మేఘా వేమూరి అనే ఎంఐటీ తెలుగు విద్యార్థి చరిత్ర సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత అమెరికా యూనివర్సిటీ మెసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో గత గురువారం జరిగిన అధికారిక కార్యక్రమంలో క్లాస్ ఆఫ్ 2025 ప్రెసిడెంట్ కూడా అయిన మేఘా, పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడుతూ అమెరికా, తన వర్సిటీ ఎంఐటీ అనుసరిస్తున్న ఇజ్రాయెల్ అనుకూల విధానాలపై నిప్పులు చెరిగింది. మెరుగైన జీవనశైలితో కూడిన ‘బంగారు భవిత’ కోసం తెలుగు రాష్ర్టాల్లో బీటెక్, ఇతర సాంకేతిక కోర్సులు పూర్తిచేసి ఎంఎస్, బీఎస్ చదవడానికి అమెరికా యూనివర్సిటీల్లో చేరడానికి పరుగులు తీసే వేల మంది తెలుగు విద్యార్థుల వంటిదాన్ని కాదని మేఘా వేమూరి తన క్యాంపస్ ప్రసంగం ద్వారా నిరూపించింది.
మేఘా అమెరికాలోని జర్జియా తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి కావడం వల్లే ఇంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించిందనుకుంటే అది పూర్తిగా నిజమనిపించుకోదు. ఇండియా నుంచి వెళ్లిన కొద్ది మంది ఉత్తరాది, కర్ణాటక విద్యార్థులు కూడా మేఘా మాదిరిగానే అమెరికా ప్రభుత్వ నియంతృత్వ లేదా అక్రమ విధానాలను తప్పుపట్టిన సందర్భాలు గత రెండేండ్లలో లేకపోలేదు. సాధారణంగా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి అమెరికా వెళ్లి యూజీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాజకీయ వాసన ఉండే ఇలాంటి నిరసనలకు దూరంగా ఉంటారు. నాలుగేండ్ల ఎంఐటీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్ చదివిన మేఘా మే 29 ప్రసంగం కారణంగా స్నాతకోత్సవంలో ఆమె పాల్గొనడాన్ని ఎంఐటీ యాజమాన్యం నిషేధించింది. ఆమె డిప్లొమాను తమ ఇంటికి పంపుతారని మేఘా తండ్రి శరత్ వేమూరి తెలిపారు. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం విషయంలో అమెరికా వైఖరిని తప్పుబడుతూ మాట్లాడిన పలువురు అంతర్జాతీయ విద్యార్థులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఇప్పటికే చర్యలు తీసుకున్నది.
వారి వీసాల రద్దుకు అగ్రరాజ్యం చేసిన ప్రయత్నాలను అనేక సందర్భాల్లో అమెరికా కోర్టులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటశాల గ్రామంలో మూలాలున్న మేఘా ఎం వేమూరి తన ప్రజాస్వామిక ప్రసంగం ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో అక్కడి జనానికి ఆదర్శప్రాయంగా రాజ్యాంగం పేర్కొనే విలువల ప్రాధాన్యాన్ని ప్రపంచ ప్రజలకు గుర్తుచేసింది. అంతేకాదు, 2023 అక్టోబర్ మొదటివారం ఇజ్రాయెల్‌లో గాజా ప్రాంతం నుంచి పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ దాడి తర్వాత పరిణామాలు మానవాళికి దిగ్భ్రాంతి పరిచేలా ఉన్నాయి. గాజాలోని పాలస్తీనా అరబ్‌లకు తిండి, తాగునీరు లేకుండా చేస్తూ దవాఖానలపై ఇజ్రాయెలీ సేనలు గత రెండున్నరేండ్లుగా దాడులు చేస్తున్నాయి. ఈ యూదు దురహంకార దేశం దాడులు, అణచివేత విధానాల ఫలితంగా గాజాలో ఒక్క వర్సిటీ కూడా లేకపోవడం సిగ్గుచేటని ఎంఐటీ ప్రసంగంలో మేఘా వేమూరి తేల్చిచెప్పింది.
