా ఏకరవు పెట్టుకోవల్సిన అవసరం లేదు కూడా.
-టంకశాల అశోక్