తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే ఒక ప్రతిష్ఠాత్మకమైన సంస్థ. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన నాటినుంచి ఎన్నో వేల ఉద్యోగాలు భర్తీచేసిన ఘనత టీజీపీఎస్సీ సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల ప్రచార సభల్లో వాగ్దానం చేసింది. కానీ, 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు, గ్రూప్-1 పరీక్ష నిర్వహించి 20 వేల పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేకపోయారు. ఈ తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అయిన గ్రూప్-1 పరీక్షా ఫలితాలు పూర్తిగా తప్పుల తడకగా మార్చేశారు. 563 గ్రూప్-1 పోస్టులకు గాను పరీక్ష రాసిన 20 వేల మందిలో 40 శాతం మంది తెలుగు మీడియంలో పరీక్ష రాశారు. జీఆర్ఎల్ ప్రకారం టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రబోజులు శ్రీకృష్ణ దేవరాయలు అంటే, ఈ రేవంత్ రెడ్డి దేశ భాషలందు అసలు తెలుగును లెస్ చేసే కుట్ర చేస్తున్నాడు. 46 పరీక్షా కేంద్రాల్లో కేవలం 2 సెంటర్ల లోనే 74 మంది టాపర్లున్నారు. కొన్ని సెంటర్లలో ఒక్క టాపర్ కూడా ఎందుకు లేరు? ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు పరీక్షలు రాస్తే కొన్ని సెంటర్లలో 10 శాతం పాసయితే, ఇంకొన్ని సెంటర్లలో 0.2 శాతం పాసయ్యారు. ఈ అంతరం ఎలా సాధ్యం? పక్క పక్క రోల్ నంబర్లకు సుమారుగా 1300 మందికి ఒకేరకమైన ఫలితాలు ఎలా వస్తాయి? ఇదెలా సాధ్యమైంది.? కొందరు అభ్యర్థులకు కొన్ని సబ్జెక్టులలో ఉత్తమ ఫలితాలు వచ్చి, ఇంకొన్ని సబ్జెక్టులలో కేవలం 0, 1, 2, 3 మార్కులే రావడం, కఠినమైన ప్రిలిమ్స్ దాటుకొని ఫైనల్స్ రాసినవాళ్లకు విచిత్రంగా 2, 3, 6, 8, 9 మార్కులు రావడంలో ఆంతర్యం ఏమిటి? టీజీపీఎస్సీ వారు మార్చి 13న గ్రూప్-1 వాల్యుయేషన్ పారదర్శకంగా జరుగుతుందని ఒక వెబ్‌నోట్ రిలీజ్ చేశారు. కానీ, పరీక్షా ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయని, నవంబర్లోనే కాంగ్రెస్ పార్టీ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు. ఇదెలా సాధ్యం? అసలు, కాంగ్రెస్‌కు టీజీపీఎస్సీకి ఏం సంబంధం? ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ విషయాలు కాంగ్రెస్‌కు ఎలా తెలుస్తున్నాయి?
రీకౌంటింగ్‌కు అప్లికేషన్ చేసుకున్న 9000 మందికి ఒక్కరికి కూడా మార్కులు పెరగలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే రీకౌంటింగ్ చేయకముందే ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీలలో క్యాటగిరి వారీగా ఫలితాలు వెల్లడించడంలో ఆంతర్యం ఏమిటి? జీఆర్ఎల్ రాకముందే ఎవరెవరికి ఎన్ని మార్కులు, ఏ హాల్‌టికెట్ వాళ్లకు ఎన్ని వస్తున్నాయో తెలిసిపోతుంది. ఆ సమాచారం టెలిగ్రాం గ్రూప్‌లలో ఎలా వస్తుంది? దేశంలో యూపీపీఎస్సీ ఉన్నది, అనేక రాష్ర్టాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉన్నాయి. కానీ, ఏ రాష్ట్రంలో ప్రిలిమ్స్‌లో ఒక హాల్‌టికెట్, మెయిన్స్‌లో ఇంకొక హాల్‌టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు? టీజీపీఎస్సీ మాత్రమే ఇలా రెండు హాల్ టికెట్లు ఎందుకు ఇస్తుంది? దీనిపై చర్చ జరగాలి. మొదటి రెండు ఇవాల్యుయేషన్లు జరిగాయి. కానీ, 3వ ఇవాల్యుయేషన్ జరగలేదని అభ్యర్థులు అంటున్నారు. కానీ, నాకైతే 2వ ఇవాల్యుయేషన్ కూడా జరగనట్టే అనిపిస్తున్నది. మొదటి ఇవాల్యుయేషన్‌కు రెండవ ఇవాల్యుయేషన్‌కు 15 శాతం వ్యత్యాసం ఉంటేనే మూడో దానికి వెళ్లాలి. కానీ, మొదటి రెండు ఇవాల్యుయేషన్లకు సుమారు 40 శాతం, 50 శాతం తేడా ఉన్నది. టాపర్‌కు 500 వచ్చాయి, యూపీపీఎస్సీలో ఇంటర్వ్యూ దాకా వెళ్లివచ్చిన వారికి 380, 390, 400 మార్కులు వచ్చాయి. ఇంత అంతరం ఎలా సాధ్యం? ప్రతీ సబ్జెక్ట్‌లో 5 లేదా 6 స్పెషలైజేషన్లు ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రొఫెసర్లతోనే పేపర్ వాల్యుయేషన్ చేయించాలి. కానీ, వాళ్లు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ప్రైవేట్ వ్యక్తులతో వాల్యుయేషన్ చేయించారు. ఒక్కో స్టేజీలో, ఒక్కో మీడియంలో, ఒక్కో క్యాటగిరిలో ఒక్కో రకమైన ఫలితం! గ్రూప్-1లో ఏమైనా డీ లిమిటేషన్ చేశారా?
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం సమయంలోనే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. సర్వేలో కాంగ్రెస్ అభ్యర్థి వెనుకబడ్డట్టు, నిరుద్యోగులు, యువత అంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకమవుతున్నారని పసిగట్టి నష్ట నివారణ చర్యల్లో భాగంగా గ్రూప్-1 ఫలితాలు ప్రకటిస్తే నిరుద్యోగులను మచ్చిక చేసుకోవచ్చని, గెలవవచ్చని ఎత్తుగడ వేశారు. 6 వేల అభ్యర్థుల పేపర్లను ఏపీలో 40 రోజుల్లో మూల్యాంకనం చేస్తే, 20 వేల అభ్యర్థుల పేపర్లను మూడు నెలల్లో పూర్తిచేయడం వెనుక ఇదే అసలు రహస్యం. గ్రూప్-1 పరీక్షలో జరిగిన ఈ అవకతవకలపై విచారణ జరగాలి. రీ వాల్యుయేషన్ జరగాలి. లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలి. పరీక్షలను ఇంత తప్పులతడకగా నిర్వహించి మానసికంగా వారిని కుంగదీసినందుకు విద్యార్థి లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి.