ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత, క్లిష్టకాలంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. క్లిష్టకాలంలో ఉన్నది. ఉనికిని కోల్పోతున్న పాలస్తీనాదా? దాన్ని ఆక్రమించి పాలస్తీనీయులపై అమానవీయ హింసకు పాల్పడిన ఇజ్రాయెల్‌దా? 1517లో పాలస్తీనాను ఒట్టొమాన్ రాజ్యం స్వాధీనపర్చుకున్నది. 1917లో దాన్ని బ్రిటన్ జయించింది. పాలస్తీనాను ఆంగ్ల, అరబ్ భాషల్లో పాలస్తీనా అని, పక్కనే హిబ్రూ భాషలో ఎరెట్జ్ యిజ్రాయెల్ అని రాసేవారు. 1917 నుంచి 1948 వరకు పాలస్తీనాలో బ్రిటిష్ వారి పాలన సాగింది. పాలస్తీనాలో అరబ్బులు, యూదులు, క్రైస్తవులు నివసించేవారు.
‘ఇజ్రాయెల్ మిగిలిన మా భూభాగాలనూ ఆక్రమిస్తోంది. మా ప్రజలను చంపుతోంది. మమ్ములను రెచ్చగొడుతోంది. అందుకే ఈ దాడి చేశాం’ అని హమాస్ తమ దాడిని సమర్థించుకుంది. గాజాపై తన భారీ హింసాత్మక దాడులు, హమాస్ దాడికి ప్రతీకారమని ఇజ్రాయెల్ సమర్థించుకోవచ్చు. కానీ అది ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
మొదటి ప్రపంచయుద్ధంలో యూదుల మద్దతు కో సం వారికి ప్రత్యేక రాజ్యం ఇస్తామని తన విదేశాంగ కార్యదర్శి ఆర్థర్ జేమ్స్ బాల్ఫోర్ మద్దతుతో ‘బాల్ఫోర్ ప్రకటన’ ద్వారా బ్రిటన్ వాగ్దానం చేసింది. 1939-1945 మధ్య జర్మనీ నియంత హిట్లర్ ఆజ్ఞలతో నాజీలు 60 లక్షల మంది యూదులను చంపారు. వారిలో 15 లక్షల మంది పిల్లలున్నారు.19వ శతాబ్దం చివర మొదలైన యూదు జాతీయవాదానికి నాజీ యూదు మారణకాండ తోడైంది. తమకు ప్రత్యేక దేశం కావాలన్న కోరిక యూదుల్లో బలపడింది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బతికి బట్టకట్టిన ఐరో పా దేశాల యూదులు పాలస్తీనాకు వచ్చారు. 1947, ఏప్రిల్ 2న నాటి బ్రిటన్ కోరిక మేరకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ సభ 1947, నవంబర్ 29న 181వ తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటన్ అధీన పాలస్తీనాను 1948, మే 14న యూదు (ఇజ్రాయెల్), అరబ్ (పాలస్తీనా) దేశాలుగా విభజించడం ఆ తీర్మాన సారాంశం. ఈ తీర్మానాన్ని అమెరికా, బ్రిటన్, సోవియెట్ యూనియన్లు సమర్థించాయి. అరబ్ దేశాలు తమ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించాయి. అరబ్ దేశాల వ్యతిరేకతకు భయపడ్డ అమెరికా ఈ తీర్మానానికి తన మద్దతును ఉపసంహరించుకున్నది. ఈ విభజనతో రెండు మత దేశాలు స్థాపించబడ్డాయి. దీన్ని మన ప్రధాని నెహ్రూ వ్యతిరేకించారు. ఐరాసలో తీర్మానానికి భారత ప్రతినిధి విజయలక్ష్మి పండిత్ వ్యతిరేకంగా ఓటేశారు.
ఈ ఐరాస తీర్మానం యూదులకు మోదాన్ని, అరబ్బులకు ఖేదాన్ని కలిగించింది. అది అంతర్యుద్ధానికి దారితీసింది. యూదు ప్రజా మండలి నాయకుడు డేవిడ్ బెన్ గురియన్ 1948, మే14న ఇజ్రాయెల్ దేశ స్థాపనను ప్రకటించారు. విభజన తీర్మానానికి మద్దతు ఉపసంహరించుకున్న అమెరికా అధ్యక్షుడు హారి ఎస్. ట్రూమన్ అదే రోజు ఆ కొత్త దేశాన్ని గుర్తించారు. సోవియెట్ నాయకుడు స్టాలిన్ ఆ పనే చేశారు. అరబ్ దేశాలు ఈ విభజనను తిరస్కరించాయి. 1948 నుంచి 1967 వరకు పాలస్తీనా భాగాలైన వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసాలెం లను జోర్డాన్, గాజా స్ట్రిప్ (భూభాగం) ను ఈజిప్ట్ పాలించాయి. మూడేండ్లలో 6 లక్షల మంది ఐరోపా దేశాల యూదులు పాలస్తీనాకు వచ్చారు. ఐరాస నిర్ణయించిన దాని కంటే 20 శాతం ఎక్కువ భూ భాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తర్వాతికాలంలో అత్యధిక పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఐరాస మధ్యవర్తిగా స్వీడిష్ దౌత్యవేత్త కౌంట్ ఫోల్కే బెర్నడొట్టె చేసిన శాంతి ప్రణాళికను ఇరు పక్షాలు ఆమోదించలేదు. 1948 సెప్టెంబర్‌లో లేహి తీవ్రవాదులు ఆయనను హత్యచేశారు. 1949 ఎన్నికల తర్వాత సనాతన యూదు మతవాద పార్టీల మద్దతుతో బెన్ గురియన్ తిరిగి ప్రధాని అయ్యారు. ఈ రోజుకు 135 ఐరాస సభ్య దేశాలు గుర్తించిన పాలస్తీనాను ఇజ్రాయెల్ గుర్తించలేదు. ఇజ్రాయెల్‌కు అతి దగ్గరి మిత్ర దేశాలలో ఐరాసను నియంత్రించే అమెరికా ప్రధానమైనది.
