ఖమ్మంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీసభలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చేసిన ప్రసంగం హిందీలో ఉన్నప్పటికీ.. చాలా మందిని ఆకట్టుకున్నది. ఆలోచింపచేసింది. ఈ నేపథ్యంలో, ఆ ప్రసంగం పూర్తిపాఠం ఆయన మాటల్లోనే..
‘ఇంత భారీ సంఖ్యలో వచ్చి మాకు బలాన్ని సమకూర్చిన ప్రజానీకానికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. సత్ శ్రీ కాల్. ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని చూశాను. అనేక మందికి కంటి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైనవారికి కండ్లద్దాలు ఇస్తున్నారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని తిలకించే అవకాశం, దాని నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం నాకు లభించింది. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటి చెబుదామని అనుకుంటున్నా. ఈ సభకు హాజరైన అశేష ప్రజానీకం ఎక్కడి దాకా ఉన్నారో చూడటానికి కూడా ప్రత్యేకమైన కళ్లద్దాలను తయారు చేయాల్సి ఉంటుందేమో. ఎందుకంటే, చూపు ఎక్కడిదాకా వెళ్తే అక్కడి దాకా జనమే జనం ఉన్నారు. ఇది మీ ప్రేమకు సంకేతం.
ఈ సభలో పాల్గొనటానికి మీరు మీ ఇంటి నుంచి బయటకు వేసిన తొలి అడుగే మార్పు కోసం వేసిన తొలి అడుగు. మీరు ఇక్కడికి రావటమే దీనికి సాక్ష్యం. మీరు దేశాన్ని ప్రేమిస్తారు. దేశం ఎటు వెళ్తున్నదన్న ఆవేదన మీలో ఉంది. విద్వేష రాజకీయాల్ని ఈ దేశం సహించదన్న విషయం మీకు తెలుసు. ఎందుకంటే, ఈ దేశం అనేక రంగుల పూలతో కూడిన పూలగుచ్ఛం. కానీ, కొందరు ఈ పూలగుచ్ఛంలో ఒకే రంగు పూలు ఉండాలని భావిస్తున్నారు. అది ఎన్నటికీ జరుగని పని. ఒకే రంగు పూలున్న పూలగుత్తిని ఎక్కువ సేపు చూడాలని అనిపించదు. పూలకు ఉన్న వేర్వేరు రంగుల వల్లే పూలగుత్తి తయారవుతుంది.
ఈ రోజు దేశం ఉద్యోగాలను కోరుకుంటున్నది. భూమ్మీదే అత్యంత యువశక్తితో కూడిన దేశం మనది. కానీ, యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వారు (మోదీ, బీజేపీ) హామీ ఇచ్చారు. కానీ, అది జుమ్లా (అబద్ధమే) అని తేలిపోయింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. అదీ అబద్ధంగా నిలిచింది. ధరలు తగ్గిస్తామన్నారు. అదీ అబద్ధమే. ప్రతీ కుటుంబం ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. అదీ అబద్ధమే. ఈ విధంగా భారతీయ జుమ్లా పార్టీ బీజేపీ.. దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నది. ప్రతీ ఒక్కదానిని హస్తగతం చేసుకోవాలని ఆ పార్టీ చూస్తున్నది. ప్రజల తీర్పుతో గెలువని రాష్ర్టాల్లో రాజీనామాలు చేయించి కృత్రిమంగా ఉప ఎన్నికలు తీసుకొస్తుంది. ఎమ్మెల్యేలను ఖరీదు చేస్తుంది. ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) మెజారిటీ సాధించింది. కానీ, బీజేపీ దానిని అంగీకరించకుండా, మేయర్ పదవి తనదేనని అంటున్నది. ఇదేం మాట? ఇది ప్రజాతంత్రమా? కాదు.. దోపిడీ తంత్రం. వారికి తెలియదు.. కాలం చాలా శక్తిమంతమైనది. మహారాజులను బికారులను చేస్తుంది. బికారులను మహారాజులను చేస్తుంది. ప్రజాశక్తి కూడా అటువంటిదే. బీజేపీ వాళ్లలాగా అహంకారం తలకెక్కి కన్నూమిన్నూ కానకుండా పైచూపులు చూస్తున్న వారిని నేల పైకి తీసుకొచ్చి దింపుతుంది ప్రజాశక్తి. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్లను కిందికి దించాం భాయీసాబ్! ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వారికి అధికారం లభిస్తుంది. అంతేగానీ, అది బలవంతంగా గుంజుకునేది కాదు. దానిని ఖరీదు చేయలేం. ప్రజల ప్రేమను ఖరీదు చేయటం సాధ్యం కాదు.
