‘పోలీసులు మా బ్యాగ్, బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇప్పుడు ఎట్లా చదువుకోవాలో మాకు అర్థం కావడం లేదు’ అంటూ హైడ్రా దురాగతాలను వివరిస్తూ అభం శుభం తెలియని చిన్నారి కన్నీటి పర్యంతమైన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతల కారణంగా పేదలు పడుతున్న కష్టాలు,తీస్తున్న కన్నీళ్లు, పెడుతున్న ఆక్రందనలు అన్నీ ఇన్నీ కావు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీలు ఎక్కడికక్కడ పేరుకుపోయేసరికి రేవంత్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ‘హైడ్రా’మాకు తెరదీసింది. సీఎం రేవంత్ చేసే ఈ రాజకీయాలను ‘డైవర్షన్ పాలిటిక్స్’ అని ఘంటాపథంగా వర్ణించవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి చైర్మన్గా ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదం అవుతూనే ఉన్నది. గతంలో జంట నగరాల కేంద్రంగా వందలాది చెరువులుండేవి. వాటిని కబ్జాదారులు ఆక్రమణ చేసి, నిర్మాణాలూ చేశారు. ఇదంతా ఒకటీ, రెండు రోజుల్లో జరిగిన తతంగం కాదు. కాంగ్రెస్, టీడీపీ పాలనలోనే ఈ నిర్మాణాలు మొదలయ్యాయి. హైదరాబాద్ చుట్టూరా ధనవంతులు, రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపారవేత్తలు చెరువులను, కుంటలను ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులైతే పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లను నిర్మించి మధ్య తరగతి ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ నిర్మాణాలకు పదో, పరకో తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడంతో అక్రమ నిర్మాణాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరించాయి. చెరువులను కబ్జా చేయడంతో వాటి నీటి నిల్వ పరిధి (ఎఫ్టీఎల్) రానురాను కుంచించుకుపోయింది. అనుమతులు ఇచ్చే సమయంలో చెరువులు, కుంటలను కాపాడాల్సిన నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులు ఏం చేశారన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో మహా నగరమైన హైదరాబాద్లో భారీ వర్షాలు పడ్డప్పుడల్లా పలు కాలనీలు నీటిలో మునిగిపోతున్నాయి. ఇంత పెద్ద నగరానికి ఒక పటిష్ఠమైన భవిష్యత్తు ప్రణాళిక లేకపోవడం విచారించదగిన విషయమే.
అయితే రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా అధికారులు ముందుగా చేయవలసిన పని ఏమంటే… హైదరాబాద్లో మొత్తం ఎన్ని చెరువులున్నాయి? ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఏ మేరకు ఆక్రమణలు జరిగాయి? ఆక్రమించిన వారి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆక్రమణదారులకు ముందుగా నోటీసులు ఇచ్చి, ఆ తర్వాతే కూల్చివేత పనులు షురూ చేయాలి. అయితే, కబ్జా చేసిన ధనవంతుల నిర్మాణాలను కూల్చితే సమస్యేమీ లేదు. కానీ, పేద, మధ్య తరగతి ప్రజల నిర్మాణాలను కూల్చితేనే అసలు సమస్య. వాళ్లు పైసా పైసా పోగు చేసుకొని కొనుక్కున్న, లేదా కట్టుకున్న ఇండ్లు అవి. అలాంటి నిర్మాణాలను కూలిస్తే వాళ్లు పడే బాధ వర్ణనాతీతం. కబ్జాలకు ప్రధాన కారణం అసలు వీళ్లేనా, కాదా అని ఒక్కసారి తనిఖీ చేయాలి. ఒకవేళ వాళ్లే అయితే, అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపవలసిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది. అయితే, ఈ కబ్జా పర్వంలో భాగస్వాములైన నీటిపారుదల, మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులను తప్పుపట్టాల్సిన అవసరం లేదా అని ఒక్కసారి ప్రభుత్వం అవలోకనం చేసుకోవాలి. అధికార యంత్రాంగం పటిష్ఠంగా ఉంటే అసలు అక్రమ నిర్మాణాలు జరిగేవే కావనేది వేరే విషయం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కాలనీలో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్రెడ్డి.. ‘నిర్మితమై ఉన్నవాటిని కూల్చడం పద్ధతి కాదు, ఎంతో కొంత జరిమానా విధించి ఆ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా?’ అని ప్రశ్నించారు. నేడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
నాడు పేదల పక్షాన నిలిచిన రేవంత్ రెడ్డి, నేడు పేదల ఇండ్లను కూల్చడం సరైన నిర్ణయమేనా? అని ఆయన ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ‘హైడ్రా’ విధానం మంచిదే కావచ్చు కానీ, తెలిసో, తెలియకో ఎవరో అమ్మిన భూములను, భవనాలను కొనుక్కున్న మధ్య తరగతి ప్రజలు ఎందుకు బలి కావాలి? ఇలాంటివారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇలాంటివాళ్లకు ప్రభుత్వం వేరేచోట ఇంటి స్థలాలను కేటాయించాలి. అప్పుడే ‘హైడ్రా’ చేస్తున్న పనికి అర్థం ఉంటుంది. అంతేకానీ, హడావుడిగా ఇవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే పేద ప్రజలు రోడ్డున పడతారనే విషయాన్ని ముఖ్యమంత్రి మరిచిపోకూడదు.
-జీడిపల్లి రాంరెడ్డి
96666 80051