పీఎం కిసాన్ పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏటా మూడు విడతల్లో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందుతున్నది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. అయితే దీనిలో అనేక లోపాలు ఉన్నాయి.
2019 ఫిబ్రవరిలోపు పట్టాదారు పాసు పుస్తకం ఉన్నవారికే ఈ పథక లబ్ధి చేకూరుతున్నది. పథకం ప్రారంభమయ్యే నాటికి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నవారే అర్హులనే నిబంధన వల్ల అనేకమంది రైతులు నష్టపోతున్నారు. ఆ తేదీ తర్వాత పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు దీనికి అనర్హులవుతున్నారు.
మన రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది రైతులకు మాత్రమే ఈ నిధులు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 10 కోట్ల వరకు ఉండవచ్చు. అయితే నిబంధనల్లో పేర్కొన్న తేదీ తర్వాత ఒక్క మన రాష్ట్రంలోనే సుమారు 20 లక్షల మంది రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు పొందారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య కోట్లలో ఉంటుంది. అర్హులైనప్పటికీ ఈ రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు నష్టపోతున్నారు. రైతులకు శరాఘాతంగా మారిన ఈ నిబంధనను తొలగించాలి. అర్హులందరికీ పీఎం కిసాన్ సాయం అందజేయాలి. పెట్టుబడి వ్యయాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఇస్తున్న సాయం మొత్తాన్ని కూడా పెంచాలి. రైతులను ఆదుకోవాలి.
– రావుల రామ్మోహన్రెడ్డి