ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దేశవ్యాప్త ప్రతిష్ఠ లభించడం ఆయన అధికారానికి వచ్చిన కొత్తలోనే ‘బీహార్ డీఎన్ఏ’ అంటూ మాట్లాడటంతో మొదలైంది. అది, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తూ ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమవుతుండిన రోజునే ఆయన కులం గురించి రేవంత్ వ్యాఖ్యలు చేయడంతో మరింత ఉన్నతమైంది. ఈ రెండు ఉదంతాలకు మధ్య ఏడాది కాలంలోనూ, నూతన ప్రతిష్ఠను దేశమంతటా నిలిపి ఉంచుకునేందుకు ఆయన మరికొన్ని కూడా చేస్తూ వస్తున్నారు.
Revanth Reddy | ‘బీహార్ డీఎన్ఏ’ విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి అధికారానికి వచ్చే సమయానికి రాష్ట్ర అధికార యంత్రాంగంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో కొందరు బీహార్‌కు చెందినవారు ఉన్నారు. సీనియారిటీ కారణంగా వారిలో కొందరు ముఖ్యమైన స్థానాల్లో పనిచేసేవా రు. అఖిల భారత సర్వీసుల అధికారుల ఎంపిక, వారిని వివిధ రాష్ర్టాలకు కేటాయించడం కేంద్ర హోంశాఖ పని. స ర్దార్ వల్లభభాయ్ పటేల్ మొదటి హోంమంత్రిగా ఉండిన కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతున్నది. అందువల్ల తెలంగాణలో బీహార్‌కు చెందినవారు ఉండటంలో స్వ యంగా వారికి గాని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గాని ఎటువంటి ప్రమేయం లేదు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడి శా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ర్టాలకు చెందిన వారి విషయంలోనూ అంతే. వీరందరు కూడా ఉమ్మడి ఏపీలోనూ ఉండేవారు. తెలంగాణ పరిస్థితీ అదే.
అటువంటప్పుడు రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా బీహార్ గురించి ప్రస్తావించడం ఎందుకు? ఆ రాష్ర్టానికి చెందిన వారిలో కొందరి పట్లగాని,
అందరి పట్ల గాని తనకు ఫిర్యాదులు ఏవైనా, ఏ కారణం వల్లనైనా ఉంటే, వారిని తను కావాలనుకునే శాఖలకు బదిలీ చేయవచ్చు. విజ్ఞత గల ఏ ముఖ్యమంత్రి అయినా చేసేది అదే. కానీ ఆయన అటువంటి విజ్ఞతను, సంయమనాన్ని కోల్పోయి ‘బీహార్ డీఎన్ఏ’ అనే వ్యాఖ్యలు చేశారు. కేవలం క్షణికావేశంతో సంయమనం కోల్పోయే స్వభావం ఉన్నవారు తప్ప ఇతరులు చేసే పని కాదది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం ఏమిటన్నది మనమిక్కడ అర్థం చేసుకోవలసిన విషయం. ఆయన మాటలకు ఆయా అధికారులు ఏమనుకున్నారో తెలియదు గాని, రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి విమర్శలు చాలానే వినిపించాయి. అవి ఇక్కడ మనం విన్నవి. విమర్శలు రాష్ర్టానికి పరిమితమై ఉంటే అది వేరు. కానీ ఈ ఇంటర్నెట్ యుగంలో రేవంత్‌రెడ్డి మాటలు అతి వేగంగా బీహార్, ఇతర ఉత్తరాది రాష్ర్టాలతోపాటు ఆటు దేశ రాజధాని ఢిల్లీకి, హోంశాఖకు కూడా చేరిపోయాయి. ఆశ్చర్యానికి, విమర్శలకు దారితీశాయి. ఇందులో రెండు కోణాలున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులోనూ కొత్తవాడు, బయటి ప్రపంచానికి తన పేరు ఇంకా అంతగా పరిచయం లేనివాడు, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఆ తరహా దురభిప్రాయాలతో కూడిన వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నది ఒకటి. ఇది సాధారణమైన విమర్శ కాగా, ‘బీహార్-బీహారీ’ అన్న ప్రస్తావనలు ఉత్తర భారతదేశంలో, మరీ ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించి చాలా సెన్సిటివ్ మాటలు.
