తెలంగాణ సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ప్రవర్తన, ఆయా ఉదంతాలపై రాజకీయ పక్షాలు స్పందిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పోక్సో చట్టం కింద తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ, న్యాయస్థానం ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో నిందితుడు బండి భగీరథ్ ఉదంతం చుట్టూ జరుగుతున్న పరిణామాలు విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. అయితే, ఈ కేసు తీవ్రతను పక్కదారి పట్టించేందుకు, బాధితుల పక్షాన నిలబడిన వారిని మానసికంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు సామాజికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం జరగాలని, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిరంతరం పోరాడుతున్నారు. మాజీ పోలీస్ అధికారిగా చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయన, బాధితుల హక్కుల కోసం గళమెత్తటం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రకు నిదర్శనం.
అయితే, ఈ సామాజిక పోరాటాన్ని తట్టుకోలేక, రాజకీయ కక్షసాధింపులో భాగంగా ప్రవీణ్ కుమార్ పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేదికలపై కొన్ని శక్తులు పోల్స్ నిర్వహించటం అనాగరిక చర్య. ప్రజాక్షేత్రంలో జరిగే పోరాటాల్లోకి నాయకుల పిల్లలను లాగటం, వారిపై డిజిటల్ వేదికల ద్వారా మానసిక దాడికి పాల్పడటం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. సమాజంలో సాంప్రదాయాలు, విలువల గురించి మాట్లాడే శక్తులే ఇటు బండి భగీరథ్ ఉదంతంలో నిందితుడిని వెనకేసుకొస్తూ, అటు ప్రశ్నించిన నాయకుడి పిల్లలపై ఆన్లైన్ వేధింపులకు దిగటం వారి ద్వంద్వనీతిని చాటుతున్నది.
ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి నైతిక బాధ్యతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో శాంతిభద్రతలు, చట్టాలను పర్యవేక్షించే అత్యున్నతమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో సదరు నాయకుడు కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు స్వయానా కేంద్ర మంత్రి కుమారుడు కావటంతో, ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని లేదా ప్రధాని మంత్రివర్గం నుంచి బండిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్లు ప్రజాస్వామ్యవాదుల నుంచి బలంగా వస్తున్నాయి. అత్యున్నత అధికార పీఠంపై ఉంటూ, సొంత కుమారుడు తీవ్రమైన నేరారోపణలతో జైలు పాలైనప్పుడు ఆ పదవిలో కొనసాగటం నైతికంగా చెల్లదు.
ప్రస్తుతం ఈ ఉదంతం న్యాయస్థానం పరిధిలో ఉండటం, ప్రజాప్రతినిధి పేరు ప్రస్తావనపై చట్టపరమైన నిరోధక ఉత్తర్వులు (గ్యాగ్ ఆర్డర్) అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలకు లోబడే ఈ విశ్లేషణ సాగుతున్నది. అధికార పక్షాలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం నిందితులకు పరోక్షంగా సహకరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్న తరుణంలో, ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయం. ఇప్పటికైనా సోషల్ మీడియా వేదికల ద్వారా నాయకుల కుటుంబాలు, పిల్లలపై జరుగుతున్న అనాగరిక దాడులను అరికట్టటంతో పాటు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్న సంజయ్ తన నైతికతను నిలబెట్టుకుంటూ తప్పుకోవటమే ఈ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించే ఏకైక మార్గం.
-రఘువీర్ రాథోడ్
9948480556