పంద్రాగస్టు నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి చేసే ప్రసంగం వింటూ ఉంటా. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఏమీ మారదు. అధికారులు ఒకే పడికట్టు పదజాలంతో అదే రాస్తున్నారు. దాన్ని ఆయన అలాగే చదివేస్తున్నారు. నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేస్తారు. ధరల పెరుగుదల మీద మరికొంత ఎక్కువ ఆందోళన వెలిబుచ్చుతారు. ఉగ్రవాదంపై అన్నింటికన్నా అధికంగా ఆందోళన పడతారు. దాంతో పంద్రాగస్టు ముగుస్తుంది. అయ్యా! మీరు ఎలాగూ దేశంలోని 130 కోట్ల మంది తలరాతను మార్చలేరు. కనీసం మీ ప్రసంగాన్నైనా మార్చండి. ఎర్రకోటపై ఉండే పావురాలకు కూడా ఆ ప్రసంగాన్ని వినీవినీ బట్టీ పట్టినట్లయి ఉంటుంది. కొంచెమైనా మార్చండి. కానీ, అదీ చెయ్యలేరు. పంజాబ్‌లో కూడా ఐదేండ్ల తర్వాత ఐదేండ్లు ఇలాగే నడుస్తూ వచ్చింది. కానీ, ఆప్ రూపంలో మార్పు వచ్చింది. అసెంబ్లీలో ఉన్న 117 సీట్లకుగాను 92 సీట్లు గెలువటం పంజాబ్ చరిత్రలోనే తొలిసారి జరిగింది. పెద్ద పెద్ద వాళ్లు.. తమను ఎవ్వరూ ఓడించలేరని చెప్పుకునేవాళ్లు.. వాళ్ల కుటుంబాలకు కుటుంబాలే ఓటమి పాలయ్యాయి. ప్రజాశక్తి అంటే ఇదే.
వీళ్ల పనేమిటి? ఒకటే.దోచుకోవటం. అన్నింటినీ అమ్మేశారు. విమానాల్ని అమ్మారు.విమానాశ్రయాల్ని అమ్మారు. నదుల్ని అమ్మారు. ఎల్ఐసీని అమ్మారు. రైల్వేను అమ్మారు. ఒక్కటే ఒక్కటి.. మీడియాను మాత్రం కొన్నారు. మిగిలినవన్నింటినీ అమ్మేశారు. వీళ్లకు తమ స్వార్థం, తమ మిత్రుల ప్రయోజనం తప్ప జనం గురించి పట్టదు.
ఈ బీజేపీ వాళ్లకు రుతువుల మీద ఆధికా రం చెలాయించే అవకాశం ఉండేట్లయితే, వీళ్లు తమ పొలాల్లోనే వర్షం కురిపించుకునేవారు. అన్నీ తమకే కావాలి. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్నీ తమకే కావాలి. సీఎంలను పని చేసుకోనివ్వవద్దని గవర్నర్లకు చెబుతారు. ఢిల్లీ పిల్లలకు అత్యాధునిక విద్య అందించటం కోసం ఉపాధ్యాయులను శిక్షణ నిమిత్తం ఫి న్లాండ్ తీసుకెళ్లాలని కేజ్రీవాల్ భావిస్తే.. ఒద్దొద్దు.. ఎటూ వెళ్లటానికి వీల్లేదని ఆంక్షలు విధిస్తారు. ఢిల్లీ స్కూళ్ల అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లను ఆమోదించరు కానీ, ట్రంప్ సతీమణి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చూస్తానన్నప్పుడు.. వారికి కేజ్రీవాల్ స్కూళ్లను చూపించక తప్పలేదు. ఎందుకంటే, తమ పాలనలో ఉన్న వాటిని ఎలాగూ చూపించలేమని వారికి తెలుసు.
