ఈ రోజు దేశం ఉద్విగ్నభరిత క్షణాల్ని అనుభవిస్తున్నది, ఓవైపు పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఊచకోతకు యావత్ భారతం రగిలిపోయి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్నది. దానికి ప్రతీకారంగా పాక్ మనదేశ సామాన్య పౌరులపై చేస్తున్న దాడులకు మన భద్రతా దళాలు దీటుగా బదులిస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌లో మాత్రం మరో విభిన్న వాతావరణాన్ని కల్పించాలని ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
అందాల పోటీలతో హైదరాబాద్ నగరానికి విశ్వవ్యాప్త ప్రచారం లభిస్తుందనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. ఎందుకంటే యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇండో-పాక్ ఘర్షణల మీద మాత్రమే ఉంది. పహల్గాం ఉగ్ర దాడి బాధిత మహిళల ఆక్రందనలకు సమాధానాన్ని యావత్ ప్రపంచం ఇప్పుడు ఆశిస్తున్నది. ఆపరేషన్ సిందూర్ మాత్రమే మహిళల నుదుటి సిందూరమై వెలుగుతుంటే ఈ అందాల పోటీల ప్రభలు మసకబారుతాయని చెప్పక తప్పదు. ప్రజా భద్రతా కోణంలో ఏకంగా ఐపీఎల్ మ్యాచ్‌లే నిరవధికంగా వాయిదా పడ్డాయి. కానీ ఇక్కడి మన పాలకులకు మాత్రం అందాల పోటీలే ముద్దయ్యాయి.
ఈ పోటీలు కళారంగానికి చేసే మేలు ఏమీ ఉండదు అనేది సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నా నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే గతంలో సుస్మితాసేన్, ఐశ్వర్యారాయ్ లాంటి నటీమణులు ఈ పోటీల నుండి వచ్చి నిలదొక్కుకున్నట్టుగా మిగిలన వారు సక్సెస్ కాలేకపోయారు. కనీసం ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వేటికీ ఈ పోటీలతో ఉపయోగం ఉండదు. పైగా కాస్మోటిక్ కార్పొరేట్ కంపెనీల లాభాలు తప్పు సామాన్య మహిళలకు వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటూ, నిన్నటికి నిన్న మహిళా సంఘాలు గొంతెత్తాయి. మహిళను శారీరక కొలతల ఆధారంగా అంగడి సరుకుగా చూసే ఈ విష సంస్కృతి మన భారతదేశానిది కాదనేది వారి వాదన.
అందాల పోటీలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో జరగరానిది ఏదైనా జరిగి ఈ అంతర్జాతీయ అతిథుల భద్రతకు ఇబ్బంది కలిగితే మాత్రం హైదరాబాద్ ప్రతిష్ట పెరగడం కాదు, అంతర్జాతీయంగా దెబ్బతినే ప్రమాదం సైతం లేకపోలేదు. ఈ దూర దృష్టి ప్రభుత్వానికి లేకపోవడం సగటు పౌరుడిని ఆందోళనకు గురిచేస్తున్నది.
ఈ సమయంలో అసలు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణే ఒక అవివేక నిర్ణయమనేది ఎప్పటినుండో ఉన్న వాదన. కనీసం నేటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీటిని వాయిదా వేయాలనే చిన్న ఆలోచన సైతం నేటి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. ఓవైపు నిత్యం పత్రికలకెక్కి బీద ఆరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి, ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అలవిగానివిగా ఇప్పుడు చెప్తున్నారు. ఓవైపు రైతులకు రైతుబంధు, అవ్వలకు పింఛన్లు, ఆడబిడ్డలకు తులం బంగారం ఎగ్గొడుతున్నారు. మరోవైపు రెక్కాడితేనే కాని డొక్కాడని దినసరి కూలీలు వచ్చిన దాంట్లో పైసా పైసా కూడబెట్టుకొని తమ కార్మిక నిధికి జమచేసుకునే కార్మిక శాఖ నిధుల్ని దాదాపు రూ.200 కోట్ల దాకా అందాల పోటీలకు వినియోగించడం దారుణం. ఇది కార్మికుల ప్రయోజనాల్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడమే. పర్యాటక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి మాత్రం బయటకు కేవలం రూ.54 కోట్లే ఖర్చు అని చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం పేరుతో కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడానికి ఎప్పుటికప్పుడు ఆదేశాలు జారీ అవుతూనే ఉన్నాయి. ఇది మాటలకు చేతలకు మధ్య పొంతన లేని సర్కార్ వైఖరిని తేటతెల్లం చేస్తున్నది.
