హైదరాబాద్ మహా నగరంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన ప్రాంతం జూబ్లీహిల్స్. పేరుకే ఇది సిరిమంతుల ఏరియా. కానీ, ఈ నియోజకవర్గంలో నివసించేది సింహభాగం పేదలు, బీదలు, బడుగులు,బస్తీవాసులే. టోలీచౌకి, షేక్‌పేట్, అజీజ్‌బాగ్, సంజయ్‌నగర్ వడ్డెర బస్తీ, హబీబ్ ఫాతిమానగర్, రహ్మత్‌నగర్, కార్మికనగర్, బ్రహ్మశంకర్ నగర్, శ్రీరామ్‌నగర్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ,బోరబండ లాంటి బస్తీలెన్నో ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాయకష్టం చేసుకొని జీవించే శ్రామికులుండే ఈ ప్రాంతాల్లోని ప్రతి గడప దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సుపరిచితం.
ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పిలిచేంతగా పరిచయాలు ఉన్నాయి ఆయనకు. అందుకే, 2014 నుంచి 2023 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరీ ముఖ్యంగా స్వరాష్ట్రం సిద్ధించాక, బీఆర్ఎస్లో చేరిన ఆయన కేసీఆర్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేశారు. జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగని ప్రాంతం, కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే 2018, 2023 ఎన్నికల్లో మాగంటికి జూబ్లీహిల్స్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ, ఆయన హఠాన్మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఉమ్మడి ఏపీలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల వలె జూబ్లీహిల్స్ బస్తీలది కూడా దుర్భర పరిస్థితే. స్వరాష్ట్రం సిద్ధించినాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా చేసుకొని పాలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందినట్టే జూబ్లీహిల్స్‌లోని బస్తీల్లో ఉండే పేదలకూ అనేక పథకాలు అందాయి. వృద్ధులకు రూ.4,000 ఆసరా పింఛన్లు, గర్భిణులు, చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, అమ్మలకు కేసీఆర్ కిట్లతోపాటు రూ.13,000 ఆర్థిక సాయం, పెండ్లి చేసుకునే ఆడబిడ్డలకు రూ.1,00,000 కల్యాణలక్ష్మి, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, బస్తీ బస్తీకి బస్తీ దవాఖానలు, కమ్యూనిటీ హాళ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్లద్దాలు, రూ.5లకే కడుపు నిండా భోజనం… ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో సంక్షేమ పథకాలను పేదల ముంగిట్లోకి తీసుకువెళ్లారు కేసీఆర్. అంతేకాదు, బస్తీల్లో మురుగు సమస్యను పరిష్కరించారు. నాలాలను పునరుద్ధరించి, కొత్త నాలాలను నిర్మించి ఎక్కడా చుక్క నీరు నిల్వకుండా చేశారు. ముంపు బాధను తప్పించారు. కొత్తగా అనేక అర్బన్ పార్క్‌లను కట్టించారు. తళతళ మెరిసేలా అన్ని బస్తీల్లో రోడ్లను నిర్మించారు. ఎస్సార్డీపీలో భాగంగా మహా నగరంలో అనేక చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టారు. అందుకే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌తో పాటు నగరంలో అన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేదు. కొత్త పథకాలు ఇవ్వకపోగా, కేసీఆర్ సర్కార్ అమలుచేసిన వాటిని నిలిపివేసింది. పరిపాలన చేతకాని, అసమర్థ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. సంపద పెంచి, పేదలకు పంచడం చేతగాని కాంగ్రెస్ సర్కార్ బడుగులను పీక్కుతింటున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ధోకా చేసింది. పేదలపై పగబట్టిన హైడ్రా బుల్డోజర్ వారి గూడును చిదిమేసింది. గూడుతో పాటే నోటికాడి కూడును కాలదన్నింది. అస్తవ్యస్త పాలనలో నగరంలో చేసేందుకు పేదలకు చేతినిండా పని, తినేందుకు కడుపు నిండా బువ్వ దొరకడం లేదు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు గానీ, తన అనుయాయులకు పదవులు పంచుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు గానీ, తమకు రావాల్సిన కమీషన్లను మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్నారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు గానీ, వారు మాత్రం ఒకటో తారీఖు రాకముందే జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదు గానీ, పీఏల మీద పీఏలను మీద పెట్టుకుంటూ కమీషన్ల దందాలు చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఫీజు రీయింబర్స్మెంట్, మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా, వారి కడుపులు కొట్టి మంత్రుల కంపెనీల కడుపులు నింపుతున్నారు.
