వలస పాలనలోని అమెరికాలో రిప్ వాన్ వింకిల్ అనే డచ్ అమెరికన్ న్యూయార్క్ సమీపంలోని క్యాట్సికిల్ కొండల్లో ఉండగా అతనికి ఓ డచ్ జాతీయుడు తారసపడతాడు. ఆ డచ్ జాతీయుడు ఇచ్చిన మద్యం తాగి నిద్రలోకి జారుకుంటాడు రిప్ వాన్ వింకిల్. అతనికి మెలకువ వచ్చేసరికి 20 ఏండ్లు గడిచిపోతాయి. ఫలితంగా, 1760ల నుంచి జరిగిన అమెరికా విప్లవం, స్వాతంత్య్ర ప్రకటన వంటి చారిత్రక ఘట్టాలు మొద్దు నిద్రలో ఉండిపోయిన వింకిల్కు తెలియవు. దీంతో ‘అరే, అమెరికా ఇంత మారిపోయిందా?’ అని అనుకుంటాడు వింకిల్. అమెరికా రచయిత వాషింగ్టన్ ఇర్వింగ్ 1819లో ప్రచురించిన
చిన్న కథ సారాంశం ఇది. ఈ అమెరికన్ కథను గుర్తుకుతెచ్చేలా రాహుల్‌గాంధీ ఈ మధ్య మట్లాడుతున్నారు.
మన దేశంలో 1984-2004 మధ్యకాలంలో వచ్చిన సామాజిక న్యాయ విప్లవాన్ని రాహుల్ కూడా రిప్ వాన్ వింకిల్ మాదిరిగా చూడలేకపోయారు. టీనేజ్‌లో ఉండటం, అమెరికా, బ్రిటన్‌లో విద్యాభ్యాసం వల్ల నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడికి భారత నేలపై వీచిన కొత్త గాలులు తగలకుండా పోయాయని సమర్థించుకోవడానికి వీల్లేదు. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాసిన పం డిత నెహ్రూ మునిమనవడికి చరిత్రలో కీలక సందర్భాల గురించి చెప్పే కాంగ్రెస్ మేధావులకు కొరత లేదు.
కులగణన.. ఏడాది కాలంగా కాంగ్రెస్ పదే పదే జపిస్తున్న మాట ఇది. కేంద్రంలో పాలకపక్షంగా దాదాపు ఐదున్నర దశాబ్దాల అనుభవం ఉన్న కాంగ్రెస్ పాలనకు తెరపడి పదేండ్లు దాటాయి. ఇప్పుడు కులగణన ఒక్కటే కాంగ్రెస్‌కు రాజమార్గంగా కనిపిస్తున్నది. దేశంలో రాహుల్ ఎక్కడికి వెళ్లినా ఆయన నోటి నుంచి వచ్చేది ఈ మాటే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌కు కులగణన ఒక్కటే బ్రహ్మాస్త్రం లా కనిపిస్తున్నది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, సోషలిస్ట్ దిగ్గజం రామ్మనోహర్ లోహియా, సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి సిద్ధాంతాలే ఆదర్శంగా నడిచే రాజకీయపక్షాలు 30 ఏండ్ల కిందటే దేశంలో జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన జరపాలనే డిమాండ్‌ను ముందుకుతెచ్చాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కులగణనపై మాట్లాడటానికి ఇష్టపడేది కాదు. 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం వీపీ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని నాటి కాం గ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాజీవ్‌గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఓబీసీ కోటాను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ చివరికి సుప్రీంకోర్టు తీర్పు కారణంగా దాన్ని అమలుచేయక తప్పలేదు.
మండల్ రిజర్వేన్లను తీవ్రంగా ప్రతిఘటించిన రాజీవ్‌గాంధీ కన్నుమూసి 33 ఏండ్లు దాటిన తర్వాత ఆయన కుమారుడు రాహుల్ ఒక్కసారిగా సామాజిక న్యాయమూర్తిగా కొత్త వేషం ధరించారు. బీఎస్సీ స్థాపకుడు కాన్షీరామ్ మాదిరిగా కులం ప్రభావంపై ప్రసంగా లు దంచికొడుతున్నారు. కోటాలకు 50 శాతం పరిమితి తొలగించాలని డిమాండ్ చేస్తున్నా రు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణన తప్పనిసరిగా జరపాలని, లేకుంటే తర్వాత అధికారంలోకి వచ్చే ప్రధాని హయాంలో కులాలవారీ లెక్కలు తీయడాన్ని నరేంద్ర మోదీ చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై తమ ప్రకటిత విధానాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాల కూ ఉన్నది. అయితే, దాదాపు 140 ఏండ్ల తన సుదీర్ఘ చరిత్రలో కాంగ్రెస్ యూటర్న్లు అవకాశవాద రాజకీయాలకు ప్రతిబింబాలనే చెప్పుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ సెక్రెటేరియట్‌లో ఎంత మంది ఓబీసీలు సెక్రెటరీ స్థాయిలో ఉన్నా రు? ఇప్పటివరకు ఎంపికైన మిస్ ఇండియా పోటీల విజేతల జాబితా చూస్తే వారిలో ఒక్క రూ బీసీ, ఎస్సీ లేదా ఎస్టీ లేకపోవడం ఏమి టి? వంటి ప్రశ్నలతో రాహుల్ అప్పుడే పుట్టి న రాజకీయపక్షం నేతలా ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు. దేశంలో నైపుణ్యం, ప్రతిభాపాటవాలున్న 90 శాతం ప్రజలు ప్రభుత్వ వ్యవస్థ బయట ఉన్నారని, తాను అధికారంలోకి వచ్చి జరిపించే కులగణన వారందరినీ భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావడానికి దోహదం చేస్తుందని ఇటీవల యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సదస్సులో రాహుల్ పలికిన మాటలు రాజకీయ పండితులను, పాత్రికేయులను చెప్పలేనంత అయోమయానికి గురిచేశాయి.