ఇక నిర్వహణలోనూ ప్రభుత్వ వైఫల్యాలు అడుగడుగునా స్పష్టంగా కన్పిస్తున్నాయి. పోటీలకు సంబంధించిన బాధ్యతల నుంచి వాక్ స్వాతంత్య్ర దుర్వినియోగం పేరుతో, ఎవో అంతర్గత గొడవలను బూచిగా చూపి తప్పించడం ఎలాంటి బాధ్యతాయుత చర్యనో ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఇంకోవైపు పర్యాటక శాఖలో సీనియర్ అధికారుల బదిలీలు, సస్పెన్షన్లు చూస్తుంటే ఈ పోటీల విషయంలో లోపల్లోపల ఏదో జరుగుతున్నదనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఈ పోటీల పేరు చెప్పి తమ అనుయాయులకు ఇచ్చిన కాంట్రాక్టులు, అందులో వారు మేసిన మేతలు సైతం అతిత్వరలోనే బయటకొచ్చేలా కనిపిస్తున్నాయి.
ఇక స్థానిక పర్యాటకం వృద్ధి చెందుతుంది అనే ప్రభుత్వ వాదనకు, వారు చేస్తున్న పనులకు మధ్యన సైతం పొంతన కుదరడం లేదు. ఇంకా పోటీలు మొదలు కాకముందే పోటీదారులను హైదరాబాద్‌లో విహార యాత్రలు చేయిస్తున్నారు. దీని కోసం చార్మినార్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాల్లో భద్రత పేరిట స్థానిక దుకాణాలు మూసివేయిస్తున్నారు. ఇది చిరువ్యాపారులకు తీరని ఇబ్బందిని, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నది. దీనంతటికీ పోటీలను వాయిదా వేయకపోవడమే కారణమని స్పష్టమవుతున్నది.
ఈ లెక్కన ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ నీటిమూటలే అనేది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపై ఉన్న అక్కసుతో ఫార్ములా-ఈ రేసును రద్దు చేయడం ఎంతటి అవివేక చర్యో ఇప్పుడు అందాల పోటీలను నిర్వహించడం సైతం అంతే అవివేకం అనేది మేధావులు చెప్తున్న మాట. ఫార్ములా-ఈ రేస్ మొదటి భాగం ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా దాదాపు రూ.800 కోట్లకు పైగా వచ్చిన ఆదాయ వివరాలు లెక్కలతో సహా ప్రజల ముందున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో వేగంగా విస్తరించే ప్రముఖ రంగాల్లో ఒకటైన ఆటోమొబైల్ రంగం, అందునా ఈ-ఆటోమొబైల్ రంగం హైదరాబాద్ బ్రాండ్‌గా రూపొందే దిశగా గొప్ప అడుగులు కూడా పడ్డాయి. ఇప్పటికే ఐటీహబ్‌గా, ఫార్మా హబ్‌గా, అగ్రికల్చర్ హబ్‌గా ఇలా ఎన్నో రంగాల్లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసిన హైదరాబాద్, అటోమొబైల్ హబ్‌గా మారబోతుందంటే దానికి ఖచ్చితమైన కారణం ఫార్ములా-ఈ రేస్. మరి అందాల పోటీల వల్ల అలాంటి ప్రయోజనం ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అయితే సగటు తెలంగాణవాదిగా, ఈ దేశ పౌరుడిగా ప్రస్తుత ఉద్రిక్తతల ప్రభావం ఈ పోటీలపై పడకూడదని, ప్రతిష్ఠసంగతి పక్కనపెడితే భద్రతకు మాత్రం ఎలాంటి భంగం వాటిల్లకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.