మరో పక్క గాజా పట్టీని అమెరికాకు స్వాధీనం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉన్నారు. అమాయక గాజా జనంపై దాష్టీకాలను ఖండిస్తూ 2024 వేసవి ముందునుంచే అమెరికా విశ్వవిద్యాలయాల్లో శ్వేతజాతి, అంతర్జాతీయ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటి మేఘా వేమూరి ప్రసంగం అమెరికా వర్సిటీల్లో 1960ల చివరినాటి వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమాలు, ప్రదర్శనలను అన్నితరాల వారికీ గుర్తుచేసింది. భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుంచి అమెరికాకు డాక్టర్లు, ఇంజినీర్లు వలస పోవడం 1960ల్లోనే మొదలైంది. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన అధ్యక్షుడు లిండన్ జాన్సన్ హయాంలో దేశంలోకి వృత్తి నిపుణుల వలసలను ప్రోత్సహించేలా చట్టాలు చేశారు. మరి ఈ నేపథ్యంలో అప్పుడు వియత్నాంలో అమెరికా సేనల ఆగడాలను దునుమాడుతూ అమెరికా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు వేల సంఖ్యలో వీధుల్లోకి రావడం సంచలనంగా మారింది. అంతేగాక అగ్రరాజ్యం విదేశాంగ విధానం మారడానికి కూడా దారితీసింది.
వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలతో అట్టుడికిన అమెరికా యూనివర్సిటీలు: వియత్నాంలో సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయ విమోచన పోరాటాన్ని అణచివేయడానికి కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అమెరికా తన సేనలు పంపి అమానుష రీతిలో కార్పెట్ బాంబింగ్ చేయడాన్ని, తమను ఆ యుద్ధంలో పాల్గొనడానికి బలవంతంగా పంపడాన్ని అమెరికా యువత 1960 ల చివరిలోనే తీవ్రంగా నిరసించింది. వందలాది అమెరికా యూనివర్సిటీల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణలకు సైతం వెనుకాడకుండా శాంతియుత మార్గంలో పోరాడారు. 1968లో వియత్నాం యుద్ధానికి నిరసనగా న్యూయార్క్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు రగిలాయి. ఇప్పుడు కూడా గాజా ప్రజలపై అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ దమనకాండకు నిరసనగా కొలంబియా వర్సిటీ విద్యార్థులు ప్రదర్శనలు జరిపారు.
ఆరు దశాబ్దాల్లో అమెరికా జనం గళంలో వచ్చిన చెప్పుకోదగిన మార్పు: అయితే 1965 నుంచి 2025 వరకూ ఆరు దశాబ్దాల కాలంలో అమెరికా ప్రజల రాజకీయ భావాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పేరు మోసిన అమెరికాలో ప్రజాతంత్ర వ్యతిరేక ధోరణులు 45 ఏండ్ల కిందటే అంటే 1980 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, హాలీవుడ్ మాజీ నటుడు రోనాల్డ్ రీగన్ గెలుపుతో పెల్లుబికాయి. మార్పును వ్యతిరేకించి మితవాద ధోరణులు అట్లాంటిక్ ఆవలి అగ్రరాజ్యంలో అప్పుడే మొదలయ్యాయి. ఈ అప్రజాస్వామిక, పెత్తందారీ అనుకూల పోకడలు 2000 ఎన్నికల్లో గెలిచిన మరో రిపబ్లికన్ జార్జి డబ్ల్యూ బుష్ హ యాంలో మరింత ముదిరాయి. చివరికి ఇలాంటి రాజకీయ ధోరణులు జనంలో ఇంకా ముదిరి పాకాన పడటం 2016, నవంబర్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ తొలిసారి గెలుపునకు దారితీసింది. ట్రంప్ 2024 చివరలో రెండోసారి విజయం సాధించడానికి ఆరు నెలల ముందు నుంచే అమెరికా వర్సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఇంత జరుగు తున్నా అమెరికా ప్రజల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరే కంగా ఆగ్రహావేశాలు అంతగా వ్యక్తం కావడం లేదు.
వియత్నాం యుద్ధ కాలం నాటి ప్రజాస్వామిక స్పృహ జనంలో కనిపించడం లేదు. యూదు జాత్యహంకారానికి వ్యతిరేకంగా రావాల్సినంత వ్యతిరేకత రావడం లేదు. అంటే అమెరికన్లు మార్పును వ్యతిరేకించే అభివృద్ధి నిరోధకులుగా మారిపోయారా?
ఎంఐటీలో సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణులపై పోరాడే భావనలు ప్రచారం చేసే ‘రిటెన్ రివెల్యూషన్’ అనే విద్యార్థి సంస్థలో చురుకుగా పనిచేసే మేఘా వేమూరి వంటి స్థానిక విద్యార్థులు ఎంతమంది తమ వర్సిటీల వేదికలపై ఎంతకా లం పోరాడితే అమెరికాలో ప్రజాస్వామిక విలువలు మళ్లీ వేళ్లూనుకుంటాయో కాలమే నిర్ణయిస్తుంది.