రాహుల్ అన్నట్టు కేవలం పది శాతం ప్రజలే రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తుంటే మరి ఆయన ముత్తాత నెహ్రూ 17 ఏండ్ల పాలనలో ఏం జరిగింది? నాయనమ్మ ఇందిరాగాంధీ 16 ఏండ్ల ఏలుబడిలో పేదలకు అన్యాయమే మిగిలిందా? తండ్రి రాజీవ్‌గాంధీ తన ఐదేండ్ల హయాంలో 21వ శతాబ్దం గురించి కబుర్లతోనే కాలక్షేపం చేశా రా? అనే అనుమానాలు ఎవరికైనా వస్తా యి. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాల పాలనలో అసలేం జరిగిందో చారిత్రక దృక్పథం ఉన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వంటి నేతలైనా రాహుల్‌కు ప్రత్యేక పాఠాలు చెప్ప డం అత్యవసరం.
అంతేగానీ, దేశంలో ఎన్ని ప్రముఖ ఆంగ్ల పత్రికలకు ఓబీసీలు, ఎస్సీలు
ఎడిటర్లు అయ్యారు? మిస్ ఇండియాగా బహుజనుల ఆడబిడ్డ ఇంకెప్పుడు ఎంపికవ్వాలి? వంటి ప్రశ్నలతో చరిత్ర తెలియని అమాయకుడిలా రాహుల్ గాంధీ జనాన్ని మాయచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనైనా అవి మానుకుంటే మంచిది. ఇంకా, ఇండియాలోని 500 మంది బడా పారిశ్రమికవేత్తల్లో ఒక్కరైనా ఓబీసీ, దళిత, ఆదివాసీ ఉన్నారా? అంటూ పదే పదే ప్రశ్నలు సంధించడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదనే విషయం రాహుల్ తెలుసుకోవాలి.
దేశంలో పేదరికాన్ని మరింతగా తగ్గించడానికి, కొత్త ఉద్యోగాలతో పాటు సంపద పెంచడానికి మార్గాలను అమెరికా నగరం చికాగో లో నివసించే 82 ఏండ్ల టెలికం ఇంజినీర్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా వంటి నిపుణులతో మాట్లాడటం వల్ల రాహుల్‌కు, కాంగ్రెస్‌కు కొంతైనా ప్రయోజనం ఉంటుంది. అంతేగానీ, కులగణనే కాం గ్రెస్ పార్టీ విధాన పత్రానికి కీలకాంశంగా ఉం టుందని, కులగణనతో అన్ని కులాల సంఖ్యా వివరాలు వెల్లడవగానే అందరికీ న్యాయం చేయడం అత్యంత సులువవుతుందని రాహు ల్ చెప్పడం ఆయన తెచ్చిపెట్టుకున్న మేధోపరమైన గాంభీర్యానికి చిహ్నంగా మిగిలిపోతుం ది. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో గట్టి పునాదులున్న ఎస్పీ, ఆర్జేడీ వంటి సామాజిక న్యాయపక్షాల ఆసరా ఆరేడు సీట్లు గెలుచుకోడానికి మాత్ర మే ఉపకరిస్తుంది.
జనతా పరివార్ పార్టీల నుంచి గుంజుకున్న, అరువు తెచ్చుకున్న నినాదాలతో హిందీ రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు ఎన్నటికీ పూర్వవైభవం రాదు. కులగణనపై అంత శ్రద్ధ, దాని ప్రయోజనంపై ఎనలేని నమ్మకం రాహుల్‌కు ఉంటే బీహార్ జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిశోర్ మొన్న సవాల్ చేసినట్టు.. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక, తెలంగాణ లో మొదట కులగణన చేయిస్తే ఆయన మాటలకు విలువ ఉంటుంది.
సామాజిక, రాజకీయ చైతన్యంలో ముం దున్న కేరళలో 1967లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన మార్క్సిస్టు నేత ఈఎంఎస్ నంబూద్రిపాద్ ఎలాంటి ఆర్భాటం లేకుం డా 1968-69 మధ్యకాలంలో సామాజిక, ఆర్థిక సర్వే జరిపించారు. వివిధ సామాజికవర్గాల స్థితిగతులు తెలసుకున్నారు. నేరుగా కులగణన జరపకున్నా ఈ సర్వేలో ఏయే కులాలు, ఏయే రంగాల్లో ప్రగతి సాధించాయనే విషయం తేలింది. ఈ వివరాల ఆధారంగా విధానాలు రూపొందించిన వామప క్ష సర్కారు.. కాంగ్రెస్ అప్పటివరకు అనుసరించిన మతతత్వ, కులతత్వ వ్యూహాలకు విరుగుడు కనుగొన్నది. అంతేగాని, అధికా రం కోసం, కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం కులగణన పేరు చెప్పి ఆత్మశుద్ధిలేని కులజపం చేస్తే నమ్మడానికి ఇది 20వ శతా బ్దం తొలి సంవత్సరాల నాటి భారతం కానే కాదు.
నాంచారయ్య మెరుగుమాల