బడుగుల బిడ్డలకు ఒక్కపూట సరైన తిండి పెట్టడం లేదు గానీ, ఏలికలు మాత్రం ఒక్క పూట తిండికి లక్షలు తగలేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. తమను నమ్మించి ద్రోహం చేసిన వంచక కాంగ్రెస్ వెన్ను విరవాలని ప్రజలు ఎప్పటినుంచో కంకణబద్ధులై వేచి చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎక్కడ ఎన్నికలు జరుగుతాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే ఓటమికి భయపడిన కాంగ్రెస్ పార్టీ గత ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతున్నది. కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రూపంలో ప్రజలకు మరో అవకాశం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ముందే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెరదీసింది. రాహుల్ గాంధీ పోరాటాన్ని కాలరాస్తూ ఓట్ల చోరీకి పాల్పడింది. ఇతర ప్రాంతాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, తమ సానుభూతిపరులైన వేల మంది పేరు మీద జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్లను తయారు చేయించి గట్టెక్కాలని చూస్తున్నది. ఆ బోగస్ లీలలు అన్నీ ఇన్నీ కాదు.
తవ్వేకొద్దీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ బయటపడుతూనే ఉన్నది. ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి వేర్వేరు బూత్‌లలో మూడు ఓట్లున్నాయి. ఈ మధ్యే నిర్మాణమైన ఓ అపార్ట్మెంట్లో 40 బోగస్ ఓట్లున్నాయి. కానీ, ఆ అపార్ట్మెంట్ అడ్రస్‌తో ఓటర్ జాబితాలో ఉన్నవారిలో నలుగురైదుగురు మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నారు. మిగతావారు ఎక్కడి నుంచి ఊడిపడ్డారో కూడా స్థానికులకు తెలియదు. ఇక బోరబండ డివిజన్లో 4 ఇళ్లల్లో కలిపి 99 బోగస్ ఓట్లున్నాయి. అందులోనూ ఒకే ఇంట్లో 35 మంది ముస్లిం ఓటర్ల పేర్లుండటం విస్మయం కలిగిస్తున్నది. వారెవరో తనకు తెలియదని, వారికి తానెప్పుడూ ఇంటిని అద్దెకు కూడా ఇవ్వలేదని ఇంటి యజమాని చెప్పడం కాంగ్రెస్ మోసాన్ని తెలియజేస్తున్నది. బంజారాలు, బీసీలు, దళితులు, ఇతరులు ఎక్కువగా ఉండే బంజారానగర్‌లో వారికంటే ఎక్కువగా ముస్లిం ఓట్లు ఉండటం ఆశ్చర్యకరం. ఇలా కాంగ్రెస్ చేసిన ఓట్ల చోరీ బాగోతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.
అయితే, బోగస్ ఓట్లతో గెలవాలని రెండు నెలల నుంచే ఆ పార్టీ పన్నాగం పన్నింది. కానీ, కాంగ్రెస్‌కు తెలియని విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలు ఎప్పుడో ఏడాది కిందటే ఫిక్సయ్యారు. ఎన్నిక ఏదనేది మాత్రమే ఇప్పుడు డిసైడైంది. రాష్ట్రవ్యాప్తంగా సకలజనులు కాంగ్రెస్ సర్కార్‌పై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్నారు. కర్రు కాల్చి కాంగ్రెస్‌కు వాత పెట్టే అవకాశం రాకపోదా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూశారు. కానీ, ఆ సదవకాశం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రూపంలో ప్రజలను వరించింది. అందుకే, తెలంగాణ ప్రజల తరఫున జూబ్లీహిల్స్ ప్రజలు వకాల్తా పుచ్చుకున్నారు. మేక వన్నె పులి లాంటి కాంగ్రెస్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. తెలంగాణ ప్రజాభీష్టాన్ని నెరవేర్చేందుకు సంసిద్ధమయ్యారు. తద్వారా నయవంచక కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పి, తెలంగాణ తలరాతను తిరగరాసేందుకు కదనరంగంలోకి దుంకుతున్నారు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817