బీజేపీ ఏలుబడిలో సాయుధ నక్సల్స్‌ను అంతమొందించినా ఇంకా దేశంలో మేధో నక్సల్స్ పొంచి ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నారు. ఎనభయ్యో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ఇలాంటి మేధావులను ‘దిమాగీ నక్సల్స్’ అని మోదీ వర్ణించడం వింతగా లేదు. కాషాయ సిద్ధాంతాలు, బీజేపీ పోకడలను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థులు, ఆలోచనాపరులను ఆయన గతంలో ‘అర్బన్ నక్సల్స్’ అని దూషించారు. ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నారు.
కొన్ని దశాబ్దాలుగా అడవుల నుంచి పోరు సాగిస్తూ ఇటీవల దాదాపు అంతరించిన సాయుధ నక్సల్స్ గురించి మనకు తెలుసు. పౌర సమాజంలో నివసిస్తూ సర్కార్ విధానాలను విమర్శించేవారు, ప్రతిఘటించే కార్యకర్తలు, నేతలను ‘అర్బన్ నక్సల్స్’ అంటూ నిందించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. అసలు ‘అర్బన్ నక్సల్’ అంటే ఏంటని పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను గతంలో ప్రశ్నించగా, ఈ పదానికి ఎలాంటి చట్టపరమైన నిర్వచనం లేదని జవాబిచ్చారు. కేంద్ర హోం శాఖ కూడా ‘అర్బన్ నక్సల్’ అనే మాటలను వాడదని ఆరేండ్ల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తృణమూల్ సభ్యుడొకరు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వామపక్ష భావజాలం ఉన్నవారిని లేదా పన్నెండేండ్లుగా కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్న వారందరినీ ‘అర్బన్ నక్సల్స్’ అని దూషించడం బీజేపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలకు ఆనవాయితీగా మారింది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా ఇటీవల ఢిల్లీ జంతర్‌మంతర్‌లో యువకులు, విద్యార్థుల ఆందోళనతో మోదీ సర్కార్ వారి డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోని ప్రధాని తన ప్రభుత్వాన్ని విమర్శించే వారిని దూషించడానికి, వేధించడానికి ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ అనే కొత్త మాటను కనిపెట్టారు.
196974 మధ్యకాలంలో నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ తానో గొప్ప ప్రగతిశీల పాలకురాలిగా మాట్లాడేవారు. తన సర్కార్ పోకడలను విమర్శించే వారిని అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలురుగా, దాని గూఢచార సంస్థ సీఐఏకు తొత్తులుగా అభివర్ణించేవారు. ప్రతిపక్ష నేతలను ఇలా దూషించడం నాటి కాంగ్రెస్ నేతలకు కొట్టినపిండి. దాంతో అప్పటి స్వతంత్ర పార్టీ నేత, ప్రఖ్యాత పార్లమెంటేరియన్ పిలూ మోదీ 1970 ఆరంభంలో ఒకరోజు ‘నేను సీఐఏ ఏజెంటు’ను అని రాసిన అట్టను తన కట్టుకుని పార్లమెంటులో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మోదీ ప్రసంగం విన్నాక తానూ ‘దిమాగీ నక్సల్’నేనని ప్రకటించారు. యూపీఏ పాలనలో కేంద్ర హోంమంత్రిగా దేశవ్యాప్తంగా నక్సలైట్ల ఏరివేతకు, వారి సానుభూతిపరులను వేధించడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) తీసుకురావడంలో చిదంబరంది కీలక పాత్ర. దేశానికి అత్యంత తీవ్ర ముప్పు వామపక్ష తీవ్రవాదం నుంచే ఎదురవుతున్నదని ప్రకటించిన యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు.
మోదీ మాటలను ఎగతాళి చేస్తూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ కూడా తాను కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని నిలబెట్టే 370వ అధికరణకు అనుకూలం కాబట్టి తాను కూడా ‘దిమాగీ నక్సల్’నేనని ప్రకటించడం విశేషం. చివరికి బిహార్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్ కూడా ఈ విషయంలో ప్రధానిని ఎద్దేవా చేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ‘ఎవరు మేధో నక్సలైటో, ఎవరు కాదో తేల్చి చెప్పడానికి మోదీ అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నారు. మోదీ దేశవ్యాప్తంగా పర్యటించి ‘దిమాగీ నక్సల్స్’ను గుర్తించి పట్టుకోవాలి. అసలు ‘దిమాగీ నక్సల్స్’ పెద్ద సంఖ్యలో ఆయన పార్టీ బీజేపీలోనే కనిపిస్తారు’ అని తేజ్ ప్రతాప్ చమత్కరించారు.
‘దిమాగ్’ అంటే హిందీలో మెదడు అనే విషయం తెలిసిందే. మెదడుతో ఆలోచిస్తూ పాలకుల అప్రజాస్వామిక, అవినీతితో కూడిన విధానాలను ఎండగడితే అలాంటి నాయకులు, మేధావులు, కార్యకర్తలు, సామాన్య పౌరులందరినీ ‘దిమాగీ నక్సల్’ అనే ముద్రతో వారిని సమాజం నుంచి వేరుచేయాలని సాక్షాత్తూ ప్రధాని కోరడం అవాంఛనీయమేగాక ప్రమాదకరం. నక్సలిజం వల్ల గతంలో ఎంతోమంది యువకుల భవిష్యత్తు దెబ్బతిన్నదని చెప్పిన ప్రధాని ఇప్పుడు యువత ‘వికసిత భారతం’ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
అమెరికాలో స్థిరపడిన భారతీయుడు, వెబ్ ఆధారిత ఉచిత మెయిల్ సేవల సంస్థ హాట్‌మెయిల్ స్థాపకుడు సబీర్ భాటియా ప్రధాని మాటకు స్పందిస్తూ, ‘దిమాగీ నక్సల్స్’ అంటే ‘బుద్ధిజీవులు’ అనే అర్థంలో ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. 1970, ముఖ్యంగా 1980 ఆరంభంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా తన సర్కార్ విధానాలను తప్పుపడుతూ మాట్లాడేవారిని దేశద్రోహులుగా, విదేశీ శక్తుల తొత్తులుగా దూషించిన సంగతి పాతతరం పౌరులకు ఇంకా గుర్తుంది. ఆమె తరచూ ఉచ్చరించిన ‘విదేశీ హస్తం’ ఇంకా జనం మనసుల నుంచి అదృశ్యం కాలేదు.
తనను విమర్శించే ప్రతిపక్ష నేతలు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై ఆమె విరుచుకుపడేవారు. ఇలాంటివారి నుంచి దేశ సమగ్రతకు, ఐక్యతకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆమె నిప్పులు చెరిగేవారు. నియంతృత్వ, ఆధిపత్య, పెత్తందారీ ధోరణుల్లో మోదీకి ఆదర్శం ఇందిరమ్మేనని 2014 నుంచీ బీజేపీ ఏలుబడి చూస్తున్న పౌరులకు అర్థమౌతున్నది. ఎర్రకోట నుంచి ‘దిమాగీ నక్సల్స్’ అంటూ ప్రధాని మోదీ చేసిన హెచ్చరిక కూడా ప్రజల్లో బీజేపీ పాలకులను పలుచన చేయడానికి మాత్రమే ఉపకరిస్తుంది.
నాంచారయ్య మెరుగుమాల