నేర్చుకోవటానికే నేను ఇక్కడికి వచ్చాను. కంటి వెలుగు ఎంతో మంచి ప్రోగ్రామ్. ఇటువంటి కార్యక్రమాన్ని పంజాబ్‌లో కూడా నేను ప్రారంభిస్తా. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాల్సిందే. ఇది నాలెడ్జ్ షేరింగ్ యుగం. స్టార్టప్‌ల యుగం. ప్రపంచం కుగ్రామం అయిపోయింది. మీకు, మీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేయటానికి కూడా ఇక్కడికి వచ్చాను. ఆయన తెలంగాణ కోసం ఉద్యమించారు. నేడు దేశంలోనే తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నది. మన దేశం పలు రాష్ర్టాల సముదాయం. పుష్పగుచ్ఛం లాంటిది. దీనిని విభజించవద్దు. ఇదే విషయాన్ని నేను పార్లమెంటులో నాకు సరైన సమయం ఇవ్వకపోయినా, కేవలం 30 సెకన్లలో ప్రభుత్వానికి చెప్పాను. పంజాబ్‌లో పంద్రాగస్టుకు వంద మొహల్లా క్లినిక్‌లను ప్రారంభించాం. అవి 26 జనవరి నాటికి 500 అయ్యాయి. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం.
కాంగ్రెస్‌కు చెందిన అవినీతి నాయకులు నేడు జైలులో ఉన్నారు. కాంగ్రెస్ విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఆ పార్టీ ఇప్పుడు అన్ని రాష్ర్టాల్లోనూ చేంజ్ (మార్పు) కోసం కాదు.. ఎక్స్చేంజ్ (మార్పిడి) కోసం అన్నట్లు తయారైంది. ఎవరికైనా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు తక్కువైతే కాంగ్రెస్ నుంచి ఖరీదు చేసుకోవచ్చు. మెజారిటీని కాస్త పెంచుకోవాలనుకుంటే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను కొనొచ్చు. ఆ పార్టీ తమ ఆఫీసు ముందు బోర్డు పెట్టుకోవచ్చు.. ఇక్కడ సరసమైన ధరలకు ఎమ్మెల్యేలు లభిస్తారు అని. ఇదీ ఆ పార్టీ పరిస్థితి. దేశం నాశనం కావటానికి, ఈ రోజున్న పరిస్థితులకు కాంగ్రెస్ కూడా కారణమే.
మన దేశాన్ని నెంబర్ వన్ చెయ్యాలి. చేద్దాం కదా! ఎందుకంటే, దేవుడు ఈ దేశానికి అన్నీ ఇచ్చాడు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను కల్పించాడు. పర్వతాలు, నదులు, బొగ్గు, సముద్రాలు.. వీటన్నింటితోపాటు శ్రమ చేయగల 130 కోట్ల మంది జనం.. ఇన్ని ఇచ్చాడు. కానీ, ఒకే ఒక్కటి ఇవ్వలేదు. నిజాయితీ ఉన్న నేతలను మాత్రం ఎక్కువ ఇవ్వలేదు. నిజాయితీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటైతే దేశం నెంబర్ వన్‌గా మారుతుంది. బ్రిటీష్ పాలనపై పోరాడిన సమయంలో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ఇచ్చిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నాటి పాలకుల మహళ్లను కంపింపజేసింది. ఆ నినాదాన్ని చేతులెత్తి మరోసారి బిగ్గరగా ఇద్దాం.. ఇంక్విలాబ్ జిందాబాద్. బతికి ఉంటే మళ్లీ కలుద్దామని అందరూ అంటుంటే వింటుం టాం.. కానీ, ఈ పంజాబీ హృదయం చెప్పేది వినండి.. మనం కలుస్తుంటూనే జీవించి ఉంటాం. ధన్యవాదాలు’.
ఈ ప్రసంగం వీడియోను చూడాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి
Punjab CM Speech