చట్టం ముందు అందరూ సమానమే అనే మాటను మనం తరచుగా వింటుంటాం. కానీ కొందరు ఎక్కువ సమానమనే వ్యంగ్యోక్తి కూడా ఉన్నది. చట్టాన్ని తమ చుట్టంలా వాడుకునే వారినుద్దేశించి ఈ వ్యంగ్యోక్తి. మన రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కొడుకుపై దాఖలైన పోక్సో కేసు ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తున్నది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరుపడమే కాకుండా అభ్యంతరకరమైన ఫొటోలను తన మిత్ర బృందానికి షేర్ చేయడమనేది అతడిపై వచ్చిన అభియోగం. కేంద్రమంత్రి కుమారుడు కావడం వల్ల సహజంగానే దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించింది. ఇక మన రాష్ట్రంలో అయితే చెప్పనక్కరలేదు. అయినా కేంద్రమంత్రి కుమారుని కేసు కావడం వల్ల, ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత సందేహాస్పదమైంది. ఆరోపణలు తీవ్రమైనవైనా సకాలంలో స్పందించకపోవడం, నిందితుడి ఫిర్యాదు తర్వాత గానీ బాధిత బాలిక ఫిర్యాదును, నమోదు చేయకపోవడం వంటివన్నీ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలేనని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్రంలో హోంశాఖ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వద్దనే ఉంచుకున్నారనేది ఇక్కడ గమనార్హం. కేసు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కుటుంబ సభ్యుడిది కావటం వల్ల వ్యవస్థ స్పందన ఆశించిన రీతిలో లేదనే భావన ఎల్లెడలా వ్యాపించింది.
దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వహించాల్సిన పెద్దలే కేసును అడ్డుకునేందుకు, నీరుగార్చేందుకు అనేక మార్గాలు అన్వేషించడం ఏమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కానేకాదు. మొదట నమోదు చేసిన పోక్సో చట్టంలోని సెక్షన్లను పోలీసులు, బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత కఠినమైన సెక్షన్లుగా మార్చారు. నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర పెద్దల వ్యవహారశైలి మరింత ప్రశ్నార్థకంగా మారడం ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తించింది. బాధితురాలి తరఫున బీఆర్ఎస్ దృఢంగా నిలిచింది. అడుగడుగునా యంత్రాంగాన్ని సవాల్ చేసింది. బాధితురాలి కుటుంబానికి అడుగడుగునా అండగా నిలిచింది. న్యాయం కోసం గొంతువిప్పింది. న్యాయం గొంతు నులిమేందుకు ఢిల్లీ మంత్రి, గల్లీ ముఖ్యనేత పట్టపగలే ఒకరికొకరు తోడుగా నిలవడం దిగ్భ్రాంతికరం. కాంగ్రెస్-బీజేపీ దోస్తీ ఈ కేసు సందర్భంగా బాహాటంగానే బరితెగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా, అదీ తప్పనిసరి పరిస్థితిలో స్పందించడం, కేంద్రమంత్రి పూటకో మాటతో తప్పించుకోజూడటం, కేసుతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు స్పందించడం మరింత విడ్డూరం. అటు సోషల్ మీడియాలోనూ బాధితురాలి గుర్తింపును బయటపెట్టడం, ఆమె మైనర్ కాదనే అక్రమ వాదనలు ముందుకు తీసుకురావడం, మెయిన్ స్ట్రీమ్ మీడియా గంపగుత్తగా అమ్ముడుపోవడం వంటి వైపరీత్యాలు చోటుచోసుకున్నాయి.
నిందితుడు పరారీలో ఉంటూనే కోర్టులో ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించినప్పటికీ, కోర్టు అందుకు ససేమిరా అనడంతో అన్ని దారులు మూకుపోయాయి. ఎట్టకేలకు నిందితుణ్ని శనివారం పొద్దుపోయిన తర్వాత పోలీసులు నాటకీయంగా అరెస్టు చేయడంతో ఒక ఘట్టం ముగిసింది. తండ్రే స్వచ్ఛందంగా నిందితుణ్ని అప్పగిస్తే బాగుంటుందని సీఎం ఒక దశలో సలహా ఇవ్వడం, అరెస్టు తర్వాత కేంద్రమంత్రి తానే తన కుమారుణ్ని అన్ని విషయాలూ తనిఖీ చేసుకుని అప్పగించానని చెప్పడం లోపాయికారీ వ్యవహరణకు సూచనగా ఎవరికైనా అనిపిస్తే అందుకు వారిని తప్పు పట్టలేము. నిందితుడిపై కోర్టు విచారించి నిర్ణయం తీసుకోవడం అనేది అలా ఉంచితే కేంద్రమంత్రి తీరుతెన్నుల మాటేమిటనేది పెద్ద ప్రశ్న. బాధితురాలిని తన ఇంటికి ఓ పాత్రికేయ మధ్యవర్తి ద్వారా పిలిపించుకుని మాట్లాడినట్టు ఆరోపణలున్నాయి.
అక్కడి నుంచి తానే నిందితుడిని అప్పగించానని చెప్పడం వరకు ఆయన ఆద్యంతం చట్టపరంగా అభ్యంతరకరంగానే ప్రవర్తించారని చెప్పవచ్చు. పోక్సో కేసు నిందితుణ్ని కాపాడేందుకు ప్రయత్నించడం, అరెస్టు తప్పించేందుకు సాయం చేయడం, బాధితులను బెదిరించడం, బేరాలాడటం.. ఇవన్నీ అక్రమ ప్రవర్తన కిందకే వస్తాయి. అలాంటి చర్యలకు కూడా శిక్షలు ఉన్నాయి. ఇప్పటికైనా చట్టం ముందు మాన్యులూ, సామాన్యులూ అంతా సమానమేనని చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వ్యవస్థపై సడలిన ప్రజల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడం తక్షణావసరం. అంతిమంగా బేటీ బచావ్, బేటీ పఢావ్ అంటూ ఊదరగొట్టే నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పోక్సో వంటి కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మంత్రివర్గం నుంచి తొలగించి, తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉన్నదని చెప్పక తప్పదు.