రాజ్యాల మధ్య జరిగే యుద్ధం ఎప్పుడూ రక్తదాహాన్నే కోరుకుంటుంది. గాజా యుద్ధం అందుకు మినహాయింపేమీ కాదు. అక్కడ నిత్యం తల్లి పేగు ఛిద్రమవుతున్నది. బాల్యం భగ్నమవుతున్నది. నెత్తురు ఏరులై పారుతుంటే కన్నీరు తుఫానుగా మారుతున్నది. అమెరికా ఇప్పటికైనా తన ధోరణి మార్చుకొని గాజా ఘోరకలిని ఆపేందుకు పకడ్బందీ ప్రతిపాదనలతో ముందుకురావాలి. ఇజ్రాయెల్ తన మొండి వైఖరిని వీడి పాలస్తీనీయుల ప్రజాస్వామిక, సార్వభౌమిక హక్కులను గుర్తించేందుకు సిద్ధం కావాలి.
ఇజ్రాయెల్‌లోనూ యుద్ధ వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లక్షల మంది ఇజ్రాయెల్ పౌరులు యుద్ధ భయం కారణంగా స్వదేశంలోనే చెల్లాచెదురైపోవడం తెలిసిందే. అంతేకాకుండా రిజర్వ్ సైనికులు విధుల్లోకి చేరేందుకు నిరాకరిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో.. భయతారకమైన పరిష్కారాన్ని కనిపెట్టడమే అందరికీ శ్రేయస్కరం. అందుకు అందరికన్నా ఎక్కు వ చొరవ తీసుకోవాల్సింది అమెరికాయేనని చెప్పక తప్పదు. ఏకైక అగ్రరాజ్యం మధ్యవర్తిత్వం వహిస్తే గానీ ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కదు.
గాజాలో ఏడాది కాలానికి పైగా కొనసాగుతున్న మానవ హననం ముగింపును ఇప్పుడు యాహ్యా సిన్వర్ మరణంతో ముడిపెడుతున్నారు. హమాస్ మిలిటరీ వింగ్ నాయకుడైన సిన్వర్ గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై క్షిపణులతో జరిగిన దుస్సాహసిక దాడికి నేతృత్వం వహించాడట! సిన్వర్‌ను తుద ముట్టించడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ పదే పదే చెప్పుకొన్నప్పటికీ అతడు మరణించింది మాత్రం, ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిలో కాదు. ఒక ఇజ్రాయెల్ పటాలానికి అనుకోకుండా అతడు తారసపడగా కిందిస్థాయి సైనికులు అతడిని హతమార్చారు. ఇజ్రాయెల్ ఎన్నాళ్లుగానో సిన్వర్ కోసం గాలిస్తున్నప్పటికీ అతడు పట్టుబడలేదు.
ఓ భవనం శిథిలాల మధ్య కూర్చున్న సిన్వర్‌ను డ్రోన్ సాయంతో గుర్తించి పట్టుకొని చంపేశారు. సిన్వర్ మృతితో ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరింది గనుక గాజాలో కాల్పుల విరమణ జరగాలని అమెరి కా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. అయితే, హమాస్ చేతిలోని బం దీలను విడిపించేంతవరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధా ని బెంజమిన్ నేతన్యాహు సెలవిచ్చారు. బందీలను తమకు అప్పగిస్తే ఈ క్షణమే యుద్ధం ఆపేస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. గాజాలో ఏడాది కాలంగా కొనసాగిస్తున్న నరమేధానికి ఒక వ్యక్తి చావుతో ముగింపు పలకాలన్న ఆలోచన వింతగా అనిపిస్తున్నది. గాజా యుద్ధాన్ని తేలికైన అం శంగా చూస్తున్నట్టు అనిపించడమే అందుకు కారణం. అయితే 40,000 మందికి పైగా సామాన్యులు హతమైపోయిన నరమేధానికి ఎవరు బాధ్య త వహిస్తారనేది అసలు ప్రశ్న. ఇజ్రాయెల్ తన ఘాతుక యుద్ధాన్ని ఆపివేస్తేనే బందీలను విడుదల చేస్తామని అటు హమాస్ ప్రకటించింది. అంటే హమాస్ బందీలను విడవదు, ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు. ఈ విష వలయంలో సామాన్యులు నలిగి నలిగిపోతుండటం అత్యంత విషాదకరమైన విషయం.
పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేంతవరకు సిన్వర్లు పుడుతూనే ఉంటారు, గిడుతూనే ఉంటారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ఆగిన రోజు పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని చెప్పవ చ్చు. కొన్ని గ్రూపులు తప్ప ఈ సమస్య నుంచి అరబ్ దేశాలు దూరంగా జరిగి పట్టించుకోవడం మానేశాయి. పైగా ఇజ్రాయెల్‌తో ఏదో ఒకరకం గా సంబంధాలు పెట్టుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఒక్క ఇరా న్ మాత్రమే ఇప్పుడు పాలస్తీనాకు అండగా నిలుస్తున్నది. దీని పర్యవసానంగా ఇరాన్ మీదకు ఇజ్రాయెల్ దండెత్తే పరిస్థితులు వస్తున్నాయి. రోజురోజుకూ సమస్య మరింత ముదురుతున్నదే తప్ప కొలిక్కి వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పెద్దన్న అమెరికా పాత్ర కూడా ప్రశ్నార్థకం అవుతున్నది. పైకి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే అమెరికా ఇజ్రాయెల్‌కు సమర్థనగా నిలవడం, సంపత్తి సమకూర్చడం బహిరంగ రహస్యమే. ఇంతటి సంక్లిష్ట వాతావరణంలోనూ మొత్తం మీద యుద్ధం ముగింపునకు మాటలు అటు అమెరికా నోట, ఇటు ఇజ్రాయెల్ నోటా వినిపించడమే కొంతలో కొంత ఊరట!