గ్రూప్-1 నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత్రికిరాత్రే 562 మంది అభ్యర్థులను ఎంపిక చేసేసింది. వారికి పోస్టింగ్‌లు కూడా ఇచ్చేసింది. నియామక పత్రాలు అందుకున్నవాళ్లు విధుల్లో చేరే ప్రక్రియ కూడా చకచకా
సాగుతున్నది. అయితే, గ్రూప్-1లో జరిగిన అవకతవకలపై దాఖలైన కేసులో వాదోపవాదాలను విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఎవ్వరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో 222 పేజీల తీర్పుని వెలువరించింది. వీలైతే రీ వాల్యూయేషన్ చేయాలని, లేదా గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని అందులో ఆదేశించారు. కానీ, ఈ తీర్పును పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టించుకోలేదు.
ఏకసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెళ్లింది. దీంతో సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ పక్కనపెట్టేసింది. అక్టోబర్ 15 తీర్పునకు లోబడి అపాయింట్మెంట్లు ఇచ్చుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పింది. ఇదే అదునుగా భావించిన టీజీపీఎస్సీ అక్టోబర్ 28న అర్ధరాత్రి ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలాగా అనిపిస్తున్నది. తుది తీర్పు ఇవ్వకుండానే అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేయాలని కోర్టు ఎలా చెప్తుంది? ఒకవేళ టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇదివరకే ఇచ్చిన నియామక పత్రాలు చెల్లుతాయా? ఈ ప్రశ్నలకు కమిషన్ సమాధానం చెప్పాలి.
కోర్టులు అడిగిన ఎలాంటి ప్రశ్నలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాధానాలు ఇవ్వడం లేదు. ప్రిలిమినరీ పరీక్షలకు, మెయిన్స్ పరీక్షలకు రెండు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకిచ్చారనే ప్రశ్నకు సమాధానం లేదు. అంతా తమ ఇష్టమనుకుంటే, గ్రూప్-1కి ఎంపికైనట్టు ప్రకటించిన 562 మంది అభ్యర్థుల ప్రిలిమినరీ, మెయిన్స్ హాల్ టికెట్లను పక్కపక్కన పెట్టి చూపించాలి. కోఠి మహిళా కళాశాలలోని సెంటర్ 18, 19లలో పరీక్షలు రాసిన 71 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక కావడం అంతుచిక్కని రహస్యం. గ్రూప్-1లో ఫెయిలైన అభ్యర్థుల్లో తెలంగాణ ఉద్యమం మీద పుస్తకాలు రాసినవారు, ఆర్టికళ్లు రాసినవారున్నారు. మరి వాళ్లకెందుకు మార్కులు తక్కువగా వచ్చాయి? సందేహాల నివృత్తి కోసం పేపర్ రీ-వాల్యూయేషన్ చేయాలని కోరుతూ చాలామంది ప్రతి పేపర్‌కు వెయ్యి రూపాయల చొప్పున కట్టారు. వాళ్లలో ఎంతమంది పేపర్లు రీ-వాల్యూయేషన్ చేశారో కమిషన్ జవాబు చెప్పాలి. ఒక పరీక్ష కేంద్రంలో వరుస క్రమంలో కూర్చున్న ఇరవై మంది పాసయ్యారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? తెలుగు మీడియంలో పరీక్ష రాసిన సుమారు ఎనిమిదిన్నర వేల అభ్యర్థుల్లో కేవలం 56 మంది పాసయితే, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 95 శాతం మంది పాసయ్యారు. ఇంత నిర్లక్షంగా పేపర్లు వాల్యూయేషన్ ఎలా చేస్తారు?
గ్రూప్-1లో వేసిన మార్కులు కూడా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఒకే రకమైన మార్కులు వచ్చినవాళ్లు వేలల్లో ఉన్నారు. 450 నుంచి 460 వరకు అంటే, కేవలం పది మార్కుల వ్యత్యాసం ఉన్నవారు 256 మంది ఉన్నారు. 450 నుంచి 530 వరకు మార్కులు సాధించినవారు 612 మంది ఉన్నారు. ఇదెలా సాధ్యం? ఆబ్జెక్టివ్ టైప్‌లో ఒకే విధమైన మార్కులు వచ్చాయంటే అర్థం ఉంది. కానీ, మెయిన్స్ పరీక్షలో అందరూ ఒకే విధంగా రాయరు కదా? అయినప్పటికీ, మా ర్కులు అందరికీ ఒకే విధంగా రావడం విడ్డూరం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీటిని పట్టించుకోవడం లేదు. సివిల్ సర్వీసుల్లోనే ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లకు 1100 మార్కులకు గాను 51 శాతం మార్కులు దాటవు. కానీ, గ్రూప్-1లో మాత్రం 900 మార్కులకు గాను, 500 మార్కులకు పైగా వచ్చిన వారు యాభైకి పైగా ఉన్నారు. గ్రూప్-1 పోస్టులు సివిల్ సర్వీసెస్‌తో సమానమైన పోస్టులు. వీరంతా పాలసీ మేకర్స్, నిర్ణయాధికారులు. ప్రజలకు దగ్గరుండి సేవలు చేయాల్సిన ఈ పోస్టుల కోసం నెలలు, సంవత్సరాలు చదివిన వారున్నారు. వీరికి న్యాయం చేయాల్సిన అవసరం న్యాయస్థానంపై, ప్రభుత్వంపై ఉన్నది. స్వచ్ఛమైన మేలిమి ముత్యాల్లాంటి వారు మాత్రమే ఈ పోస్టు లకు అర్హులు. వారి చదువులకు, వారి కష్టానికి అవమానం జరగకూడదు.
-కన్నోజు మనోహరాచారి
79950 89083