పాలస్తీనా-ఇజ్రాయెల్ సంఘర్షణకు రెండు-దేశాల పరిష్కారాన్ని వర్తింపజేయడమే ఏకైక మార్గం. అంటే యూదులకు ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలకు పాలస్తీనా. ఇజ్రాయెల్ ప్రభుత్వం తరుఫున ప్రధాని ఇట్జక్ రాబిన్, పాలస్తీనా విమోచన సంస్థ పక్షాన మహమ్మద్ అబ్బాస్, అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో 1993, సెప్టెంబర్13న ఓస్లో ఒప్పందంలో భాగంగా దీన్ని అంగీకరించి, సంతకాలు చేశారు. 1948-49 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో మధ్యప్రాచ్యంలో చిన్న భూభాగమైన పాలస్తీనాలో అనేకులు చనిపోయారు.చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. పిల్లలు అనాథలయ్యారు, లేదా చంపబడ్డారు. ఈ హింసను ఆపడానికి అంతర్జాతీయ సమాజం నిజాయితీగా కృషిచేయాలి.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై చైనా వైఖరి ఇదేనని, మధ్యప్రాచ్య సమస్యపై చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జై జున్ ఈ నెల 10 న ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికి చెప్పారు. గాజా భూభాగంలో ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మధ్య జరిగిన పోరులో ఇప్పటికే 2,100 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. దీనిపై ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పాలస్తీనా శాఖ సహాయ మంత్రి ఒసామా ఖేదర్తో ఫోన్లో మాట్లాడుతూ జై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు హానిచేసే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని, ఖండిస్తున్నదని, తక్షణం కాల్పుల విరమణకు పిలుపునిస్తోందని జై చెప్పారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ప్రధాన దేశాలు, ఇజ్రాయెల్, పాలస్తీనాలు శత్రుత్వాన్ని విరమించుకునేట్టు ఒప్పించాలి.
ఇజ్రాయెల్ ఏర్పాటు నుంచి నేటి వరకు పాలస్తీనా ఉనికినే గల్లంతు చేయటానికి ఇజ్రాయెల్ అనేక దుర్మార్గాలకు పాల్పడింది. ఈ హింసకు హెచ్చరిక ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 7న హమాస్ దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ భూభాగాలపై దాడికి పాల్పడింది. వందలాది ఇజ్రాయెల్ పౌరులను చంపింది. ‘ఇజ్రాయెల్ మిగిలిన మా భూభాగాలనూ ఆక్రమిస్తోంది. మా ప్రజలను చంపుతోంది. మమ్ములను రెచ్చగొడుతోంది. అందుకే ఈ దాడి చేశాం’ అని హమాస్ తమ దాడిని సమర్థించుకుంది. గాజాపై తన భారీ హింసాత్మక దాడులు, హమాస్ దాడికి ప్రతీకారమని ఇజ్రాయెల్ సమర్థించుకోవచ్చు. కానీ అది ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య దాడి, ఎదురుదాడుల కారణంగా, రెండువైపులా ప్రజలు నిరంతరం భయంతో బతుకుతున్నారు. 75 ఏండ్ల హింస తర్వాత శాంతిని ఆశించలేరు. ఇజ్రాయెల్ ప్రజలను చంపడం, లేదా క్షిపణులను ప్రయోగించటం వల్ల వారికి శాంతిభద్రతలుండవని పాలస్తీనా తీవ్రవాదులు, ముఖ్యంగా హమాస్ గ్రహించాలి.
ఇజ్రాయెల్ సైన్యం ఎంత బలంగా ఉన్నా, అది స్వల్ప ఘటనలను, కారణాలను రెచ్చగొట్టే చర్యలుగా భావించరాదు. వెస్ట్ బ్యాంక్, గాజాలలోని పాలస్తీనా భూభాగాలపై క్షిపణులతో దాడిచేయడం, మరింత పాలస్తీనా భూమిని ఆక్రమించడం మానుకోవాలి. రెండు-దేశాల మధ్య సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం కృషిచేయాలి. ఇజ్రాయెల్ వైపు నిలుస్తున్న మన పాలకులు ప్రపంచ పటంలో స్థానం కోల్పోతున్న పాలస్తీనాకు అండగా నిలబడాలి. దాన్ని మింగిన ఇజ్రాయెల్ కొమ్ముకాయరాదు.
(వ్యాసకర్త: ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి )
-సంగిరెడ్డి హనుమంత రెడ్డి
94902 04545