నాంచారయ్య మెరుగుమాల ఆర్థిక వృద్ధిపై డంబాలు బడేభాయ్ నుంచి ఛోటేభాయ్ ట్రిలియన్ ఎకానమీ మంత్రాన్ని పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ కోసం ఇటు రాయి దీసి అటు పెట్టని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం బడాయి బాబు ఎచ్చులను బలాదూర్ చేసేలా ఉంది. రాష్ర్టాన్ని పదేండ్లలో లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకువెళ్తామని ఆయన అంటున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసి తెలంగాణను సమున్నతంగా నిలబెడితే, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా అంచుకు చేరుకున్నది. బీఆర్ఎస్ నేతృత్వంలో రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అతలాకుత లం చేసింది. జీఎస్డీపీ, తలసరి వృద్ధిరేటు నానాటికీ తీసికట్టవుతుండటమే నిదర్శనం. కాలు మోపిన నాడే తెలుస్తుంది కాపురం చేసే కళ అన్నట్టు రాష్ర్టాన్ని ఏడాదిన్నర కాలంలో అధోగతి పాలు చేసి, ఇప్పుడేమో అందలమెక్కిస్తామని ఊరిస్తున్నారు. పాలన వైఫల్యాల నుంచి, హామీల ఎగవేత నుంచి ప్రజల దృష్టి మరల్చడమే ఈ ఆడంబరపు మాటల వెనుకనున్న అసలు ఉద్దేశం అని తెలిసిపోతూనే ఉన్నది.
కేసీఆర్ హయాంలో 2023-24 జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ 3వ ర్యాంకుకు ఎదిగితే, కాంగ్రెస్ పాలనలో ఏడాది కాలంలోనే 14కు దిగజారింది. ఇక తలసరి ఆదాయంలో రాష్ర్టాన్ని కేసీఆర్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడితే రేవంత్ సర్కారు దాన్ని 11వ స్థానానికి పడగొట్టింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ సర్కార్ అప్పుచేసి పప్పుకూడు దారిలో పబ్బం గడుపుకొంటున్నది. అప్పులు పుట్టడం లేదని ఇల్లెక్కి కూసిన ఘనతను దక్కించుకున్నారు సీఎం రేవంత్. అందరూ తలో చేయి వేయమని తన చేతకానితనాన్నీ చాటుకున్నారు. ఇప్పుడాయనే అద్దంలో చందమామను చూపిస్తున్నారు. తెలంగాణను అన్నిరంగాల్లో దిగదుడుపు చేసి రేపు ఎప్పుడో నంబర్ వన్ చేస్తానని డాంబికాలు పలుకుతున్నారు. ఉన్నది ఊడగొట్టి లేనిది తెస్తానని అంటున్నారు. ఆస్తుల కల్పన జరగడం లేదు. సంపద పెంచడం రాదు. పంచడం అసలే రాదు. ఆ మాటకు వస్తే ఆర్థికవ్యవస్థ పనితీరు సరిగా అర్థమైందా? అంటే అదీ సందేహాస్పదమే. అడ్డగోలుగా దంచిన హామీలను అటకెక్కించి, ప్రజలకు తక్షణావసరమైన సంక్షేమాన్ని పండబెట్టి ఏం అభివృద్ధి సాధిస్తారో, ఎవరి జేబులు నింపుతారో తెలియదు. ఆర్థికవ్యవస్థ పరిమాణం గురించి ఊదరగొట్టడం సరే, అందులో సామాన్యుడికి ఒరిగేదేమిటో చెప్తే బాగుండేది.
జూన్ 2 ప్రసంగంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ విజయాలంటూ ముఖ్యంగా రెండు పచ్చి అబద్ధాలను వల్లించారు. ఒకటి, ఏడాదిన్నర కాలంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చారట. రెండు, రైతులకు రుణమాఫీ ఉపశమనం కల్పించారట. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే, కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకటి కేసీఆర్ ప్రక్రియ అంతా పూర్తిచేస్తే, ఆ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకోవడం నైతికంగా దిగజారుడుతనం కాక మరేమిటి? ఇక అరకొరగా జరిగిన రుణమాఫీని ‘ప్రభుత్వ విజయమని’ చెప్పుకోవడం ఏమిటి? రైతులను అడిగితే తెలుస్తుంది ఆ బండారం!
-నాంచారయ్య మెరుగుమాల