వారు వెనుకబడినవారు, చదవనివారు, అల్లర్లు చేసేవారు, తగినంత నాగరికతలేని మొరటు మనుషులన్నది ఉత్తర భారత ప్రాంతాల్లో కొందరి నుంచి వినిపించే అభిప్రాయం. ఇది ఒకప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఉమ్మడి రాష్ట్రంలోని కోస్తా వారికి ఉండిన వైఖరి వంటిది. ‘యేతో బీహారీ సాలా హై’ అనే మాటలు స్వయంగా నేను అనేకసార్లు విన్నాను. నేను చదివిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వంటి విశిష్టమైన విద్యా సంస్థలోనూ ఈ వైఖరులు కనిపించేవి. మొత్తం మీద ఈ పరిస్థితులు బీహార్ ప్రజలకు చాలా సెన్సిటివ్‌గా మారాయి. సరే ఇవన్నీ రేవంత్‌రెడ్డితో నిమిత్తం లేనివి. కానీ ‘బీహారీ డీఎన్ఏ’ అన్న మాట ఆయన నోట రావడం ఏమిటన్నది ప్రశ్న. నిజానికి చరిత్రలోకి వెళితే, బీహార్ భూమికి అనేక విధాలైన ఘనతలున్నాయి. దేశంలో మొట్టమొదటిది అయిన మగధ సామ్రాజ్యం, బౌద్ధమత ఆవిర్భావం, మహావిశ్వవిద్యాలయాల స్థాపన మొదలైనవి. విషయానికి మొత్తం మీద ఇది రెండవ కోణం అయింది. రేవంత్‌రెడ్డికి తన పొరపాటు అర్థమై ఉంటే, కనీసం దీనిపై విమర్శలు వచ్చిన వెంటనే, తనకు దురుద్దేశాలు లేవని, మాట తొందరలో అలా వచ్చిందని అనవలసింది. కానీ, అదేమీ చేసినట్టు లేరు. ఆ విధంగా ఆయన మొదట్లోనే సంపాదించుకున్న దేశవ్యాప్త ప్రతిష్ట అలాగే నిలిచిపోయింది.
ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాము. ఈ నెల 14న మొత్తం దేశం దృష్టి అంతా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కావడంపై ఉన్నది. అంతకుముందు మూడు రోజుల్లో ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, వివిధ అమెరికన్ ఉన్నతాధికారులతో సమావేశమవుతుండినా, ట్రంప్ సమావేశపు ప్రత్యేకత గురించి చెప్పనక్కరలేదు. వారి మధ్య ఇతర ముఖ్యమైన అంశాలను అటుంచి, వలస ప్రజల పంపివేత, వాణిజ్య సుంకాల విషయమై ఎటువంటి చర్చలు జరగవచ్చునని సాధారణ మధ్యతరగతి వరకు కూడా భారతీయులు ఉత్కంఠతో ఎదురు చూస్తుండిన సమయమది. సరిగా అవే ఘడియలలో మోదీ కులం గురించి రేవంత్ ఇక్కడ చేసిన వ్యాఖ్యలు వెంటనే అంతటా వ్యాపించి అందరినీ ఉలికిపాటుకు, దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోదీ కులం గురించి ఆయన గతంలోనూ మాట్లాడారు. కానీ అవి అప్పటి సందర్భాల వల్ల రాష్ర్టానికి పరిమితమై మిగిలాయి. ఈసారి మోదీ అమెరికా పర్యటన సమయంలో ముడిపడిన సందర్భం కావడంతో సున్నితంగా మారింది. దేశమంతటా దృష్టిని ఆకర్షించింది.
మోదీ ఉన్నత కులస్తుడని, తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయిన వెనుక 2002లో తమ తేలీ కులాన్ని ఓబీసీ జాబితాలోకి మార్పించుకున్నారన్నది రేవంత్‌రెడ్డి ఆరోపణ. అది నిజం కాదని, కాంగ్రెస్ అధికారంలో ఉండిన 1994లోనే ఆ మార్పిడి జరిగిందనేది బీజేపీ చెప్తున్న మాట. ఈ ఆరోపణలు, వివరణలు గతంలోనూ ఉన్నవే. ఎవరైనా రికార్డులు పరిశీలించి ఏమైనా స్పష్టం చేశారేమో తెలియదు. చేసి ఉంటే ఆ స్పష్టీకరణలు తన ఆరోపణకు సమర్థనగా ఉన్నట్టయితే రేవంత్‌రెడ్డి ఆ సంగతి వెల్లడించి ఉండవలసింది. అదేమీ చేయకపోవడాన్ని బట్టి తనకైనా స్పష్టత ఉన్నదో లేదోననే సందేహం సహజంగానే కలుగుతుంది. ఆ యన తన ఆరోపణ నిజమని గట్టిగా నమ్మితే, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాఖ ద్వారానో, ఏఐసీసీ ద్వారానో ధ్రువీకరించుకోవడం కష్టం కాదు. మొత్తానికి ఈ తాజా ఉదంతంతో ఆయనకు దేశవ్యాప్తంగా మరింత ప్రతిష్ఠ లభించింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి కులం గురించి మాట్లాడటమేమిటనే ప్రశ్నను పక్కకు ఉంచినా, ఆ ప్రశ్నను ఎవరైనా బీసీలు లేవనెత్తినా అర్థం ఉండేది కదా అనే విచికిత్సను వదిలి వేసినా, ఇంత చేసీ తన మాట తప్పని తేలడంతో మరునాడు ఢిల్లీలో ఆయన, హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు సర్దుబాటు కోసం నానా తంటాలు పడ్డారు. కులం మార్పు ఒక ప్రక్రియలో భాగంగా అందరి వలెనే మోదీకి జరగడానికి, ఆయన సీఎం అయినాక అధికార దుర్వినియోగంతో ఆ పని చేశారన్న అర్థం తీయడానికి తేడా లేదా?
పైన అనుకున్నట్టు ఈ రెండు ఉదంతాల మధ్య కాలంలోనూ రేవంత్‌రెడ్డి తన ప్రతిష్ఠను సజీవంగానే ఉంచుకున్నారు. అందుకు దోహదం చేసిన వాటిలో ఆయన మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీల అమలు గురించి అసత్యాపూర్వకంగా సాగించిన ప్రచారాలు ఒక శ్రేణిలోకి రాగా, ఇతరత్రా తన పరిపాలన ఎంత గొప్పగా సాగుతున్నదో అంతటా తెలిసి వస్తుండటం మరొక శ్రేణిలోకి వస్తుంది. ఈ రెండింటి గురించిన వివరాలు, విశేషాలు తెలిసినవే అయినందున ఇక్కడ మళ్లీ చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక్క మాట మాత్రం ప్రస్తావించాలంటే, ఢిల్లీలో తాము ‘ఆప్’ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించగలిగాము గాని బీజేపీని ఓడించలేకపోయామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నర్మగర్భంగా మాట్లాడగా, మొరటు ధోరణులు తప్ప అటువంటి కళ తనకెప్పుడూ లేదని ప్రతిసారీ చాటి చెప్పుకునే రేవంత్‌రెడ్డి, తమను హర్యానాలో‘ఆప్’ ఓడించిందని, అందుకు బదులుగా వారిని ఢిల్లీలో కావాలనే ఓడించామని తన నిజాయతీని వెల్లడించుకున్నారు. ఆ విధంగా తన అఖిల భారత ప్రతిష్ఠకు మరింత మెరుగును దిద్దుకున్నారు.
-టంకశాల అశోక్