ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపడంలో విపక్షానిదే కీలకపాత్ర. ప్రజల తీర్పును శిరసావహిస్తూ తమను నమ్మి అప్పగించిన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నది. సర్కారు తప్పులను ఎత్తిచూపుతూనే.. మంచి పనులను మెచ్చుకుంటూ హుందాగా వ్యవహరిస్తున్నది. అందుకే ఏడాది తిరగకముందే ప్రజలు బీఆర్ఎస్కు మళ్లీ బ్రహ్మరథం పడుతున్నారు. ఏడాది ప్రజాపాలనకు రెఫరెండంగా కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ’ఎక్స్’లో హ్యాండిల్లో నిర్వహించిన పోల్‌లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం.
స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకొని ఉమ్మడి ఏపీలో నాడు తెలంగాణ పక్షం వహించినా.. గత పదేండ్లపాటు తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజాసంక్షేమ మే పరమావధిగా అధికారపక్షం పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించినా.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను నేడు ప్రతిపక్ష హోదాలో కాపు కాస్తున్నా అది బీఆర్ఎస్కే చెల్లింది. నాడైనా, నేడైనా.. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా తెలంగాణే తమ తొలి ప్రాధాన్యమని బీఆర్ఎస్ చాటి చెప్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజల తీర్పును గౌరవించి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని శ్రేణులను ఆదేశించారు. అధినేత చెప్పినట్టుగానే బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 100 రోజుల గడువు పూర్తవడంతో ఆరు గ్యారెంటీ లు, 420 హామీల అమలు కోసం బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. సర్కారు వెంటపడి మరీ ఒక్కొక్కటిగా పథకాలు అమలుచేసేలా చేస్తున్నది. ఈ క్రమంలో ఉద్యమ పార్టీ మొదటినుంచి నిజాన్ని నిజమనీ, అబద్ధాన్ని అబద్ధమనే చెప్తున్నది. ఎన్నడూ దుష్ప్రచారా లు, విష ప్రచారాల జోలికి పోలేదు. కాంగ్రెస్ సర్కారు అమలుచేసిన పథకాల విషయంలో బీఆర్ఎస్ నిజాయితీగానే వ్యవహరిస్తున్నది. ఉచిత బస్సు పథకం అమలు చేశారనే అంటున్నది. రుణమాఫీ కోతలు కొర్రీలతో సుమారు 40 శాతం వరకు అమలు చేశారని చెప్తున్నది. అదే సమయంలో మిగతా పథకాలు అమలు చేయాలంటూ సర్కారుపై ఒత్తిడి తెస్తున్నది. అందుకే ఇటీవల కోతలతోనైనా రైతుభరోసా ఎకరానికి రూ.12,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకువచ్చింది. గతంలో రుణమాఫీ విషయంలోనూ దాటవేత ధోరణి అవలంబించిన రేవంత్ సర్కారు మెడలువంచి అమలయ్యేలా చేసింది.
కాంగ్రెస్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించినట్టే ఇప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యవహరిస్తున్నది. గద్దెనెక్కినా తన తీరు మార్చుకోవడం లేదు. అబద్ధాల పునాదులపై ఏర్పడిన సర్కార్‌ను అబద్ధాలతోనే నిలబెట్టుకోవాలని ఆ పార్టీ చూస్తున్న ది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి కేసీఆర్ సర్కార్‌పై ఎంతలా దుష్ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. కాళేశ్వరం కూలిపోయిందని, లక్ష కోట్లు గోదారి పాలయ్యాయని, 90 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. లేనిపోని విష ప్రచారం చేశారు. రైతన్నలకు పెట్టుబడి సాయం కోసం తీసుకొచ్చిన బృహత్తర పథకం రైతుబంధుపై కూడా దుష్ప్రచారం చేశారు. ప్రగతిభవన్‌లో లంకె బిందెలున్నాయని, 150 గదులున్నాయని కనీస సోయి లేకుండా మాట్లాడారు. ఇలా చెప్పుకొం టూ పోతే కాంగ్రెస్ నాయకులు నాడు చేసిన విష ప్రచారాలు ఎన్నెన్నో. కనీసం బాధ్యతాయుతమైన పదవిలో వచ్చాకైనా వారు మార డం లేదు. ఇంకా ఎక్కువే దుష్ప్రచారం చేస్తున్నారు.
మొదటి నుంచి డైవర్షన్లు, లీకులు, గత ప్రభుత్వంపై దుష్ప్రచారం, కుట్రలు, కుయుక్తుల మీదనే పాలన సాగిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిన పథకాలు, అభివృద్ధి పనులపై ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉన్నారు. బీడు భూముల్లో బంగారం పండేలా చేసిన కాళేశ్వరంపై, చిమ్మ చీకట్ల తెలంగాణలో వెలుగులు నింపిన 24 గంటల విద్యుత్తుపై కమిషన్ల పేరిట కుట్రలు చేస్తున్నారు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ఇప్పుడు సిగ్గు లేకుండా అదే ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతున్నారు. రాళ్లు, రప్పలకు రూ.20 వేల కోట్లు రైతుబంధు ఇచ్చారని ఒక రు, కొండలకు, కోనలకు రూ.50 వేల కోట్లు తగిలేశారని మరొకరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పన్నాగం పన్నుతున్నారు. డబుల్ బెడ్రూం విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఆ ఇండ్ల నాణ్యత బాగాలేదని గతంలో విమర్శించి ఇప్పుడు అవే ఇండ్లను మూసీ బాధితులకు పంచుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో ఆరున్నర లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇవ్వగా.. ఒక్కటీ ఇవ్వలేదని బుకాయిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ భర్తీచేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి గప్పాలు కొట్టడమే కాకుండా, బీఆర్ఎస్ సర్కార్ 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినా.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలా బాధ్యతను మరిచి బరితెగించి అబద్ధాలు చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నామన్న బాధ్యత లేదు. జవాబుదారీతనం అసలే లేదు. నిజం చెప్పాలన్న ఆలోచన లేదు. వాస్తవాలు వెల్లడించాలన్న ధ్యాసే లేదు.
పారదర్శకత పాటించాలన్న పట్టింపే లేదు. బీఆర్ఎస్ది ఫామ్‌హౌజ్ పాలన అని, కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వరని, బీఆర్ఎస్ నేతలకు అహంకారం పెరిగిందని గతంలో లేని పోని విష ప్రచారం చేశారు. ఇప్పుడు అలాగే చేయాలని చూశారు. కానీ, తెలివైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌కు కర్రు కాల్చి వాత పెట్టారు. కర్షకులను కంటికి రెప్పలా కాచుకునే ఫార్మర్ పాలన కావాలని.. ప్రజలను పీడించే ప్రజాపాలన వద్దని కరాఖండిగా చెప్పారు.
– (వ్యాసకర్త: బీఎన్‌రావు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు)
డాక్టర్ బీఎన్ రావు 98668 34717