నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ మట్టిగడ్డ తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ, సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన జీవితం తెలంగాణకే స్ఫూర్తిదాయకం. తన జీవితాంతం రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్ సార్..
ఏడున్నర దశాబ్దాల తన జీవితానుభవం, ఆరు దశాబ్దాల ఉద్యమ చైతన్యం నేర్పిన పాఠాలతో ఎలాంటి సమస్య వచ్చినా, దాన్ని తేలికగా పరిష్కరించే ఆలోచన గల మహా మనీషి జయశంకర్ సార్. తెలంగాణ ఎందుకు కావాలి? అన్న ప్రశ్నకు పండితులతో పాటు పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన, వ్యావహారిక భాషలో వేలాది సభల్లో, సమావేశాల్లో కోట్లాది మందికి అర్థమయ్యేటట్టు, పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పిండ్రు. ఆయన ప్రతి మాట ఉద్యమానికి ప్రేరణ కలిగించింది. జయశంకర్ సార్ చూడడానికి సాదాసీదాగా కనిపించేవారు. కానీ, ఆయనది గంభీర స్వరం.
ప్రతి సభలోనూ ఉద్యమ నేత కేసీఆర్ మాట్లాడకముందే తొలుత జయశంకర్ సార్… పుస్తకానికి ముందుమాట వలె ఆక్సిజన్ లాంటి మాటలను ముచ్చట రూపంలో అందించేవారు. ఆ తర్వాతే కేసీఆర్ భావోద్వేగాలతో మాట్లాడేవారు. జయశంకర్ సార్ మాటల ప్రాధాన్యం ఏపాటిదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. మేధావులతో పాటు సామాన్య జనం సైతం అర్థం చేసుకునే విధంగా సమాజ చైతన్యానికి జయశంకర్ సార్ ఊపిరులూదిండ్రు. సప్రమాణమైన చర్చ, కచ్చితమైన తర్కమే తప్ప, వితండ వాదం చేసేవారు కాదు.
ఆయన భావన ఎంత స్పష్టం గా ఉంటదో వ్యక్తీకరణ కూడా అంతే స్పష్టంగా ఉంటది. నాడు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కాబట్టి, ఉర్దూను ఒక మతానికి సంబంధించిన భాషగా ఎవరైనా అంటే సహించేవారు కాదు. ‘అది తెలంగాణ ప్రజల భాష’ అని తెలియజెప్పేవారు. నిజానికి ఉర్దూలో ఆలోచించి, ఆంగ్లంలో అర్థం చేసుకుని తెలుగు భాషలో ఆయన మాట్లాడేవారు. ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం దగ్గరనుంచి తెలంగాణ సిద్ధించే చివరి సంఘటనల వరకు జయశంకర్ సార్ జీవితం ప్రతి అంశానికి దగ్గరగా ముడివేయబడింది.
1952లో అయ్యదేవర కాళేశ్వరరావు ‘ఆంధ్ర -తెలంగాణ’ విలీన ప్రతిపాదన తెచ్చినప్పుడు జయశంకర్ సార్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ‘మీరు యువకులు. ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉండజాలదు. మనుగడ సాగించలేదు. ఆంధ్రతో కలిస్తేనే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయి’ అని కాళేశ్వరరావు చెప్పగా, దానికి ప్రతిఘటనగా ‘మేము అడుక్కుతినైనా బతుకుతం కానీ, ఆంధ్రులతో సోపతి చేయం’ అని సార్ కరాఖండిగా చెప్పిండ్రు. ఓపాలి… 1969లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ‘నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే ఉద్యోగం నుంచి తీసివేయగలను’ అని జయశంకర్ సార్ను బెదిరించారు. మన సారు ఏ మాత్రం జంకకుండ ‘నీ బల్ల మీద పేపర్ ఉంది, జేబులో పెన్ను ఉంది. వెంటనే ఆ పని చేయండి’ అని సవాల్ విసిరిండ్రు.
ఆ మాటలు విన్న బ్రహ్మానందరెడ్డి నోరెల్లబెట్టిండు. అంటే సారు ఎంత ధైర్యవంతుడో, ఆయనకు ఎంతటి ఎదిరించే స్వభావం ఉన్నదో నేటితరం అర్థం చేసుకోవచ్చు. ఎంతో నెనరు గల్ల మనిషి గనుకనే బతుకంతా తెలంగాణ దుఃఖా న్ని, గోసను గుండెల నిండ నింపుకుండ్రు. అదే ఒరవడితో ప్రజలను చైత న్యం చేసిండ్రు. ఎన్నాళ్లకైనా తెలంగాణ వచ్చి తీరుతుందని, దానికి రాజకీయ ప్రక్రియ ముఖ్యమని ప్రజలను కార్యోన్ముఖులు చేసిండ్రు.
జయశంకర్ సారు చదివింది అర్థశాస్త్రం అయినప్పటికీ, ఆయనకు తెలుగు సాహిత్యంపై సంపూర్ణ అవగాహన ఉండేది. ఎన్నో సాహిత్య ఘటనలను, కవిత్వాన్ని, పద్యాలను, కవులను అలవోకగా ఉటంకిస్తూ ఈ విషయాలన్నీ వివరించేవారు. ‘తౌరాక్యాంధ్రము’ పేరిట తెలంగాణలోని తెలుగును జంధ్యాల పాపయ్య శాస్త్రి లాంటి కవి పండితులు అవమానిస్తే, వారితో వాదనకు దిగి దీటుగా ఓడించారు మన జయశంకర్ సార్. తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు అవమానించినా, హేళన చేసి మాట్లాడినా సారు ఊరుకునేటోడు కాదు. దీటైన జవాబు చెప్పిన ఘటికుడాయన. తెలంగాణ కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన మహనీయుడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సారు ప్రత్యక్షంగా చూడలేకపోయిండ్రు. కానీ, ఆయన రాసిన ప్రతి అక్షరం, చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు సమగ్రంగా ఇప్పుడిప్పుడే అక్షరబద్ధమై ప్రజలకు చేరువవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లోకి తీసుకురావడం, ఓ విశ్వవిద్యాలయానికి, ఓ జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టడం, ఏటా ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తన మార్గంలో పయనించడమే మనందరి ముందున్న ఏకైక లక్ష్యం. ఇదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి.
(నేడు జయశంకర్ సార్ జయంతి)
– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి 94415 61655