ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన ఉక్రెయిన్ పర్యటనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయి స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత భారత ప్రభుత్వాధినేత ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా రెండేండ్లకు పైగా భీకర యుద్ధం జరుపుతున్న సంగతి తెలిసిందే. మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నట్టుగానే కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోదమర్ జెలెన్స్కీని మోదీ కావలించుకున్నారు. యుద్ధం వల్ల అష్టకష్టాలు పడుతున్న ఉక్రెయిన్ ప్రజలకు సానుభూతి తెలిపారు. యుద్ధం ద్వారా ఏ సమస్యా పరిష్కారం కాదని హితవచనం పలికారు. ప్రధాని మోదీ తన పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరుగుపయనమైన కొద్దిసేపటి తర్వాత జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రెండు దేశాల సంబంధాల్లో ఏర్పడిన అగాధాన్ని ఇది సూచిస్తున్నది.
మన దేశానికి చైనాతో గల సరిహద్దు వివాదాన్ని జెలెన్స్కీ మీడియా సమావేశంలో పరోక్షంగా ప్రస్తావించడం అభ్యంతరకరమే. ఉక్రెయిన్‌పై పుతిన్ దాడి చేయడం సరైనదే అయితే మరోచోట చైనా చేసేదీ సబబే అవుతుందన్నట్టుగా జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు భారత్‌కు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావు. ప్రస్తుతం ఎడతెగకుండా కొనసాగుతున్న యుద్ధానికి పరిష్కారం కనుగొనడంలో భారత్ పాత్ర అంతంత మాత్రమేనని కూడా జెలెన్స్కీ తేల్చిచెప్పారు. యుద్ధంలో రెండు వైరి పక్షాలను ఏకకాలంలో మెప్పించడం దుస్సాధ్యమని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది. గత నెల మాస్కోలో పుతిన్‌ను మోదీ కావలించుకున్న సమయంలోనే ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనేకమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంలోనూ జెలెన్ స్కీ భారత్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది.
2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలుపెట్టిన ప్పుడు పశ్చిమదేశాలు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం రష్యా నుంచి దిగుమతులు పెంచి ఆంక్షలను బేఖాతరు చేసిం ది. పశ్చిమదేశాలు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వెలివేసిన రష్యా నుం చి భారత్ పెద్దఎత్తున చమురు చౌకగా దిగుమతి చేసుకుంటున్నది. గత జూలై నాటికి చైనాను దాటేసి అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ నిలవడం విశేషం. భారత్‌లోని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఈ దిగుమతుల ద్వారా భారీగా లబ్ధి పొందుతున్నాయనే ఆరోపణలున్నాయి. సహజంగానే ఉక్రెయిన్ యుద్ధరంగంలో తమ శత్రువైన రష్యాకు సన్నిహిత మిత్ర దేశమైన భారత్ ఆపన్నహస్తం అందించడంగానే దీన్ని చూస్తున్నది. జెలెన్స్కీ కటువైన మాటల్లో ఇది విస్పష్టంగా వ్యక్తమైంది. తదుపరి శాంతి శిఖరాగ్రసభ భారత్‌లో జరిగితే బాగుండునని ఆయన సూచించడం ఆలోచించాల్సిన విషయం. మాజీ సోవియట్ రిపబ్లిక్ల విషయంలో భారత్ తన దౌత్య విధానాలను పునఃపరిశీలించుకోవాలని ఉక్రెయిన్ సమస్య తెలియజేస్తున్నది. చిత్తశుద్ధితో సమదూరం పాటిస్తూ, నిజమైన అలీన విధానం అవలంబిస్తేనే శాంతికాముక దేశంగా భారత్ పేరు సార్థకమవుతుంది.