అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు నీటి మూటలేనని తేలిపోయింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను కూడా మోసగించిం ది. అమరుల కుటుంబానికి ఒక ఉద్యోగం, నెలకు రూ.25 వేల గౌరవ పెన్షన్, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవభృతి, సంక్షేమ చర్యలు చేపడుతామని మ్యానిఫెస్టోలో తెలిపింది. కానీ ముప్పై నెలలు పూర్తవుతున్నా అమలులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇది రాష్ట్రప్రజల విశ్వాసానికి గట్టి దెబ్బ.
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీలు, ఉపకమిటీలు, అఖిలపక్ష సమావేశాలు, అభిప్రాయ సేకరణలు అంటూ కాలం గడుపుతున్నది. ఉద్యమకారులకు అవసరమైనవి కమిటీలు కాదు, నిర్ణయాలు. ప్రభుత్వం ఒకవైపు అందరికీ ఇవ్వలేం అంటున్నది. మరోవైపు ఉద్యమకారుల ఎంపికకు స్పష్టమైన విధానం ప్రకటించడం లేదు. అయితే మొదట గుర్తింపు రావాల్సింది అమరవీరుల కుటుంబాలకు. ఆ తర్వాత జైళ్లలో నెలల తరబడి ఉన్నవారికి, పోలీసు కేసులు ఎదుర్కొన్నవారికి, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కోల్పోయిన విద్యార్థులకు, ఉద్యమంలో జీవితాన్ని అంకితం చేసిన కవులు, కళాకారులు, జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, ఒక్కరేమిటి అన్ని వర్గాలు తమ వృత్తిని వదిలి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా హామీలు అమలు చేస్తామని చెప్పడంలో చిత్తశుద్ధి కనిపించడంలేదు.
ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. చట్టబద్ధ అధికారాలతో కూడిన కమిషన్ ఏర్పాటు చేయాలి. ఉద్యమకారుల సంక్షేమ కార్పొరేషన్ స్థాపించి, ప్రతి ఏడాదీ ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. అమరవీరుల కుటుంబాలకు గౌరవ పెన్షన్, విద్య, వైద్యం, ఉపాధి, గృహ భరోసా కల్పించాలి. విద్యార్థి ఉద్యమకారులకు ఉపాధి అవకాశాలు, వడ్డీ రహిత రుణాలు, పరిశ్రమల స్థాపనకు హామీ ఇవ్వాలి. కె.కేశవరావు కమిటీని కాలయాపన వేదికగా కాకుండా చట్టబద్ధ అధికారాలతో కూడిన కమిషన్‌గా మార్చాలి. తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో గౌరవించి, వారి సంక్షేమాన్ని ప్రభుత్వ శాశ్వత బాధ్యతగా స్వీకరించాలి.
అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి 611 మందికి ఉద్యోగాలు కల్పించి ఆర్థిక సహాయం చేసింది. ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేసిన కళాకారులకు 550 ఉద్యోగాలు కల్పించింది. సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చింది. చాలామందికి రాజకీయ పదవులు ఇచ్చింది. కానీ ప్రజలను, ఉద్యమకారులను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ఉద్యమ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న మేం కేశవరావు కమిటీకి పలు సూచనలు చేశాం. 1969 ఉద్యమం నుంచి 2014 వరకు వివిధ రూపాలలో మరణించిన వారి జాబితా తయారు చేయాలి. ఉద్యమకారుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ. 25,000 పెన్షన్, గృహ వసతి కల్పించాలి. ఉద్యమంలో జైలుకు వెళ్లిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిర్బంధాల వలన వైకల్యం లేదా ఇతర సమస్యలు తలెత్తి, ఇబ్బందులు పడుతున్న వారికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
సకలజనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, వారికి నాయకత్వం వహించిన సంఘాల బాధ్యులకు ప్రభుత్వ కార్యక్రమాలలో తగిన గౌరవం కల్పించాలి. ముఖ్యంగా ఆగస్టు 15, జనవరి 26, జూన్ 2 వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి దాటిన వారికి, విద్యార్హతలు లేని వారికి ప్రభుత్వం రుణాలు ఇప్పించాలి. వివిధ వ్యాపారాలలో స్థిరపడే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. భారత ప్రభుత్వం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి పెన్షన్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నది. వాటిని పరిశీలించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి న్యాయం జరిగేలా కృషి చేయాలి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి సమకూర్చిన సంక్షేమాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి. చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు కేటాయించాలి.
ఉద్యమకారుల సంక్షేమం నిరంతర ప్రక్రియగా ఉండాలి. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులకు వైద్య సదుపాయం కల్పించాలి. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమంపై విషం చిమ్ముతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వాలి, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేసి ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలి. భారత స్వాతంత్య్ర సమరయోధులకు కల్పించిన తరహాలోనే తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్ని సంక్షేమ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలి.