ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే గతంలో ఆ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నా… ప్రధానమంత్రి స్థాయిలో వివక్ష ఉండేది కాదు. ఆ రాష్ర్టానికి మేలు చేసే ప్రాజెక్టులకు మోక్షం లభించేది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఈ సంస్కృతికి తిలోదకాలిచ్చారు.
సామంత రాజ్యంపై చక్రవర్తి దండయాత్ర సాగినట్టుగా ప్రదాని నరేంద్ర మోదీ రాష్ర్టాల పర్యటనలు సాగుతున్నాయి. శనివారం నాడు ప్రధాని మోదీ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధాని రాక సంతోషం. ఎప్పటి మాదిరిగా రాష్ట్రంపై దండయాత్రకు వస్తున్నారో, లేక దండిగా మేలు చేస్తారో చూడాలి. మాజీ ప్రధాని వాజపేయి హయాం లో కేం ద్రం, రాష్ర్టాల మధ్య మంచి వాతావరణం ఉండేది. మోదీ హయాం మొదలయ్యాక కేంద్రం అంటే రాష్ర్టాలపై దాదాగిరి చెలాయించడమే ఆచారం గా మారిపోయింది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఇలానే దాదాగిరి చేస్తే మోదీ ముఖ్యమంత్రిగా ఉండేవారా? ప్రధాని పదవి దాకా వచ్చేవారా? కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం అయినా, రాష్ర్టాల్లో ఏర్పడిన ప్రభుత్వం అయి నా ప్రజలు ఎన్నుకున్నదే. దేశం పట్ల, రాష్ట్రం పట్ల బీజేపీకి ఎంత బాధ్యత ఉన్నదో ఆయా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అంతే బాధ్యత ఉన్నది. ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం దాదాగిరిని చివరికి సుప్రీంకోర్టు సైతం వ్యతిరేకిస్తే, ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీ రాష్ట్రంపై కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నది. న్యాయవ్యవస్థపై, సమాఖ్యస్ఫూర్తిపై బీజేపీకి ఎంత గౌరవం ఉన్నదో దీన్నిబట్టి అర్థమవుతున్నది.
కేంద్రం, రాష్ర్టాలపై దొడ్డిదారిలో అధికారం చెలాయిస్తూ అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్న వాతావరణంలో ప్రధాని మోదీ మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మోదీ గతంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్టు మాట్లాడారు. కొందరు శాసనసభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని బెదిరించారు. దానికి తగ్గట్టుగానే కొందరు శాసనసభ్యుల కొనుగోలుకు బీజేపీ కొందరు బ్రోకర్లను పంపింది. వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే మహారాష్ట్రలో పార్టీలను కొన్నట్టు కొనేవారు. ఢిల్లీలో కొనుగోలు సాధ్యం కాకపోవడంతో దర్యాప్తు సంస్థల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు.
గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. (కనీసం ఎన్నికల సంవత్సరంలోనైనా ఏమైనా చేస్తారేమోనని ఆశించడం తప్పు కాదు.) ఎన్నికల్లో బీజేపీ కూడా రాష్ట్రంలో పోటీ చేస్తుంది. తొమ్మిదేండ్లలో కేంద్రం నుంచి రాష్ర్టానికి ఇది సాధించాం అని చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి కదా? బ్యాంకులు ఇచ్చే ప్రైవేట్ అప్పులు కూడా రాష్ర్టానికి కేంద్రం చేసిన సహాయంగా ఇటీవల కేంద్రమంతి కిషన్‌రెడ్డి ప్రకటించారు. చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు కిషన్‌రెడ్డి అయినా ఏం చేస్తారు. చివరికి బ్యాంకులు ఇచ్చిన ప్రైవేటు అప్పుల లెక్కలే చెప్తారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో కాజీపేట పీఓహెచ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. నిజానికి 1982లోనే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించారు. విభజన చట్టంలో పేర్కొనడం వల్ల మూడు దశాబ్దాల కల నెరవేరినట్టే అనిపించింది. తీరా కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు. ఇది తెలంగాణలో తాము సాధించిన విజయంగా చెప్పుకుంటారేమో బీజేపీ నాయకులు. దక్షిణమధ్య రైల్వే అధికారికంగా ప్రకటించినదాని ప్రకారం ఇప్పుడు వరంగల్‌కు మంజూరైంది పీరియాడికల్ ఓవర్ హాలింగ్ ఫెసిలిటీ ప్రాజెక్టు. దీని వ్యయం రూ.383 కోట్లు. దీన్ని 2015లో మంజూరు చేసినా ఇప్పటివరకు 2021-22 బడ్జెట్లో రూ.2 కోట్లు, 22-23లో రూ.45 కోట్లు మంజూరు చేశారు. ఈ లెక్కన రూ.383 కోట్ల ప్రాజెక్టుకు దశాబ్ద కాలం పడుతుందేమో. తెలంగాణ ఏర్పాటుకు ముందు యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును తెలంగాణకు మంజూరు చేసింది. దాదాపు లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్షంగా ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి లభించేది. దీనివల్ల తెలంగాణకే కాదు, దేశంలో ఐటీ రంగానికి ఎంతో మేలు జరిగేది.
దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని ఇవ్వడాన్ని దేశమంతా అభినందించింది. రాష్ర్టానికి ప్రోత్సాహకంగా ఉంటుంది, ఇతర రాష్ర్టాలకు ప్రేరణగా ఉంటుందని నీతి ఆయోగ్ తెలంగాణకు రూ.20 వేల కోట్ల సహాయం చేయాలని సూచిస్తే కేంద్రం 20 రూపాయల సహాయం కూడా చేయలేదు. చివరికి గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసేందుకు తొమ్మిదేండ్లయినా కేంద్రానికి సమయం చిక్కడం లేదు. దేశంలోనే అత్యంత వెనుకబడిన యూపీ లాంటి రాష్ర్టాలకు మెట్రో రైల్‌కు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్రానికి హైదరాబాద్‌లో రెండో దశ మెట్రోకు సహాయం అందించడానికి చేతులు రావడం లేదు.
తెలంగాణ పట్ల తన వ్యతిరేకతను బీజేపీ ఎప్పుడూ దాచుకోలేదు. కాంగ్రెస్‌ది విచిత్రమైన రాజకీయం. కనీసం మా హయాంలో తెలంగాణకు ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు రద్దుచేశారని కాంగ్రెస్ ప్రశ్నించదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని మేం విభజన చట్టంలో చేరిస్తే ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించదు. ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే మేం చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి కదా? అని కనీసం బీజేపీ రాష్ట్ర నాయకులు మోదీపై ఒత్తిడి తెచ్చి ఏమైనా సాధిస్తారేమో చూడాలి. లేకపోతే మోదీ.. మోదీ.. అనే నినాదాలకు పరిమితం అవుతారో చూడాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-బుద్దా మురళి